Zakir Naik: జకీర్‌ నాయక్‌ పర్యటనకు బంగ్లాదేశ్‌ ఆమోదం

Zakir Naik
x

Zakir Naik: జకీర్‌ నాయక్‌ పర్యటనకు బంగ్లాదేశ్‌ ఆమోదం

Highlights

Zakir Naik: బంగ్లాదేశ్‌లో యూనస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జహీర్‌ ఆ దేశ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి.

Zakir Naik: భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది బంగ్లాదేశ్. మన దేశం మీద తరచూ కుట్రలు పన్నే ఆ దేశ తాత్కాలిక సారధి మహ్మద్ యూనస్ తాజాగా మరిన్ని విద్రోహ కార్యకలాపాలకు తెర లేపారు. వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్‌‌ను తమ దేశానికి ఆహ్వానించారు. పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులు ప్రస్తుతం బంగ్లాలో పర్యటిస్తున్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌లో భాగంగా చూపించే పుస్తకాలను పాకిస్తాన్ అధికారులకు బహుకరించి కలకలం రేపారు. దీనిపై భారత నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు యూనస్ చర్యలను నిషితంగా గమనిస్తోంది భారత ప్రభుత్వం.

తేలుకు కొండిలోనే విషం.. కానీ మహ్మద్ యూనస్‌కు నిలువెల్లా విషం. పాకిస్తాన్, చైనాలకు దగ్గరవుతూ భారత్ మీద విద్వేషాన్ని చాటుకోవడంలో ముందుండే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మరోసారి తన దుష్ట బుద్ధిని చాటుకున్నాడు. పాకిస్తాన్ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్‌పర్సన్ జనరల్ సాహిద్ షంషాద్‌ మీర్జా ఇటీవల బంగ్లాదేశ్‌లో పర్యటించారు. మహ్మద్ యూనుస్‌తో ఆయన భేటీ అయ్యారు. ఇరుదేశాల సైనిక సంబంధాలపై వారు చర్చించారు. అనంతరం మీర్జాకు యూనస్ ఓ పుస్తకాన్ని బహుకరించాడు. 'ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్' అనే ఈ పుస్తకం కవర్ పేజీతో పాటు లోపలి చిత్రాలు షాక్ తెప్పించేవిగా ఉన్నాయి. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలన్నీ బంగ్లాదేశ్‌లో భాగంగా చూపించారు. పైగా తానేదో ఘన కార్యం చేసినట్లు మహ్మద్ యూనస్ ఈ ఫోటోను ట్వీట్ చేశారు. యూనస్ భారత్‌ను రెచ్చగొట్టేందుకే ఈ పరి చేసినట్లు స్పష్టమవుతోంది.


ఈ ఫోటోలను చూసిన భారతీయులు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిపై ఆగ్రహించారు. భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆయన చర్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్ తప్పుడు మ్యాప్‌లను ఎందుకు ప్రింట్ చేస్తున్నారంటూ యూనుస్‌కు ప్రశ్నలు సంధించారు. యూనుస్‌తో పాటు పాక్ అధికారులను జోకర్స్‌గా చిత్రీకరిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో యూనస్ పరువు కాస్తా పోయింది.

2024 సంవత్సరంలో యూనుస్‌ మరో సన్నిహితుడు నహీదుల్ ఇస్లాం బంగ్లాదేశ్ తప్పుడు మ్యాప్‌ను షేర్ చేశారు. ఆ మ్యాప్‌‌లో పశ్చిమ బెంగాల్, త్రిపుర, అసోంలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ కలిపి 'గ్రేటర్ బంగ్లాదేశ్'ను ఏర్పాటు చేయాలని నహీదుల్ ఇస్లాం డిమాండ్ చేయడంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ సోషల్ మీడియా పోస్ట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అతడు దీన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది.


యూనస్ పిచ్చి చేష్టలు చూస్తుంటే గ్రేటర్ బంగ్లాదేశ్' కోసం పిలుపునిస్తున్న అతివాద ఇస్లామిక్ గ్రూపులకు బంగ్లా సర్కారు వంతపాడుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 1971 సంవత్సరంలో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్య్రాన్ని సాధించింది. ఈ విషయంలో బంగ్లాదేశ్‌కు సాయం చేసిన ఏకైక దేశం భారత్ మాత్రమే. అందుకే భారత్ - బంగ్లాదేశ్ మధ్య బలమైన సంబంధాలు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 2024 జులైలో బంగ్లాదేశ్‌లో జరిగిన తిరుబాటుతో షేక్ హసీనా సర్కారు కూలిపోయింది. ఈ ఉద్యమం వెక పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందని అంటారు. ఫలితంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య గ్యాప్ పెరిగింది. ఆ తర్వాత మహ్మద్ యూనుస్ బంగ్లాదేశ్ అధికార పీఠం ఎక్కినప్పటి నుంచే భారత్ విరోధులైన పాకిస్థాన్, చైనాలతో అంటకాగుతున్నారు.ఈశాన్య భారత రాష్ట్రాలపై మహ్మద్ యూనుస్ విషం కక్కడం తొలిసారేం కాదు. గతంలో పలు అంతర్జాతీయ వేదికలపైనా దీని గురించి ఆయన మాట్లాడారు.


మహ్మద్ యూనుస్ ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలిసారిగా చైనాలో పర్యటించారు. అక్కడ చేసిన ప్రసంగంలో ఈశాన్య భారత రాష్ట్రాలను ఆయన ప్రస్తావించారు. "ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాల చుట్టూ భూమే ఉంది. అందువల్ల వాటికి సముద్ర మార్గంలో భద్రత కల్పించగల ఏకైక దేశం బంగ్లాదేశ్ మాత్రమే. ఇదొక పెద్ద అవకాశం. దీన్ని అదునుగా చేసుకొని మా ప్రాంతంలోకి చైనా తన ప్రభావాన్ని విస్తరించాలి. తద్వారా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి" అని యూనుస్ ఆనాడు వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది మే నెలలో జమ్మూకశ్మీరులోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన వెంటనే, పాక్‌పై భారత్ ఎటాక్ చేస్తుందనే వార్తలు వచ్చాయి. ఆ సందర్భంగా మహ్మద్ యూనుస్ సన్నిహితుడు, బంగ్లాదేశ్ ఆర్మీ రిటైర్డ్ మేజర్ జనరల్ ఫజ్లుర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌పై భారత్ దాడి చేస్తే, భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవడానికి చైనాకు బంగ్లాదేశ్ సహకరించాలని ఆయన కామెంట్ చేశారు.


భారత ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్‌ సిస్టర్స్ అంటారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 'చికెన్స్ నెక్ కారిడార్' భారత్‌కు చాలా ముఖ్యమైంది. దీని మీదుగానే ఈశాన్య రాష్ట్రాలతో భారత్ కనెక్ట్ అవుతుంది. 'చికెన్స్ నెక్ కారిడార్' పక్కనే బంగ్లాదేశ్ ఉంటుంది. ఈ కారిడార్‌ను తెంచి, ఈశాన్య రాష్ట్రాలకు భారత్‌ను దూరం చేయాలనే కోణంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనుస్ సన్నిహితులు ఎన్నో వ్యాఖ్యలు చేశారు. వీటిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'చికెన్స్ నెక్ కారిడార్' అనేది బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్‌లతో కూడిన 'బిమ్‌స్టెక్‌' కూటమిలోని దేశాలకు కీలకమైన కనెక్టివిటీ హబ్‌ అని తెలిపారు. బంగ్లాదేశ్ తాత్కాలిక సారధి కవ్వింపు చర్యలు, వివాదాస్పద వైఖరి నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగాళాఖాతంలో భారత్‌కు 6,500 కి.మీ. మేర పొడవైన తీరరేఖ ఉంది. నేపాల్, భూటాన్, మయన్మార్‌లకు భారత్ మీదుగా బంగ్లాదేశ్ వస్తువులను చేరవేసే ట్రాన్స్‌షిప్‌మెంట్ ఒప్పందాన్ని రద్దు చేసింది.


భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ను ఉగ్రవాదులకు అడ్డగా మార్చేశారు తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద మూకలతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ముంబయి ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి అయిన లష్కరే తయ్యిబా చీఫ్ హఫీజ్ సయీద్ బంగ్లాదేశ్‌లో తన ప్రభావాన్ని వేగంగా విస్తరిస్తున్నారు. తాజాగా సయీద్ సన్నిహితుడు ఇలాహి జహీర్‌ బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లాడు. ఆయనతో పాటు పలువురు ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జహీర్ అక్టోబర్ 25న ఢాకాకు చేరుకున్నాడని.. భారత సరిహద్దులో ఉన్న బంగ్లాలోని పలు ప్రాంతాలను సందర్శించినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో అతడు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు కూడా చేసినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కశ్మీర్‌ గురించి కూడా ప్రస్తావించినట్లు తెలిపాయి. ఇలాహి జహీర్‌ నవంబర్ 6-7 తేదీల్లో రాజ్‌షాహిలో జరిగే భారీ ఇస్లామీ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో యూనస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జహీర్‌ ఆ దేశ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి.


తాజా ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 28-29 తేదీలలో ఢాకాలో జరిగే కార్యక్రమానికి ఇస్లామిక్ ప్రచారకుడు జకీర్ నాయక్‌కు ఆహ్వానం పలికింది. ఈ చర్య భారత్‌తో ప్రకంపణలు రేపుతోంది. 2016 జూలైలో రాజధాని ఢాకాలోని ‘హోలీ ఆర్టిసన్ బేకరీ కేఫ్’ పై దాడి వెనుక జకీర్ నాయక్‌ ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపించాయి. ఈ దాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు.. జకీర్‌ నాయక్‌ బోధనలతో ప్రేరణ పొందారనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలోనే అప్పటి షేక్ హసీనా ప్రభుత్వం జకీర్‌ నాయక్‌ను బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించకుండా నిషేధించింది. ఆ నిషేధాన్ని ముహమ్మద్ యూనస్ తొలగించడం వివాదాస్పదంగా మారింది. ఈ విధంగా భారత వ్యతిరేక శక్తులన్నీ బంగ్లాలో ఒక్కచోటికి చేరుతుండడంతో ఏదైనా కుట్ర పన్నుతున్నారా అని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలను భారత భద్రతా బలగాలు సునిశితంగా పరిశీలిస్తున్నాయి.


భారత్‌‌లో జకీర్ నాయక్ యువతను రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణలున్నాయి. వివిధ మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించారనే ఆరోపణలతో 2016లో ఎన్‌ఐఏ ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జకీర్‌ నాయక్‌పై కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ తదితర ఆరోపణల కింద దర్యాప్తు చేస్తోంది. ఢాకాలో ఉగ్రవాద దాడి తర్వాత అతను ఆ దేశం నుంచి మలేసియాకు పరారయ్యాడు. అక్కడ శాశ్వత నివాస హోదాను పొందాడు. తమ దేశంలో సమస్యలు సృష్టించనంత వరకు జకీర్‌ నాయక్‌ను బహిష్కరించలేమని, భారత్‌కు పంపే ప్రసక్తే లేదని మలేషియా ప్రభుత్వం తెలిపింది. కాగా ఇటీవల అతన్ని భారత్‌‌కు అప్పగించేందుకు మలేసియా ప్రభుత్వం సానుకూలతను ప్రకటించింది. కాగా బంగ్లాదేశ్‌లో యూనస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జహీర్‌ ఆ దేశ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 2025లో అతడు వారం రోజులకు పైగా బంగ్లాదేశ్‌లో పర్యటించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories