Curry Leaves Farming: కరివేపాకు సాగుతో సిరుల పంట..

Curry Leaves Farming a Profitable Business
x

Curry Leaves Farming: కరివేపాకు సాగుతో సిరుల పంట..

Highlights

Curry Leaf Cultivation: కూరలో కరివేపాకును తీసేసినట్లుగా తీసేశారా అనే మాట ప్రజల నానుడిగా విరివిగా వినిపిస్తుంటుంది.

Curry Leaf Cultivation: కూరలో కరివేపాకును తీసేసినట్లుగా తీసేశారా అనే మాట ప్రజల నానుడిగా విరివిగా వినిపిస్తుంటుంది. కానీ నిజానికి దాని ప్రాముఖ్యతే వేరు. కరివేపాకు లేకుండా ఏ వంటకమూ సంపూర్ణం కాదు. రుచి, వాసనే కాదు అన్నింటా అమోఘమే. సాగులోనూ దాని తేజమే వేరు. అందుకే పుష్కలమైన ఔషధ గుణాలు కలిగిన కరివేపాకు ప్రస్తుతం ఖమ్మం జిల్లా రైతుకు సిరులు కురిపిస్తోంది. ఈ పంటను సాగు చేసిన రైతు లాభాల బాట పయనిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

భారతీయ వంటకాల్లో కరివేపాకు వినియోగం అధికంగా ఉంటుంది. చాలామంది దీనిని కేవలం రుచి కోసమే వంటల్లో వేస్తారని అనుకుంటారు. కానీ కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు. కమ్మని రుచి, చక్కని సువాసన కరివేపాకు సొంతం. మన పూర్వికులు ఇప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నారంటే అందుకు కరివేపాకూ ఒక కారణమే. అందుకే కరివేపాకు ప్రాముఖ్యతను గుర్తించిన ఖమ్మం జిల్లా పల్లిపాడు గ్రామానికి చెందిన శరణు సత్యం వైరాలోని రిజర్వాయర్ సమీపంలో సుమారు పది ఎకరాల్లో కరివేపాకు సాగు చేస్తున్నారు. మంచి ఆదాయం గడిస్తూ ఆర్ధికాభివృద్ధిని సాధిస్తున్నారు.

పేరు శరణు సత్యం అయినా ఇక్కడి వారంతా కరవేపాకు సత్యం అని పిలుస్తారు. ఉదయం మొదలుకుని రాత్రి వరకు పొలంలోనే తన రోజును గడుపుతారు. అలా 365 రోజులు కరివేపాకు సాగులోనే ఉంటారు. పంటను ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు.

ఒక్కసారి మొక్క నాటితే సుదీర్ఘకాలం వరకు మళ్లీ నాటే అవసరం లేదంటున్నారు ఈ సాగుదారు. మార్కెట్లో కరివేపాకు టన్ను ధర 10 వేల నుంచి 20 వేల వరకు పలుకుతోందని రైతు తెలిపారు. వైరా నుంచి రాజమండ్రి, వరంగల్, హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలకు కరివేపాకును ఎగుమతి చేస్తూ చక్కటి ఆదాయం పొందుతున్నారు.

ఏడాదిలో 3 సార్లు కోత కోయవచ్చు. తక్కువ పెట్టుబడితో అధిక లాభం దక్కుతుంది. అయితే మార్కెటింగ్ విషయంలో మాత్రం రైతు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు. గత 30 ఏళ్లుగా కరివేపాకును సాగు చేస్తున్న ఈ సాగుదారు గతంలో మార్కెటింగ్‌ మెళకువలు తెలియక ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు పక్కా ప్రణాళికతో పంటలను వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంట కరివేపాకని మార్కెట్ చేసుకునే సత్తా ఉంటే లక్షలు సంపాదించుకోవచ్చని సత్యం చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories