అమెరికా బాటలో కెనడా..? భారత విద్యార్థుల వీసాలపై కత్తెర – 74% తిరస్కరణ


అమెరికా బాటలో కెనడా..? భారత విద్యార్థుల వీసాలపై కత్తెర – 74% తిరస్కరణ
అమెరికా బాటలోనే కెనడా వెళుతోందా? భారీగా విద్యార్థి వీసా దరఖాస్తుల తిరస్కారం 74 % భారతీయ విద్యార్థుల వీసాల తిరస్కరణ భారత్ మీదే కెనడా ఎందుకు గురి పెట్టింది?
జస్టిన్ ట్రుడో పోయి మార్క్ కార్నీ వచ్చినా భారత్ విషయంలో కెనడా వైఖరి మారలేదా? వలసల నియంత్రణ విషయంలో అమెరికా దారిలోనే ఆ దేశం వెళుతోందా? కెనడా ప్రభుత్వం భారతీయులే లక్ష్యంగా వీసాల జారీని తగ్గిండం చర్చనీయాంశంగా మారిపోయింది. తాజాగా 74 శాతం మేర భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తులను తిరస్కరించింది. కెనడాలో వీసా కార్యక్రమాన్ని కఠినతరం చేసే క్రమంలో వీసా తిరస్కరణలు భారీగా పెరిగాయని చెబుతున్నారు. మరోవైపు భారత్, బంగ్లాదేశ్ నుంచి వీసా మోసాలు పెరుగుతున్నాయన్న అనుమానాలతో కెనడా ప్రభుత్వం మరిన్ని నియంత్రణా చర్యలు చేపట్టిందని చెబుతున్నారు.
భారతీయ విద్యార్థులకు కెనడా పొగ పెడుతోందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దారిలోనే కెనడా ప్రధాని కార్నీ వెళుతున్నారా? తాజాగా ఆ దేశం తీసుకున్న నిర్ణయం చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కెనడా తీసుకుంటున్న చర్యలు భారతీయ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు జారీ చేసే స్టూడెంట్ పర్మిట్‌లల్లో వరుసగా రెండో ఏడాదీ కోత పడంది. ఉన్నత విద్య చదివేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి నలుగు భారతీయ విద్యార్థుల్లో ముగ్గురి వీసాలను అక్కడి అధికారులు తిరస్కరించారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తుల్లో ఏకంగా 74 శాతం తిరస్కరణకు గురైనట్టు ప్రభుత్వ గణాంకాల్లో తాజాగా వెల్లడైంది. 2023లో ఇదే కాలంలో తిరస్కరణ రేటు కేవలం 32శాతంగా ఉండటం గమనార్హం. ఇదే సమయంలో చైనా విద్యార్థుల దరఖాస్తుల్లో కేవలం 24 శాతం తిరస్కరణకు గురయ్యాయి.. స్థూలంగా చూస్తే మాత్రం ఆగస్టులో 40 శాతం మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసా దరఖాస్తులను కెనడా తిరస్కరించింది
కెనడాలో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. 2023 ఆగస్టులో 20,900 మంది దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది సంఖ్య ఏకంగా 4,515కు పడిపోయింది. 1000 కంటే ఎక్కువ వీసా దరఖాస్తుల ఆమోదం పొందిన దేశాల్లో కేవలం భారత్ విషయంలోనే తిరస్కరణ రేటు అత్యధికంగా ఉండటం విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. 2022లో భారతీయ విద్యార్థులకు అమెరికా 19శాతంతో ప్రథమ, కెనడా 18శాతంతో ద్వితీయ ప్రధాన గమ్యస్థానాలుగా ఉన్నట్లు ఎడ్‌టెక్ కంపెనీ అప్‌గ్రాడ్ పేర్కొంది. అయితే, 2023లో అమెరికాకు భారీగా దరఖాస్తులు పెరిగినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితుల కారణంగా ప్రత్యామ్నాయాలవైపు విద్యార్థులు చూస్తున్నట్లు వివరించింది. ఫలితంగా కెనడాకు కూడా 2022లో 18శాతం దరఖాస్తులు రాగా, 2025కు వచ్చేసరికి ఈ సంఖ్య 9శాతానికి తగ్గిందని వెల్లడించింది. అంతర్జాతీయ విద్యార్థి వీసా కార్యక్రమాన్ని కెనడా కఠినతరం చేసే క్రమంలో వీసా తిరస్కరణలు భారీగా పెరిగాయని చెబుతున్నారు.
విదేశీ విద్యకు అమెరికా తర్వాత కెనడా గతేడాది దాదాపు 10లక్షల మంది విదేశీ విద్యార్థులకు అవకాశం కల్పించింది. వీరిలో 41శాతం భారత్ నుంచే ఉన్నారు. తర్వాతి స్థానాల్లో చైనా, వియత్నాం ఉన్నాయి. విదేశీ విద్యార్థులకు అడ్మీషన్ ఇచ్చినట్టు కెనడాలోని విద్యా సంస్థలు ఈ లెటర్ ఆఫ్ ఎక్సెప్టెన్స్‌ను జారీ చేస్తాయి. ఇది ఉంటేనే విద్యార్థి వీసా మంజూరు అవుతుంది. అయితే వీసా దరఖాస్తుల్లో మోసాలపై ఉక్కుపాదం మోపుతుండటంతో తిరస్కరణ రేటు పెరిగిందంటున్నారు. 2023లోదాదాపు 1500 మోసపూరిత ఎక్సెప్టెన్స్ లెటర్స్‌ను గుర్తించారు. వీటిలో అధిక శాతం భారత్ నుంచి ఉన్నాయి. ఇక గతేడాది తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయడంతో 14 వేల లెటర్స్ ఆఫ్ ఎక్సెప్టెన్స్‌లల్లో మోసాలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. కాగా భారతీయుల తిరస్కరణ రేటు ఎక్కువగా ఉండటంపై కెనడా ప్రభుత్వం స్పందించింది. భారత స్టూడెంట్స్ ప్రతిభావంతులని, కెనడాకు వారి వల్ల ఎంతో లాభం కలిగిందని తెలిపింది. అయితే, వీసా జారీ అంశం కెనడా ప్రభుత్వ అధికారమని స్పష్టం చేసింది.
భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వీసా తిరస్కరణ ప్రాధాన్యత సంతరించుకుంది. 2023లో ఖలిస్తానీ మద్దతుదారు నిజ్జర్ హత్య ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. కాగా భారీ స్థాయిలో విద్యార్థి వీసాల దరఖాస్తులను కెనడా తిరస్కరించడానికి అక్కడి స్థానిక పరిస్థితులే కారణమని ఇమిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నివాస కొరత, మౌలిక సదుపాయాల కల్పన ఇబ్బందిగా మారడం, స్థానిక ఖర్చులు విద్యార్థులు భరించగలరా? అన్న విషయాలపై ఆందోళనల నేపథ్యంలోనే కెనడా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ పరిణామంతో విదేశీ విద్యార్థుల ట్యూషన్ ఫీజులపైనే ఆధారపడి నడుస్తున్న కెనడాలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలోనే కొన్నింటిని పెద్ద యూనివర్సిటీల్లో విలీనం చేస్తుండగా, మరికొన్ని మూసివేత ముప్పును ఎదుర్కొంటున్నాయి.
ఇదిలా ఉంటే అమెరికా, కెనడాలకు ప్రత్యామ్నాయం చూస్తున్న భారతీయ విద్యార్థులు జర్మనీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల మరో నివేదికలో వెల్లడైంది. జర్మనీ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో పాటు అక్కడి యూనివర్సిటీలు, కాలేజీలకు సరిపడా ప్రభుత్వ నిధులు అందుతున్నాయి. విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను జర్మనీ సర్కారు ప్రోత్సహాన్ని అందిస్తోంది. ఇంగ్లీష్ వచ్చిన భారతీయ విద్యార్థులకు సులభంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఫలితంగా గత ఐదు సంవత్సరాల్లో జర్మనీ విద్యా సంస్థలలో భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు రెట్టింపు అయ్యాయి. 2023లో జర్మనీలో భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు 49,500 ఉండగా, ఇవి 2025లో ఇప్పటివరకు దాదాపు 60,000కి పెరిగాయి. ఇంకా కెనడా, అమెరికాలతో పోలిస్తే జర్మనీలో విద్యార్థుల విద్యా వ్యయాలతో పాటు జీవన వ్యయాలు సైతం తక్కువే ఉంటాయి.
మరోవైపు వీసా మోసాలను అరికట్టేందుకు కెనడా మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్, బంగ్లాదేశ్ నుంచి వీసా మోసాలు పెరుగుతున్నాయన్న అనుమానాలతో సామూహికంగా వీసాలను రద్దు చేసే అధికారాల కోసం కెనడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి అమెరికా సంస్థలతో కలిసి ఇమిగ్రేషన్, రెఫ్యూజీ, సిటిజన్‌షిప్ కెనడా, కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ ఇమిగ్రేషన్ మంత్రిత్వశాఖకు ఇప్పటికే ఓ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మోసపూరిత విజిటింగ్ వీసా దరఖాస్తులను తిరస్కరించడం, రద్దు చేయడం కోసం కెనడా సంస్థలు-అమెరికా భాగస్వామ్యపక్షాలు ఓ వర్కింగ్ గ్రూపుగా ఏర్పడినట్లు నివేదిక వెల్లడించింది. ఎటువంటి సందర్భాల్లో సామూహిక వీసా రద్దు అధికారాలు ఉపయోగించాలనే అంశాలను వివరించినట్లు సమాచారం. మహమ్మారి, యుద్ధం తదితర అంశాలను ఉదాహరణగా పేర్కొన్నట్లు తెలిసింది. అంతేకాదు.. దీనికి సంబంధించిన ప్రతిపాదిత బిల్లు పార్లమెంటులోనూ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
కొన్నేళ్లుగా భారత్ నుంచి కెనడాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తులు పెరుగుతున్నాయి. 2024లో అంతర్జాతీయ విద్యార్థుల నుంచి కెనడాకు 20,245 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో భారత్, నైజీరియా నుంచే అధికంగా ఉన్నాయి. 2023 మేలో భారత్ నుంచి ఆశ్రయం కోరుతూ వచ్చిన విద్యార్థుల దరఖాస్తులు 500 వరకు ఉండగా, 2024 జూలై నాటికి నెలకు 2,000లకు పెరిగాయి.వీటికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఇమిగ్రేషన్ చట్టంలో సవరణలు ప్రతిపాదించినట్టు సీబీసీ పేర్కొంది. కెనడా నిర్ణయంపై వలసల హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. కెనడా ప్రభుత్వం తన ప్రయత్నాలను మానుకోవాలని దాదాపు 300 సంఘాలు విజ్ఞప్తి చేశాయి. చట్ట సవరణ అమలైతే ప్రస్తుతం అమెరికా నుంచి విదేశీయులను గెంటివేస్తున్నట్టుగానే కెనడా నుంచి కూడా విదేశీయులను మూకుమ్మడిగా గెంటేస్తారని ఇమిగ్రేషన్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తంచేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



