Iran Israel War : ఖమేనీ మరణానికి భారీ మూల్యం తప్పదు.. ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ వార్నింగ్

Iran Israel War
x

Iran Israel War  

Highlights

ఇరాన్ అగ్రనేత అలీ లారిజానీ యుద్ధం ఐదో రోజున ట్రంప్‌ను నిలదీశారు. ఇజ్రాయెల్ కోసం అమెరికా సైనికులను బలిపెడుతున్నారని, 500 మంది సైనికులు చనిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Iran Israel War : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఇప్పుడు ఐదవ రోజుకు చేరుకుంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేస్తున్న అనాలోచిత పనుల వల్ల అమెరికా అనవసరంగా ఈ యుద్ధంలోకి కూరుకుపోతోందని ఆయన విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన లారిజానీ.. అమెరికా ప్రజల ప్రాణాలను ట్రంప్ పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు. అమెరికాకు తన దేశ ప్రయోజనాలు ముఖ్యమా లేక ఇజ్రాయెల్ ప్రయోజనాలు ముఖ్యమా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ముఖ్యంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న దాడుల్లో సుమారు 500 మందికి పైగా అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారని అలీ లారిజానీ పేర్కొనడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం అమెరికా తన రక్షణ వ్యవస్థలను మధ్య ప్రాచ్యం నుంచి ఇజ్రాయెల్‌కు మళ్లించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ముందు ముందు మరిన్ని పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ట్రంప్ తన ప్రాధాన్యతలను మార్చుకోకపోతే అమెరికా భారీ నష్టాన్ని చవిచూడక తప్పదని లారిజానీ స్పష్టం చేశారు.

మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం పై లారిజానీ ఆవేదన వ్యక్తం చేస్తూ, దీనికి అమెరికా, ఇజ్రాయెల్‌లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ యుద్ధం ఇరాన్ కావాలని కోరుకున్నది కాదని, శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తాము ఎంతో ప్రయత్నించామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా పేర్కొన్నారు. పొరుగు దేశాలతో సఖ్యతగా ఉంటూ ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని నెలకొల్పడమే తమ లక్ష్యమని, కానీ అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల తమను తాము రక్షించుకోవడానికి యుద్ధం చేయక తప్పడం లేదని ఆయన వివరించారు.

ప్రస్తుతం యుద్ధం ముదురుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్ ఇప్పటికే 500 క్షిపణులు, 2,000 డ్రోన్లతో విరుచుకుపడగా, అమెరికా కూడా గట్టిగానే బదులిస్తోంది. అమెరికా దాడిలో ఇరాన్‌కు చెందిన 17 యుద్ధ నౌకలు ధ్వంసమవ్వడమే కాకుండా, 2 వేల ప్రాంతాలపై దాడులు జరిగాయి. ఈ పరిణామాలు చూస్తుంటే పశ్చిమ ఆసియాలో శాంతి అనేది ఎండమావిలాగే కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories