logo
వ్యవసాయం

సమగ్ర నాటుకోళ్ల పెంపకంలో రాణిస్తున్న యువరైతు పల్లె రాజు

Desi Hen Farming BY Young Farmer Raju
X

సమగ్ర నాటుకోళ్ల పెంపకంలో రాణిస్తున్న యువరైతు పల్లె రాజు

Highlights

Desi Hen Farming: వినూత్న ఆలోచనలకు ప్రణాళికాబద్దమైన ఆచరణ తోడైతే ఏ రంగంలో అయినా రాణించవచ్చని నిరూపిస్తున్నాడు పెద్దపల్లి జిల్లాకు చెందిన యువరైతు.

Desi Hen Farming: వినూత్న ఆలోచనలకు ప్రణాళికాబద్దమైన ఆచరణ తోడైతే ఏ రంగంలో అయినా రాణించవచ్చని నిరూపిస్తున్నాడు పెద్దపల్లి జిల్లాకు చెందిన యువరైతు. ఊస్మానియా యూనివర్సిటి నుంచి పట్టభద్రుడైనా స్వయం ఉపాధి పొందాలనే సంకల్పంతో నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టి సత్ఫలితాలను సాధిస్తున్నాడు యువరైతు రాజు. నాటుకోళ్లను పెంచి, వాటి గుడ్లను, మాంసాన్ని విక్రయించడంతో పాటు అనుబంధంగా కౌజులు, కడక్‌నాథ్‌ కోళ్లు, పెద్ద జాతి కోళ‌్లను పెంచుతూ ఆర్ధికంగా ఎదిగి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. చిన్న రైతు సైతం తక్కువ ఖర్చుతో పెంపకం చేపట్టి లాభాలు సాధించవచ్చని అనుభవపూర్వకంగా రుజువుచేస్తున్నాడు. తన ఫామ్‌ను ఓ మోడల్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.

పెద్దపల్లి జిల్లా అంతర్గామ్ మండలం రాయడండి గ్రామానికి చెందిన పల్లె రాజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంకామ్‌ పూర్తి చేశాడు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం వైపు ఇతని ఆలోచన పోలేదు. మారుమూల పల్లెటూరుకు చెందిన రాజు స్వగ్రామంలోనే స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం వినూత్నమైన దారిలో పయనించాలనుకున్నాడు. నాటుకోళ్ల పెంపకం గురించి తెలుసుకున్నాడు. రెండు సంవత్సరాలు పెపంకంపై పరిశోధనలు చేశాడు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రైతుల ఫామ్‌లను పరిశీలించాడు. పెంపకానికి ఏ రకాలు అనువైనవి, వాటిని ఏలా పెంచాలో రైతుల అనుభవాలను సేకరించాడు. పూర్తి అవగాహన వచ్చిన తరువాత మొదట 10 పెట్టెలు, రెండు పుంజులతో పెంపకాన్ని మొదలుపెట్టాడు.

చిన్న, సన్నకారు రైతు సైతం నాటుకోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం ఎలా పొందవచ్చో ప్రత్యక్షంగా నిరూపించేందుకే తక్కువ పెట్టుబడితో పెంపకాన్ని ప్రారంభించానంటున్నాడు రాజు. ఏ జాతి కోళ్లనైనా పెంచుకోవచ్చు కానీ స్థానిక మార్కెట్‌ లో ఏ కోళ్లకు గిరాకీ ఉందో వాటిని పెంచడం వల్ల రైతులకు లాభాలు దక్కుతాయంటున్నాడు. ఫ్రీరేంజ్‌లోనే కోళ్లను పెంచుతున్నాడు రాజు. రాత్రి వేళల్లో అవి సురక్షితంగా ఉండేందుకు ఓ షెడ్డును ఏర్పాటు చేసుకున్నాడు. పూర్తిస్థాయిలో షెడ్డులో నాటుకోళ‌్లను పెంపకం సరైన పద్ధతి కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు రాజు. షెడ్డులో పెంచడానికి క్రాస్ బ్రీడ్‌లు ఉంటాయంటున్నాడు.

ప్రస్తుతం తన ఫామ్‌లో నాటుకోళ‌్లతో పాటు అనుబంధంగా కడక్‌నాథ్‌, చీమకోళ‌లు, పెద్ద జాతి కోళ్లు, కంజులు, పావురాలు, కుందేళ‌్లు పెంచుతున్నాడు. అందరి రైతుల్లా కాకుండా వినూత్నంగా ఆలోచిస్తున్నాడు రాజు. అందుకే కోళ్లలోనే సమగ్ర పెంపకం చేపట్టి అదనపు లాభదాకమైన ఆదాయాన్ని పొందుతున్నాడు. దాణా, నీరు అందించడంలోనూ ప్రత్యేక పద్ధతులను పాటిస్తున్నాడు ఈ యువరైతు. సెమీ నిప్పల్ పద్ధతిలో కోళ్లకు నీటిని అందిస్తున్నాడు. ప్రతి రోజు ఉదయం ఉదయం 70 శాతం , సాయంత్రం 30 శాతం దాణాను అందిస్తున్నాడు. ఇలా సాయంత్రం వేళ దాణా ఇవ్వడం వల్ల గుడ్ల ఉత్పత్తి పెరుగుతుందని అంటున్నాడు రాజు. పెంపకంలో ఇలా వినూత్న విధానాలు అవలంభిస్తూ గుడ్లు, మాంసం ఉత్పత్తిని పెంచుతున్నాడు రాజు. నాటుకోడి మాంసానికి, గుడ్లకి మంచి డిమాండ్ ఉండటం వల్ల వాటిని స్థానికంగానే విక్రయిస్తున్నాడు. అందులో కొన్నింటిని పొదిగించి మళ్లీ కోడి పిల్లల ఉత్పత్తి చేపడుతున్నాడు. గత నాలుగేళ్లుగా ఈ రంగంలో రాణిస్తున్నాడు రాజు.

కోళ్ల పెంపకం అంత సులవైనది కాదని అభిప్రాయపడుతున్నాడు రాజు. చూడటానికి సులువుగా ఉన్నా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెబుతున్నాడు. పెంపకం ప్రారంభించిన ఆరు నెలల్లో సమస్యలు ఎదురయ్యాయని అంటున్నాడు. కోళ్లకు ఏ వ్యక్సిన్స్ వేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. వాటన్నింటిని అధిగమించేందుకు ఏడాది సమయం పట్టిందంటున్నాడు. కుటుంబ సభ్యుల సహకారము తన విజయ రహస్యమంటున్నాడు. కూలీల మీద ఆధారపడకుండా కుటుంబసభ్యులంతా కలిసికట్టుగా పెంపకం చేస్తున్నామని చెబుతున్నాడు. తద్వారా తక్కువ ఖర్చుతో చక్కటి ఆదాయం పొందుతున్నామంటున్నాడు.

తన చదువుతో సంబంధం లేని కోళ్ల పెంపకాన్నే కాదు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సొంతంగా ఇంక్యుబేటర్‌ను తయారు చేసి తన సత్తా చూపిస్తున్నాడు ఈ యువరైతు. తక్కువ విద్యుత్ వినియోగంతో 1300 గుడ్లను పొదిగించే సామర్ధ్యం కలిగిన ఇంక్యుబేటర్‌ను సంవత్సర కాలం కష్టపడి రూపొందించాడు. అందుకుగాను రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులను పొందాడు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు.


Web TitleDesi Hen Farming BY Young Farmer Raju
Next Story