బంగ్లాదేశ్‌లో ఆగని హింస: హిందూ ఉపాధ్యాయుడి ఇంటికి నిప్పు.. 24 రోజుల్లో 9వ దాడి!

బంగ్లాదేశ్‌లో ఆగని హింస: హిందూ ఉపాధ్యాయుడి ఇంటికి నిప్పు.. 24 రోజుల్లో 9వ దాడి!
x
Highlights

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. సిల్హెట్‌లో హిందూ ఉపాధ్యాయుడి ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు. ఫెని జిల్లాలో హిందూ యువకుడి హత్య. గత 24 రోజుల్లో జరిగిన 9వ ఘటనపై ప్రపంచ దేశాల ఆందోళన.

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి దారుణంగా మారుతోంది. సిల్హెట్ జిల్లా గోవైన్‌ఘాట్ ఉపజిల్లాలోని నందిర్‌గావ్ యూనియన్‌ పరిధిలో గల బహోర్ గ్రామంలో బీరేంద్ర కుమార్ డే అనే హిందూ ఉపాధ్యాయుడి ఇంటిపై ఆందోళనకారులు దాడికి దిగారు. ఒక ఇస్లామిక్ గ్రూపుకు చెందిన వ్యక్తులు ఆయన ఇంటికి నిప్పు పెట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ప్రాణాలతో బయటపడ్డ కుటుంబం

దుండగులు ఇంటికి నిప్పంటించిన సమయంలో ఉపాధ్యాయుడి కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వారు బయటకు రావడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ, సర్వం కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

మరోవైపు దారుణ హత్య

కేవలం గృహదహనాలే కాకుండా, ప్రాణ తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ వారం ప్రారంభంలో ఫెని జిల్లాలోని దగన్‌భుయాన్ ఉపజిల్లాలో సమీర్ దాస్ (27) అనే ఆటో డ్రైవర్‌ను ఛాందసవాదులు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. జగత్‌పూర్ గ్రామంలోని ఒక పొలం నుంచి అతడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తొమ్మిదవ ఘటన.. మౌనంగా యూనస్ ప్రభుత్వం

గడిచిన 24 రోజుల్లో బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిన తొమ్మిదవ ప్రధాన ఘటన ఇది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలకు రక్షణ కల్పించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హింస పెరుగుతుండటంపై ప్రపంచ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories