
రైల్వే కొలువుల జాతర.. 11,127 ఏఎల్‌పీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
RRB Recruitment 2026: రైల్వేలో కొలువు కొట్టాలని కలలు కనే నిరుద్యోగులకు భారతీయ రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2026-27 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 11,127 పోస్టుల భర్తీకి రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలపడంతో, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదలకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు మేలు చేకూరేలా దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో 674 ఉద్యోగాలు కేటాయించడం విశేషం.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి). అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ నెలాఖరులోనే అంటే ఫిబ్రవరి చివరి వారంలోపే అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే.. ఇది మొత్తం మూడు ప్రధాన దశల్లో అత్యంత పారదర్శకంగా సాగనుంది. మొదటి దశలో CBT-1 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని రెండో దశ CBT-2కి ఎంపిక చేస్తారు. ఈ రెండు దశల తర్వాత అభ్యర్థులకు మానసిక సామర్థ్య పరీక్ష అంటే CBAT (కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్) ఉంటుంది. ఈ మూడు వడపోతల్లో నెగ్గిన వారికి చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది జాబితాను ప్రకటిస్తారు.
చాలా కాలం తర్వాత రైల్వే శాఖ నుంచి ఇంత భారీ స్థాయిలో ఏఎల్‌పీ నోటిఫికేషన్ వస్తుండటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది. రైలు ఇంజిన్ నడపాలనే ఆశయం ఉన్న యువతకు ఇది ఒక సువర్ణావకాశం. మరిన్ని అప్‌డేట్స్ కోసం, అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడం కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్లను సందర్శిస్తూ ఉండాలి. పరీక్షల సిలబస్, ప్రిపరేషన్ స్ట్రాటజీని ఇప్పుడే సిద్ధం చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




