Hyderabad fake products gang: టీ పౌడర్ నుంచి వాషింగ్ పౌడర్ వరకూ అన్నీ నకిలీ.. హైదరాబాద్ లో డూప్లికెటింగ్ ముఠా

Hyderabad fake products gang: హైదరాబాద్ లో అన్నిరకాల వస్తువులను నకిలీ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు.
x

Hyderabad fake products gang

Highlights

Hyderabad fake products gang: హైదరాబాద్ లో అన్నిరకాల వస్తువులను నకిలీ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. వివరాలు ఇవే . .

Hyderabad fake products gang: టీ పౌడర్.. ఉప్పు.. డిటర్జెంట్ పౌడర్.. ఆఖరికి మస్కిటో రీఫిల్స్ కూడా డూప్లికేట్ చేసేస్తున్నారు. ప్రతి వస్తువుకు అసలులా ఉండే నకిలీలను తయారు చేసి మార్కెట్లోకి వదిలేస్తున్నారు కేటుగాళ్లు. ఇప్పటికే ఎన్నోసార్లు హైదరాబాద్ లో ఇలాంటి నకిలీ వస్తువులు తయారు చేసేవాళ్లను పట్టుకున్నారు. అయినా ఇంకా నకిలీ వస్తువుల తయారీ.. డంపింగ్ పెరిగిపోతోంది కానీ, తగ్గడం లేదు.

ఈ నేపథ్యంలో నగరంలో బ్రాండెడ్ వస్తువుల పేరుతో నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్న భారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సీసీఎస్, డీడీ ప్రత్యేక క్రైమ్ టీమ్ సభ్యులు, అఫ్జల్‌గంజ్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఈ ముఠా పట్టుబడింది. ప్రజల నిత్యవసర వస్తువులైన టీ పౌడర్, బట్టలు ఉతికే సర్ఫ్, దోమల నివారణ రీఫిల్స్ వంటి వాటిని కల్తీ చేస్తున్న కచ్చవా సురేందర్‌, హనుమాన్‌ రామ్‌, జైరామ్‌ రాబరీ అనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుత మార్కెట్‌లో సామాన్యుడు కొనే వస్తువుల్లో ఏది అసలైనదో, ఏది నకిలీదో గుర్తుపట్టలేనంతగా కేటుగాళ్లు చెలగాటమాడుతున్నారు. లాభాల కోసం కక్కుర్తి పడి చిన్నారులు తాగే పాల నుంచి వంటింట్లో వాడే కారం, పసుపు వరకు అన్నింటినీ కల్తీ చేస్తున్నారు. ఇటీవల రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో ఆరుగురు మృతి చెందడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు నగరంలోని హోల్‌సేల్ మార్కెట్లపై నిఘా పెట్టారు.

గుజరాత్ నుంచి తెచ్చి..

Hyderabad fake products gang: నిందితులు అత్యంత చాకచక్యంగా గుజరాత్ రాష్ట్రంలోని డీలర్ల నుంచి అతి తక్కువ ధరకు నాణ్యత లేని ముడి పదార్థాలను సేకరిస్తున్నారు. వాటితో పాటు ప్రముఖ కంపెనీల పేర్లతో ఉన్న నకిలీ ప్యాకింగ్ కవర్లను కూడా కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు తీసుకువచ్చిన ఈ ముడి పదార్థాలను బ్రాండెడ్ ప్యాకెట్లలో నింపి, అచ్చం అసలు వస్తువుల్లాగే కనిపింపజేస్తూ మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. వీటిని బేగంబజార్, అఫ్జల్‌గంజ్ వంటి ప్రధాన వాణిజ్య కేంద్రాల్లోని వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

పోలీసులు జరిపిన ఈ మెరుపు దాడుల్లో భారీ ఎత్తున నకిలీ సరుకు బయటపడింది. సుమారు 1,340 రెడ్‌లేబుల్ టీ పౌడర్ ప్యాకెట్లు, 100 తాజ్ మహల్ టీ ప్యాకెట్లు, 75 కేజీల లూజ్ టీ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వీల్, సర్ఫ్ ఎక్సెల్, టైడ్, ఏరియల్ వంటి బ్రాండెడ్ పేర్లతో ఉన్న వందలాది నకిలీ సర్ఫ్ ప్యాకెట్లను సీజ్ చేశారు. అలాగే 3,600 నకిలీ గుడ్ నైట్ లిక్విడ్ బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

Hyderabad fake products gang: ఈ ముఠాలోని ప్రధాన నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో ఏడుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నకిలీ వస్తువుల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని, తక్కువ ధరకు వస్తున్నాయని నాణ్యత లేని వస్తువులను కొని మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా వస్తువు కొనేటప్పుడు ప్యాకింగ్, లోగోలను నిశితంగా గమనించాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories