Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు దారుణ హత్య.. రెండు వారాల్లో మూడో ఘటన..!!

Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు దారుణ హత్య.. రెండు వారాల్లో మూడో ఘటన..!!
x
Highlights

Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు దారుణ హత్య.. రెండు వారాల్లో మూడో ఘటన..!!

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. మైమెన్‌సింగ్‌ జిల్లాలో ఉన్న సుల్తానా స్వెటర్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం ఓ హిందూ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ కంపెనీలో భద్రతా గార్డుగా పనిచేస్తున్న బజేంద్ర బిశ్వాస్‌ అనే యువకుడిని అదే సంస్థలో విధులు నిర్వహిస్తున్న మరో గార్డు నోమన్‌ మియా కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు.

బజేంద్ర బిశ్వాస్‌, నోమన్‌ మియా ఇద్దరూ బంగ్లాదేశ్‌ ప్రభుత్వ భద్రతా విభాగమైన అన్సార్‌ దళానికి చెందినవారే. అన్సార్‌ దళ సభ్యులకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇస్తూ, ఆయుధాలు అందించి, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్‌ కంపెనీలలో భద్రతా బాధ్యతలు అప్పగిస్తుంది. ఈ క్రమంలోనే ఇద్దరూ సుల్తానా స్వెటర్స్‌ లిమిటెడ్‌లో గార్డులుగా విధులు నిర్వహిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఘటనకు ముందు ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు, వాగ్వాదాలు చోటు చేసుకోలేదు. ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు, నోమన్‌ మియా బజేంద్రతో సాధారణంగా సరదాగా మాట్లాడుతూనే తన వద్ద ఉన్న రివాల్వర్‌ను బయటకు తీసి ‘కాల్చనా?’ అంటూ హాస్యంగా ప్రశ్నించాడు. అది సరదా మాటగానే భావించిన బజేంద్ర ఏమాత్రం అప్రమత్తం కాలేదు. అయితే, ఒక్కసారిగా తుపాకీ పేలడంతో బుల్లెట్‌ బజేంద్ర ఎడమ తొడను చీల్చుకుంటూ వెళ్లింది.

తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడ ఉన్నవారు వెంటనే బజేంద్రను సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి చేరుకునేలోపే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నోమన్‌ మియాను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక నిర్లక్ష్యంగా చేసిన చర్యా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌లో మతఛాందసవాద శక్తులు చురుగ్గా మారుతున్నాయన్న ఆరోపణలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈశాన్య భారత రాష్ట్రాలను అస్థిరపరిచే ఉద్దేశంతో బంగ్లాదేశ్‌కు చెందిన మతఛాందసవాదులతో సంబంధాలు పెట్టుకున్న 11 మందిని అస్సాం పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories