
బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ క్లీన్ స్వీప్..భారీ మెజారిటీతో తారిఖ్ రెహ్మాన్ విజయం
Bangladesh Election: భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఫిబ్రవరి 12న జరిగిన 13వ పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఖలేదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) కూటమి ప్రభంజనం సృష్టించింది. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో బీఎన్‌పీ, దాని మిత్రపక్షం జమాత్-ఏ-ఇస్లామీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠం దిశగా దూసుకెళ్తున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిఖ్ రెహ్మాన్ ఈ ఎన్నికల్లో తన సత్తా చాటారు. ఆయన పోటీ చేసిన రెండు చోట్లా అంటే ఢాకా-17, బోగ్రా-6 స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. పార్టీ మీడియా సెల్ సభ్యుడు షైరుల్ కబీర్ ఖాన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. మరోవైపు పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ కూడా తన నియోజకవర్గం ఠాకూర్ గావ్-1 లో ముందంజలో ఉన్నారు. అక్కడ ఆయనకు 39,101 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థికి కేవలం 25,976 ఓట్లు మాత్రమే వచ్చాయి.
బంగ్లాదేశ్ ఎన్నికల్లో పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు:
శఫీకుర్ రెహ్మాన్: జమాత్-ఏ-ఇస్లామీ చీఫ్ శఫీకుర్ రెహ్మాన్ ఢాకా-15 నుంచి 85,131 ఓట్లతో ఘనవిజయం సాధించారు.
బాబీ హజ్జాజ్: ఢాకా-13లో బీఎన్‌పీ మద్దతు ఉన్న అభ్యర్థి బాబీ హజ్జాజ్ (90,601 ఓట్లు) మౌలానా మామునుల్ హక్ (86,889 ఓట్లు) ను ఓడించి సంచలనం సృష్టించారు.
ఫజలూర్ రెహ్మాన్: కిషోర్‌గంజ్-4 లో బీఎన్‌పీ అభ్యర్థి ఫజలూర్ రెహ్మాన్ ఏకంగా 70,000 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థిని మట్టికరిపించారు.
నూర్ అల్ హక్ నూర్: పతుఖాలీ-3 నుంచి నూర్ అల్ హక్ నూర్ విజయం సాధించగా, ఆయన ప్రత్యర్థి స్వయంగా అభినందనలు తెలిపారు.
ఓడిపోయిన నేతలు వీరే..
విజయం అందరినీ వరించలేదు. కొందరు హేమాహేమీలు కూడా ఈ ఎన్నికల్లో వెనుకబడ్డారు.
మియా గులాం పర్వార్: జమాత్-ఏ-ఇస్లామీ సెక్రటరీ జనరల్ మియా గులాం పర్వార్ ఖుల్నా-5 లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. బీఎన్‌పీ అభ్యర్థి మహ్మద్ అలీ అస్గర్ ఆయనపై 2,702 ఓట్ల తేడాతో గెలిచారు.
శిశిర్ మనీర్: సునమ్ గంజ్-2 లో పోటీ చేసిన జమాత్ అభ్యర్థి శిశిర్ మనీర్ తన ఓటమిని అంగీకరిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ప్రత్యర్థి నాసిర్ ఉద్దీన్ చౌదరీకి అభినందనలు తెలిపారు.
కూటమి రాజకీయాలు
నేషనల్ సిటిజన్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల ప్రభావం చూపింది. రంగపూర్‌లో ఎన్‌సీపీ సభ్యుడు అక్తర్ హుస్సేన్ విజయం సాధించగా, కోమిల్లా-4 లో హసనత్ అబ్దుల్లా ముందంజలో ఉన్నారు. అలాగే షప్లా కోలి గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పటివరకు 5 స్థానాల్లో విజయం సాధించినట్లు ఆసిఫ్ మహమూద్ వెల్లడించారు. జమాత్ దిగ్గజ నేత మీర్ ఖాసిం అలీ కుమారుడు మీర్ అహ్మద్ బిన్ ఖాసిం కూడా ఢాకా-14 నుంచి లక్షకు పైగా ఓట్లు సాధించి విజయం దిశగా సాగుతున్నారు.
బంగ్లాలో కొత్త ప్రభుత్వం
తాజా ఫలితాల సరళిని బట్టి చూస్తే బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించేలా కనిపిస్తోంది. షేక్ హసీనా పాలనకు చరమగీతం పాడిన బంగ్లా ప్రజలు, ఇప్పుడు తారిఖ్ రెహ్మాన్ నాయకత్వంపై నమ్మకం ఉంచారు. ఇంకా కొన్ని స్థానాల ఫలితాలు రావాల్సి ఉండగా, అధికారికంగా ప్రభుత్వం ఏర్పడటానికి ముహూర్తం సిద్ధమైంది. ఈ మార్పు భారత్-బంగ్లా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




