సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం .. 42మంది సజీవదహనం

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం .. 42మంది సజీవదహనం
x

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం .. 42మంది సజీవదహనం

Highlights

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు మంటలు చెలరేగి 42మంది సజీవదహనం

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు - ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో ఏకంగా 42 మంది చనిపోయారు. మృతుల్లో 20 మంది మహిళలు కాగా.. 11 మంది చిన్నారులు ఉన్నారు. వీరంతా మక్కా నుంచి మదీనా వెళ్తున్న భారతీయ యాత్రికులు కావటం గమనార్హం. బదర్‌-మదీనా మధ్య ముఫరహత్‌ దగ్గర ఘటన జరిగింది. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాద్‌ వాసులు ఉన్నారు.


తెల్లవారు జామున యాత్రికులు మక్కాలో ప్రార్థనలు ముగించుకుని బస్సులో మదీనా వెళుతూ ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు అర్థరాత్రి సమయంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులందరూ నిద్రలో ఉండటంతో తేరుకునే లోపే ప్రాణాలు విడిచారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న సౌదీ సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలం దగ్గరకు చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి.


ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సీఎస్‌ని ఆదేశించారు. వెంటనే తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. సహాయం కోసం 7997959754.. 9912919545 నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో రెసిడెన్స్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ని అప్రమత్తం చేశారు. తెలంగాణకుక చెందిన వివరాలు అందించాలని ఆదేశించారు.


సౌదీ ప్రమాదంలో పలువురు హైదరాబాద్ వాసులు మృతిచెందినట్లు సమాచారం. మల్లేపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ లో 16 మంది టికెట్ బుక్ చేసుకోగా.. ఫ్లైజోన్ ట్రావెల్స్ లో మరో 24 మంది టికెట్స్ బుక్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు వేరే ఏజెన్సీ ద్వారా సౌదీకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. మక్కా వెళ్లిన వారి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుల్లో తమ వారు ఉన్నారేమోనని తెలుసుకునేందుకు ట్రావెల్ ఏజెన్సీల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్ నుంచి మొత్తం 44 మంది యాత్రికులు మక్కాకు వెళ్లారు. మరణించిన 16 మంది మల్లేపల్లి బజార్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన వారున్నారు. రహీమున్నీసా, అబ్దుల్ ఖాదీర్ మహ్మద్, ఫర్హీన్ బేగం, మహ్మద్ మస్తాన్, గౌషియా బేగం, మహ్మద్ మౌలానా, ఫర్వీన్ బేగం, షెహనాజ్ బేగం, షౌకత్ బేగం, మహ్మద్ సోహైల్, జకీన్ బేగం, జహీయ బేగంలు ఉన్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories