స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది: ₹10 లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరి!

స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది: ₹10 లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరి!
x
Highlights

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల్లోకి జారుకుంది. సెన్సెక్స్‌ 1400 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు నష్టపోయి, మదుపర్లకు రూ.10 లక్షల కోట్ల నష్టం. స్టాక్‌ మార్కెట్ పతనానికి కారణాలు ఏంటో తెలుసుకోండి.

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో ఉదయం నుంచే సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దాంతో పాటు ఇన్వెస్టర్ల అమ్మకాలు పెరగడంతో, సూచీలు మరింత దిగజారాయి.

సెన్సెక్స్‌ ఒక దశలో 1400 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ముఖ్యంగా ఐటీ, టెక్‌, ఆటో, టెలికాం రంగాల్లో అమ్మకాలు తీవ్రంగా కనిపించాయి. స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ షేర్లలోనూ అదే ధోరణి కొనసాగుతోంది.

అంతర్జాతీయంగా కూడా ఆసియా మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. టోక్యో, షాంఘై, హాంకాంగ్‌ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ప్రస్తుతం మార్కెట్‌ పరిస్థితి

మధ్యాహ్నం 1.26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,333 పాయింట్ల నష్టంతో 73,279 వద్ద ఉంది. నిఫ్టీ 405 పాయింట్ల నష్టంతో 22,139 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌లో ఉన్న 30 షేర్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ మినహా మిగతా అన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, టైటాన్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లు భారీగా నష్టపోయాయి.

ఈ ఒక్కరోజులోనే మదుపర్ల సంపద దాదాపు ₹10 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. బీఎస్‌ఈలో నమోదైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.383 లక్షల కోట్లకు పడిపోయింది.

స్టాక్‌ మార్కెట్‌ పతనానికి కారణాలు

అంతర్జాతీయ ప్రతికూలతలు:

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాణిజ్య యుద్ధ భయాలు రేపుతూ వరుసగా టారిఫ్‌ ప్రకటనలు చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. మెక్సికో, కెనడా నుంచి దిగుమతులపై సుంకాలు విధిస్తూ, మార్చి 4 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. తాజా ప్రకటనల్లో చైనా దిగుమతులపై 10% అదనపు సుంకం కూడా విధిస్తానని స్పష్టం చేశారు. యూరప్‌పైనా 25% సుంకాలు ఉంటాయని పేర్కొన్నారు.

ఈ చర్యల కారణంగా గ్లోబల్‌ ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగింది.

బ్యాంకుల బలహీన ఆర్థిక ఫలితాలు:

దేశీయ బ్యాంకుల నాలుగో త్రైమాసిక ఫలితాలు కూడా నిరాశపరిచేలా ఉంటాయనే అంచనాలు మార్కెట్‌ను మరింత ఒత్తిడికి గురిచేశాయి. ఇప్పటికే క్యూ3 ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో క్యూ4పై మరింత నిరాశ నెలకొంది.

ఎఫ్‌ఐఐల అమ్మకాలు:

విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఇన్నాళ్లూ డీఐఐలు (DIIs) కొనుగోళ్ల ద్వారా మార్కెట్‌ను నిలబెట్టాయి. కానీ ప్రస్తుతం డీఐఐలు కూడా కొత్త పెట్టుబడులకు వెనకడుగేస్తున్నాయి.

చైనా ప్రభావం:

చైనా ప్రభుత్వం ప్రైవేట్‌ రంగానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. దీంతో ఎఫ్‌ఐఐలు భారత మార్కెట్ నుంచి చైనా మార్కెట్‌ వైపు వెళుతున్నారు. చైనా షేర్లు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. అంతేకాదు, చైనా ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటుందనే అంచనాలు కూడా ఎఫ్‌ఐఐల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అన్ని ప్రతికూల పరిణామాలు కలిసికట్టుగా దేశీయ మార్కెట్‌ను కుదేలు చేశాయి. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories