logo
వ్యవసాయం

కాగ్నిజెంట్‌లో జాబ్ మానేసి.. 14 దేశాలకు తేనె ఎగుమతి..

Honey Bee Farming Success Story Of Farmer Banu Teja
X

కాగ్నిజెంట్‌లో జాబ్ మానేసి.. 14 దేశాలకు తేనె ఎగుమతి..  

Highlights

Honey Bee Farming: చదువుకున్నవారంతా కంపెనీల్లో ఉద్యోగమే చేయాలన్న రూలేమి లేదని , వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ...

Honey Bee Farming: చదువుకున్నవారంతా కంపెనీల్లో ఉద్యోగమే చేయాలన్న రూలేమి లేదని , వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ స్వశక్తితో తామే ఓ చిన్నపాటి పరిశ్రమను ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పించవచ్చని రుజువు చేస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన యువరైతు. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం పొంది లక్షల ఆదాయం అందుతున్నా తాతల కాలం నుంచి వస్తున్న తేనెటీగల పెంపకంవైపు దృష్టి సారించారు భాను తేజ. కృషి, పట్టుదలతో పెంపకంలో ఆటుపోట్లను, లాభనష్టాలను ఆకళింపు చేసుకొని నెమ్మదిగా ఉత్పత్తి పెంచుకుంటూ ముందుకు సాగుతూ తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అనతికాలంలోనే దేశవ్యాప్తంగా పది యూనిట్లను నెలకొల్పి తేనె ఉత్పత్తితో పాటు తేనెటీగల నుంచి ఉప ఉత్పత్తులను సేకరిస్తూ అదనపు ఆదాయం పొందుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. తేనెటీగల పెంపకంలో మంచి భవిష్యత్తు ఉందని భరోసా కల్పిస్తున్నారు.

తేనెపట్టులు గగనమైపోయిన ప్రస్తుత నేపథ్యంలో ఐరోపా కృత్రిమ ఈగల పెంపకంపై ఏలూరు జిల్లాకు చెందిన యువరైతు భాను తేజ దృష్టి సారించారు. ఇందుకోసం జిల్లాలోని విజయరాయి పరిశోధన కేంద్రంలో తేనె టీగల పెంపకంపై ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని నైపుణ్యం సాధించారు. మొదట రెండు బాక్సులతో తేనె టీగల పెంపకం మొదలుపెట్టి నేడు 2500లకు పైగా బాక్సులకు విస్తరించారు. దేశవ్యప్తంగా 10 యూనిట్లను నెలకొల్పారు. ఒక్కో యూనిట్ నుంచి ప్రతి నెల 10-15 టన్నుల తేనెను ఉత్పత్తి చేస్తూ చక్కటి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం గోపన్నపాలెం గ్రామంలో బత్తాయి తోటల్లో ఒక యూనిట్ ను ఏర్పాటు చేశారు భాను తేజ.

భాను తేజ తాతల నుంచి అంటే సుమారు 40 ఏళ్లుగా వారి కుటుంబ సభ్యులు తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక తనవంత వచ్చేసరికి చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని సైతం వీడి ఎంతో ఆశక్తితో తేనెటీగల పెంపకంవైపు అడుగులు వేశారు భాను తేజ. స్వదేశీ తేనె టీగలు తక్కువ దిగుబడి అందిస్తున్నాయని తెలుసుకుని ఐరోపాకు చెందిన ఎపీస్ మెలిఫెరా అనే తేనెటీగలను పెంచుతున్నారు ఈ పెంపకందారు. ఈ బీస్ చక్కటి తేనెను అందిస్తుండటంతో ఆ తేనెను ప్రపంచంలోని 15 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

ఒకేచోట, ఒకే పంటలో నెలల తరబడి పెట్టెలు ఉంచితే ఈగలకి ఆహారం దొరకక అవి పారిపోవడంతో పాటు తేనె ఉత్పత్తి పడిపోతుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్న భాను ఆయా పంటల సీజన్ బట్టి తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన చోట్లకి వెళ్లి తేనెను ఉత్పత్తి చేస్తుంటారు. తేనె టీగలు మకరందం సేవించడానికి వీలుగా పూతలు అధికంగా ఉండే పంటల్లో బాక్సులను ఏర్పాటు చేసి తేనెను సేకరిస్తారు. పుచ్చ, దోస, వాము, ధనియాలు, ఆవాలు కొబ్బరి, నిమ్మ, బత్తాయి, గానుగ, లిచి, ఇలా వివిధ రకాల పంటలు సేంద్రియ విధానంలో సాగయ్యే ప్రాంతాలనే పెంపకానికి ఎన్నుకుంటారు. తద్వారా నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు.

తేనెకు మాత్రమే కాదు తేనెటీగల ఉప ఉత్పత్తులకు మార్కట్‌లో మంచి డిమాండ్ ఉందంటున్నారు భాను. తేనెటీగల నుంచి సేకరించిన పుప్పొడి పెంపకందారుకు మంచి ఆదాయాన్ని ఆర్జించిపెడుతుందన్నారు. ఇలా ఒక్కో యూనిట్ నుంచి ఎంత లేదన్నా సుమారు 30 నుంచి 40 వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చునని తెలిపారు భాను. తాను స్వయం ఉపాధి పొందడంతో పాటు పది మందికి ఈ తేనెటీగల పెంపకంతో ఉపాధి కల్పిస్తున్నానని చెబుతున్నారు.

బీ కీపింగ్ పై ఆసక్తి ఉన్న యువకులకు విజయరాయిలోని పరిశోధన కేంద్రం తేనెటీగల పెంపకంలో శిక్షణ అందించడంతో పాటు ఉచితంగా 10 పెట్టెలను అందిస్తూ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 300 మందికి 3 వేల బాక్సులను ఉచితంగా అందించారు. ఆసక్తి ఉన్న యువకులు డిమాండ్ ఉన్న తేనెటీగల పెంపకంవైపు అడుగులు వేసి చక్కటి ఆదాయాన్ని పొందవచ్చునని భాను తేజ తెలిపారు.


Web TitleHoney Bee Farming Success Story Of Farmer Banu Teja
Next Story