పెళ్లికి ముందు శృంగారం చేస్తే క్రిమినల్‌ కేసు.. వివాహేతర సంబంధం పెట్టుకున్నా జైలే..

Indonesia set to Punish sex Before Marriage With Jail Time
x

పెళ్లికి ముందు శృంగారం చేస్తే క్రిమినల్‌ కేసు.. వివాహేతర సంబంధం పెట్టుకున్నా జైలు

Highlights

Indonesia: కాలానికి అనుగుణంగా ప్రపంచ దేశాలు కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తున్నాయి.

Indonesia: కాలానికి అనుగుణంగా ప్రపంచ దేశాలు కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తున్నాయి. ప్రజలను మరింత భద్రత, హక్కులను కల్పించేందుకు శ్రీకారం చుడుతున్నాయి. కానీ ప్రపంచ దేశాల సంగతి ఎలా ఉన్నా.. ఇస్లాం దేశాలు మాత్రం అందుకు విరుద్ధం. మహిళలు, మైనార్టీలు, స్వలింగ సంపర్కులపై కఠిన చట్టాలు తీసుకొస్తున్నాయి. తాజాగా ఇండోనేసియా సంచలన నిర్ణయం తీసుకుంది. పెళ్లికి ముందే శృంగారం చేసినా.. వివాహేతర సంబంధం పెట్టుకున్నా.. జైలుకు వెళ్లాల్సిందే. ఇది ఆ దేశ ప్రజలకు మాత్రమే కాదు విదేశీయులకు కూడా వర్తిస్తుందట. మంచి బీచ్‌ల్లో ఎంజాయ్‌ చేయాలని వెళ్లే లవర్స్‌, ఫ్రెండ్స్‌కు కష్టాలు తప్పవంటున్నారు. ఇది ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపనున్నది.

ఇండోనేషియా ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా కలిగిన ఏకైక దేశం.. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకున్న దేశం ఇండోనేషియా. పర్యాటకులు ప్రత్యేకంగా ఇండోనేషియా తీర ప్రాంత నగరం.. బాలీలో గడిపేందుకు ఆసక్తి చూపుతారు. అక్కడి సముద్ర తీరంలో.. హాయిగా గడిపేందుకు.. అక్కడ పార్టీలు చేసుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తారు. ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి-జీడీపీలో ఐదు శాతం పర్యాటక రంగం నుంచే వస్తోంది. ఏటా కోటి 50 లక్షల మందికి పైగా పర్యాటకులు ఆ దేశానికి వస్తున్నారు. 18 వందల కోట్ల డాలర్ల ఆదాయం పర్యాటక రంగం నుంచే వస్తోంది. విదేశీ మారక ద్రవ్యం ఆ దేశానికి భారీగానే సమకూరడానికి టూరిజం ప్రత్యేక కారణం. అయితే ఇప్పుడు ఇండోనేషియా తాను కూర్చున్న కొమ్మను తనే నరుక్కునేందుకు సిద్ధమైంది. తమ దేశానికి వచ్చే విదేశీయులపై క్రిమినల్‌ లా కొరడా ఝలిపించనున్నది. తమ దేశానికి వచ్చే పర్యాటకులు భార్యభర్తలు కాకుండా శృంగారం చేసుకుంటే వ్యభిచారంగా గుర్తిస్తామని హెచ్చరించింది. అందుకు ప్రత్యేక ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ బిల్లుకు డిసెంబరు 15న ఇండోనేషియా ప్రభుత్వం ఆమోదం తెలపనున్నది. ఆ తరువాత దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నది. అయితే ఈ చట్టం కేవలం విదేశీయులపైనే వర్తిస్తుందా? ఇండోనేషియన్లకు వర్తించదా? జోకో విడోడో ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని ఎందుకు తెచ్చింది? ఈ చట్టం కింద ఎలాంటి శిక్షలను విధించనున్నది?

2022 జీ 20 దేశాలకు ఇండోనేషియా అధ్యక్షత వహించింది. 20 దేశాలకు చెందిన నేతలు బాలిలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి భారత్‌, అమెరికా, చైనా, బ్రిటన్‌ వంటి అగ్రదేశాలతో పాటు 20 దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరయ్యారు. రెండ్రోజుల పాటు జరిగిన సదస్సులు అట్టహాజంగా ముగించింది. ఆ తరువాత అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా భారత్‌కు అప్పగించింది. ఇంతవరకు భాగానే ఉన్నా.. తాజాగా పెళ్లికి ముందు శృంగారం నేరమంటూ సంచలన క్రిమినల్‌ చట్టాన్ని జోకో విడోడో ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టంతో పెళ్లికి ముందు శృంగారం, సహజీవనంపై నిషేధం విధించనుంది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా కఠిన చర్యలు తీసుకోనుంది. వీటన్నింటినీ వ్యభిచారం కింద పరిగణించి శిక్షిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఇండోనేషియా పౌరులతో పాటు తమ గడ్డపైకి వచ్చే విదేశీయులకు కూడా వర్తిస్తాయని ఆ దేశ న్యాయ శాఖ ఉప మంత్రి ఎడ్వర్డ్‌ ఒమర్‌ షరీఫ్‌ హియారిజ్‌ తెలిపారు. ఇండోనేషియా విలువలకు అనుగుణంగా ఈ క్రిమినల్ కోడ్‌ను తీర్చిదిద్దినందుకు మేం గర్విస్తున్నామని హియారిజ్‌ చెప్పారు. ప్రభుత్వ సిద్ధాంతాలు, విలువలకు వ్యతిరేకంగా దేశాధ్యక్షుడు లేదంటే దేశ అత్యున్నత సంస్థలను కించపరిచేలా ఎవరైనా వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని ముసాయిదా బిల్లులో హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా వివాహానికి ముందే శృంగారంలో పాల్గొన్నట్టు నిర్ధారణ అయితే ఏడాది జైలు శిక్ష, భారీ జరిమానాను విధించనున్నట్టు బిల్లు చెబుతోంది. సుదీర్ఘ సంప్రదింపులు, మానవ హక్కుల సంఘంతో భేటీ అనంతరం ఈ కొత్త క్రిమినల్ చట్టాన్ని రూపొందించారు.

నిజానికి ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సుహార్తో హాయంలో ఉదారవాద సంస్కరణలు తీసుకొచ్చారు. పర్యాటకర రంగాన్ని భారీగా ప్రోత్సహించారు. దీంతో ఆ దేశానికి భారీగా పర్యాటకకుల రాక ప్రారంభమైంది. ఇండోనేషియాకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. 1998లో సుహార్తో చనిపోయారు. ఆ తరువాత సుహార్తో ఆశయాలకు వ్యతిరేకంగా ఇండోనేషియా పాలకులు వ్యవహరిస్తున్నారంటూ.. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజా క్రిమినల్‌ చట్టంపైనా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టం 2019లోనే ఆమోదం పొందాల్సి ఉంది. కానీ.. అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ తరువాత.. ప్రజలు, మేధావులతో చర్చలు జరిపి... కొన్ని మార్పులతో జోకో విడోడో ప్రభుత్వం.. మూడేళ్ల తరువాత ఆ చట్టాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇస్లాం దేశమైన ఇండోనేషియాలో మహిళలు, మత పరమైన మైనార్టీలు, స్వలింగ సంపర్కులపై అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధిస్తోంది. ప్రత్యేకంగా ఎల్‌జీబీటీక్యూను లక్ష్యంగా చేసుకునే ఈ చట్టాన్ని తెచ్చారన్న విమర్శలు వస్తున్నాయి. ఇండోనేషియాలో స్వలింగ వివాహాలు నేరం. ఇస్లాం ప్రభావం తీవ్రంగా ఉన్న ఆ దేశంలో ఆంక్షలపై భారీ నిరసనలు చేపడుతున్నారు. ఇతర ఇస్లాం దేశాల్లో మాదిరిగా ఆందోళనలను ఇండోనేషియా ప్రభుత్వం కూడా ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. జోకో విడోడో ప్రభుత్వం తెస్తున్న విపరీతమైన చట్టాలకు కొన్ని ఇస్లామిక్‌ సంస్థల మద్దతు ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చట్టాన్ని ఎలా అమలు చేస్తారు? ఎవరు ఫిర్యాదు చేస్తారు? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తాజా క్రిమినల్‌ చట్టం అమలు కూడా ప్రశ్నార్థకంగా మారింది. వివాహేతర సంబందం విషయంలో బాధిత భార్య లేదంటే బాధిత భర్త ఫిర్యాదు చేయాలి. అలాగే వివాహానికి ముందు శృంగారంలో పాల్గొంటే.. బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు.. అయితే ఇండోనేషియా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 144 ప్రకారం.. కోర్టులో విచారణ ప్రారంభానికి ముందే ఫిర్యాదును వెనక్కి తీసుకునే వెసులుబాటును కల్పించారు. దురుద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేసే వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది మాత్రం వెల్లడించలేదు. ఇక ఇద్దరికి ఇష్టమై శృంగారం జరిగితే ఫిర్యాదు ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చేవారు విషయంలో భార్యనో, భర్తనో, తల్లిదండ్రులు వచ్చి ఎలా ఫిర్యాదు చేస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టంతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దేశ ప్రజలకు వర్తించడం వరకు ఓకే అని విదేశీయులపై కూడా ఆ చట్టం వర్తిస్తే పర్యాటకుల సంఖ్య పడిపోతుందంటున్నారు. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగాన్ని ఇండోనేషియా ప్రభుత్వం స్వయంగా ధ్వంసం చేసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేసిస్తున్నారు. ఇండోనేషియా ప్రభుత్వం మాత్రం ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేసేది లేదంటోంది. ఈ నెలలోనే తప్పకుండా చట్టాన్ని అమలు చేసి తీరుతామని తేల్చి చెబుతోంది. ఇండోనేషియా అమలు చేయనున్న చట్టాన్ని పాకిస్థాన్‌ ఇప్పటికే అమలు చేస్తుండడం గమనార్హం.

నిజానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు స్వలింగ వివాహాలకు అనుకూలంగా చట్టాలు తెస్తున్నాయి. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీలకు ప్రత్యేక హక్కులు, భద్రతను కల్పిస్తున్నాయి. కానీ అందుకు విరుద్ధంగా ఇస్లాం దేశాలు కఠిన చట్టాలను తెస్తున్నాయి. ఇండోనేషియా సైతం తిరుగమనం వైపు అడుగులు వేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories