Monkey Prices : చైనాలో కోతుల కొరత.. ఒక్కోదాని రేటు రూ. 18 లక్షలు..బంగారం కంటే స్పీడ్‌గా పెరుగుతున్న ధరలు

Monkey Prices : చైనాలో కోతుల కొరత.. ఒక్కోదాని రేటు రూ. 18 లక్షలు..బంగారం కంటే స్పీడ్‌గా పెరుగుతున్న ధరలు
x
Highlights

చైనాలో కోతుల కొరత.. ఒక్కోదాని రేటు రూ. 18 లక్షలు..బంగారం కంటే స్పీడ్‌గా పెరుగుతున్న ధరలు

Monkey Prices : చైనాలో ప్రస్తుతం బంగారం ధర కంటే కోతుల ధరలే ఎక్కువగా పెరిగిపోతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చైనాలో కొత్త ఔషధాలపై జరుగుతున్న విపరీతమైన పరిశోధనల కారణంగా, ల్యాబ్‌లలో ప్రయోగాల కోసం వాడే కోతుల డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. ఒక్కో కోతి ధర ఇప్పుడు సుమారు 1,40,000 యువాన్లు (దాదాపు రూ.18.37 లక్షలు) పలుకుతోంది. విశేషమేమిటంటే ఈ ధర చైనాలో సగటు ఉద్యోగి వార్షిక జీతం కంటే చాలా ఎక్కువ. గత ఐదేళ్లలో వీటి ధరలు ఏకంగా రెట్టింపు అయ్యాయి.

సాధారణంగా ఏదైనా కొత్త మందును మార్కెట్లోకి తెచ్చే ముందు ప్రీ-క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. అంటే ఆ మందు శరీరంలో ఎలా పనిచేస్తుంది? ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? వంటివి తెలుసుకోవడానికి వీటిపై ప్రయోగాలు చేస్తారు. ఇటీవల చైనా బయోటెక్ కంపెనీలు గ్లోబల్ ఫార్మా సంస్థలతో భారీ డీల్స్ కుదుర్చుకోవడంతో ఈ ప్రయోగాలు మరింత పెరిగాయి. ఒక కొత్త యాంటీబాడీ డ్రగ్ పరీక్షించాలంటే సుమారు 70 నుంచి 100 కోతులు అవసరమవుతాయి. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధరలు చుక్కలను తాకుతున్నాయి.

బంగారం ధరలతో పోల్చితే కోతుల ధరల పెరుగుదల రేటు భారీగా ఉంది. 2019లో చైనాలో బంగారం ధర గ్రాముకు 600 యువాన్లు ఉండగా, 2025 నాటికి అది 1,160 యువాన్లకు చేరింది. అంటే బంగారం ధర రెట్టింపు అయితే, కోతుల ధరలు అంతకంటే ఎక్కువే పెరిగాయి. 2021లో 70,500 యువాన్లు ఉన్న కోతి ధర, ఇప్పుడు లక్షన్నర యువాన్లకు చేరువలో ఉంది. 2023లో కోవిడ్ వ్యాక్సిన్ల పరీక్షల సమయంలో అయితే ఒక్కో కోతిని 1,70,000 యువాన్ల (రూ.22.31 లక్షలు) చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది.

రాబోయే కాలంలో ఈ కొరత ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 నుంచి 2027 మధ్య ఏటా సుమారు 60 వేల కోతులు అవసరమవుతాయని, కానీ సరఫరా మాత్రం 50 వేల లోపే ఉంటుందని అంచనా. ఇప్పటికే ప్రధాన పరిశోధనా సంస్థలైన వూషీ యాప్‌టెక్ వంటి కంపెనీలు వేల సంఖ్యలో కోతులను రిజర్వ్ చేసుకున్నాయి. అయితే, కోతుల ధరలు పెరిగినా ఔషధాల తయారీ ఖర్చుపై పెద్దగా ప్రభావం ఉండదని, ఎందుకంటే మందుల తయారీలో అసలు ఖర్చంతా 5 నుంచి 10 ఏళ్లు సాగే క్లినికల్ ట్రయల్స్(మనుషులపై ప్రయోగాలు)లోనే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories