
Kamareddy Crime News
Kamareddy : కామారెడ్డిలో అదృశ్యమైన ముగ్గురు పిల్లలను తండ్రే చెరువులో పడేసి చంపాడు. రూ.5 లక్షల అప్పు భారం కావడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ఇస్మాయిల్ ఒప్పుకున్నాడు.
Kamareddy : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన ముగ్గురు చిన్నారుల కథ చివరకు కన్నీటి గాథగా ముగిసింది. స్థానిక ఆర్బీ నగర్‌కు చెందిన శీపత్ (8), ఆయత్ (7), మరియం (5) అనే ముగ్గురు పిల్లలు స్థానిక పెద్ద చెరువులో శవాలై తేలారు. ఈ దారుణానికి ఒడిగట్టింది మరెవరో కాదు, కన్నతండ్రే కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. అప్పుల బాధ తాళలేక, ఆడపిల్లలను పెంచలేననే సాకుతో కన్నపిల్లలనే కాలయముడిలా చెరువులో ముంచేసిన వైనం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది.
పథకం ప్రకారం హత్య
శనివారం ఉదయం తన ఆటోలో ముగ్గురు పిల్లలను ఎక్కించుకున్న తండ్రి ఇస్మాయిల్, వారిని నేరుగా కామారెడ్డిలోని పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి ముగ్గురు పిల్లలను చెరువులోకి తోసేశాడు. అంతటితో ఆగకుండా, పిల్లలు చనిపోయారని నిర్ధారించుకునే వరకు సుమారు అరగంట పాటు అక్కడే ఉండి నిశ్చలమై చూశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చి, పిల్లలు కనిపించడం లేదని నాటకమాడాడు. పోలీసులకు కూడా తానే స్వయంగా ఫిర్యాదు చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు.
తల్లి అనుమానమే నిజమైంది
పిల్లలు కనిపించకపోవడంతో తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది. తండ్రి ఇస్మాయిలే ఆటోలో పిల్లలను తీసుకెళ్లాడని, అతని ప్రవర్తనపై తనకు అనుమానం ఉందని ఆమె గట్టిగా చెప్పడంతో పోలీసులు ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో తన పాపాన్ని ఇస్మాయిల్ ఒప్పుకున్నాడు. తనకు రూ. 5 లక్షల వరకు అప్పులు ఉన్నాయని, భవిష్యత్తులో ఆడపిల్లలను పెంచడం భారం అనుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు చెరువులో గాలింపు చేపట్టి ముగ్గురు చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు.
కన్నీరుమున్నీరుగా కుటుంబ సభ్యులు
చెరువు గట్టున చిన్నారుల మృతదేహాలను చూసిన తల్లి, బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. అప్పుల బాధ ఉంటే కష్టపడి తీర్చుకోవాలి కానీ, అమాయకపు చిన్నారులను ఇలా బలితీసుకోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు ఇస్మాయిల్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం అప్పుల కోసమే ఇలా చేశాడా లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




