ఇమ్రాన్ ఖాన్ హత్యా గాసిప్పులపై అధికారులు స్పందన: ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు

ఇమ్రాన్ ఖాన్ హత్యా గాసిప్పులపై అధికారులు స్పందన: ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు
x

ఇమ్రాన్ ఖాన్ హత్యా గాసిప్పులపై అధికారులు స్పందన: ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు

Highlights

ఇమ్రాన్‌ ఖాన్‌ను హత్య చేశారా? సోషల్ మీడియాలో పుకార్లు పాకిస్తాన్ వ్యాప్తంగా ఆందోళనలు నిరసనలకు దిగిన పీటీఐ పార్టీ ఇమ్రాన్‌ ఖాన్ క్షేమంగా ఉన్నారు.. జైలు అధికారుల అధికారిక ప్రకటన

ఇంతకీ ఇమ్రాన్‌ ఖాన్ క్షేమంగానే ఉన్నారా? ఆయనపై ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా? పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ను జైలులో హత్య చేశారనే వార్తలను అధికారులు ఖండించినా అక్కడి ప్రభుత్వం మీద అనుమానాలు సజీవంగా ఉండిపోయాయి. అవినీతి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌కు సంబంధించిన క్షేమ సమాచారం బయటకు రావడం లేదు. జైలు అధికారులు ఆయన కుటుంబం సభ్యులను కలుసుకునేందుకు సైతం అనుమతించడం లేదు. దీంతో ఆయన పార్టీ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ శ్రేణులు తీవ్ర ఆందోళనతో ఉన్నాయి. ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ల మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


పాకిస్తాన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ వార్త ఒక్కసారిగా గుప్పుమంది.. అల్‌ ఖదీర్‌ ట్రస్ట్‌ భూ అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ 2023 ఆగస్టు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ఆయన జైలులోనే మరణించారంటూ సోషల్ మీడియా ద్వారా వదంతులు వ్యాపించాయి. బలూచిస్థాన్‌ విదేశాంగ శాఖ దీనిపై ఎక్స్‌లో పెట్టిన పోస్టు ఊహాగానాలను మరింత పెంచింది. పాక్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ అసీమ్‌ మునీర్‌, నిఘా విభాగం ఐఎస్‌ఐ ఇమ్రాన్‌ఖాన్‌ను హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయని ఆ పోస్టులో ఉంది. పాకిస్తాన్‌లో జరిగే పరిణామాలపై ఇమ్రాన్‌ ఖాన్‌ ఏదొక సందర్భంలో జైలు నుంచే స్పందించేవారు. అయితే ఇటీవల కాలంలో ఇమ్రాన్ నుంచి ఒక్క ప్రకటన, సమాచారం కానీ బయటకు రాలేదు. దీంతో ఇమ్రాన్ హత్యకు సంబంధించిన వార్తను నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇమ్రాన్‌ మద్దతుదారులు. ఆయన పార్టీ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు.


మరోవైపు ఇమ్రాన్‌ఖాన్ జైలులో అనారోగ్యంతో మరణించి ఉండొచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ వీటిని ధ్రువీకరించేలా అధికారికంగా ఒక్క ఆధారమూ బయటకు రాలేదు. ఇమ్రాన్‌ఖాన్ విషయంలో వచ్చిన వార్తలు పాకిస్తాన్ వ్యాప్తంగా కలకలం రేపాయి. దీంతో ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతివ్వాలని ఆయన సోదరీమణులతో కలిసి డిమాండ్‌ చేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ఉంటే.. అడియాలా జైల్లోనే ఉంటాడు.. లేకపోతే జైలు మార్చి ఉంటారు. జైలు మార్చితే సమాచారం ఇవ్వాలి కదా. కనీసం కుటుంబ సభ్యులకు అయినా జైలు మార్చే అంశం చెప్పాలి. ఇప్పుడు ఇదే అనుమానంపై ఇమ్రాన్‌ సోదరీమణులు అడియాలా జైలుకు వెళ్లారు. అయితే వారిని జైలు లోపలికి వెళ్లడానికి అనుమతించలేదు. ఇమ్రాన్‌కు కలిసేందుకు అసలు ఒప్పుకోలేదు. దాంతో పాటు తమ పట్ల పోలీసులు చాలా అవమానకరంగా ప్రవర్తించారని ఇమ్రాన్‌ సిస్టర్స్‌ నోరీన్‌ ఖాన్‌, అలీమా ఖాన్‌, ఉజ్మా ఖాన్‌లు ఆరోపించారు.


మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కలిసేందుకు జైలు అధికారులు ఎవరికీ అనుమతివ్వకపోవడంతో ఆయన మృతి వార్తలు మరింత ఊపందుకున్నాయి "ఇమ్రాన్ ఖాన్​ ఆరోగ్యంపై ఆందోళనల నేపథ్యంలో మేము శాంతియుతంగా నిరసన చేస్తున్నాం. మేము రోడ్లను బ్లాక్ చేయలేదు. ప్రజా రవాణాకు అడ్డుపడడం లేదు. ఇంకా ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించట్లేదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయట్లేదు.కానీ పోలీసులు మాకు అనుమతి ఇవ్వలేదు. మాతో చాలా దారుణంగా ప్రవర్తించారు. ఏం జరిగిందో మాకు తెలియడం లేదు’ అని తెలిపారు ఆయన సోదరీ మణులు. మేము నిరసన చేపట్టే ప్రదేశంలో ఉద్దేశపూర్వకంగా లైట్లు ఆఫ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. అని ఇమ్రాన్ సోదరి నోరీన్​ నీయాజీ ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు తమపై విచక్షణారహితంగా ప్రవర్తించారని ఆరోపించారు. నిరసనలకు సంబంధించినవిగా పేర్కొంటూ పలు వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి


ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్​క్షేమంగా ఉన్నారని జైలు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మృతి చెందారన్న వార్తలు నిరాధారమైనవని చెప్పారు. జైలులో మృతి చెందారన్న వార్తలను ఖండించారు. ఇమ్రాన్​ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, మంచి భోజనం కూడా అందిస్తున్నామని, వైద్య సహాయం అందుతుందని పేర్కొన్నారు.అదే విధంగా అడియాలా జైలు నుంచి ఇమ్రాన్​ను తరలించారంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని జైలు అధికారులు తెలిపారు. మరోవైపు పాక్ రక్షణ మంత్రి ఖవాజ్​ ఆసిఫ్​ కూడా ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. ఇమ్రాన్​ ఖాన్​ను జైలులో విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. బయటి కంటే జైల్లోనే ఆయన సౌకర్యవంతంగా ఉన్నారని, ఫైవ్​స్టార్​ హోటళ్లలో కూడా లభించని మంచి ఆహారాన్ని ఆయన పొందుతున్నారని తెలిపారు.


అల్‌ ఖాదిర్ కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీ దోషులుగా తేలారు. ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆమెకు ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇమ్రాన్‌, బుష్రాలకు 10 లక్షలు, 5 లక్షల పాకిస్థానీ రూపాయల జరిమానా విధించారు. అయితే ఇమ్రాన్ దంపతులతో పాటు మరో ఆరుగురిపైనా నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో 2023లో ఈ కేసు నమోదు చేసింది. లండన్‌లో ఉంటున్న పాక్‌ స్థిరాస్తి వ్యాపారి మాలిక్‌ రియాజ్‌ హుసేన్‌ నుంచి వసూలుచేసిన 19 కోట్ల పౌండ్లను బ్రిటన్‌ పాక్‌కు పంపగా, ఆ సొమ్మును ఇమ్రాన్‌ దంపతులు గోల్‌మాల్‌ చేశారని ఆరోపణ. ఇమ్రాన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు బ్రిటన్‌ నుంచి అందిన ఆ 19 కోట్ల పౌండ్లను జాతీయ ఖజానాలో జమ చేయకుండా, సుప్రీంకోర్టు గతంలో రియాజ్‌హుసేన్‌కు విధించిన జరిమానాలో కొంత మొత్తాన్ని ఆ నగదులో నుంచి కట్టడానికి అనుమతించారని అభియోగం.


మరోవైపు జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్​పై సుమారు 200కు పైగా కేసులు నమోదయ్యాయి. అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని, తనను అధికారానికి దూరంగా ఉంచేందుకు చేస్తోన్న కుట్ర అని ఇమ్రాన్ ఆరోపించారు.. తనను నిబంధనలకు విరుద్ధంగా జైల్లో పూర్తిగా ఒంటరిగా ఉంచాని కొద్ది రోజుల క్రితం ఇమ్రాన్ తెలిపారు. రాజకీయ ఖైదీల పట్ల ఇలా వ్యవహరించడం పాక్‌ చరిత్రలో ఎన్నడూ లేదు. కారాగార నిబంధనల ప్రకారం, కనీస వసతులు కూడా కల్పించడం లేదు. గత పది నెలల్లో నా బిడ్డలతో కేవలం 3 నిమిషాలు చొప్పున రెండు సార్లు మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. పార్టీ నాయకుడనైన నాకు, నా రాజకీయ సహచరులతో కలవడానికి అవకాశం ఇవ్వడం లేదు. న్యాయవాదులు, పార్టీ సభ్యులు, కుటుంబ సభ్యులతో మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారు. ఈ విధంగా నా ప్రాథమిక, చట్టపరమైన హక్కులను వారు హరిస్తున్నారు" అని ఇమ్రాన్‌ ఖాన్​ వాపోయారు.


మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ సైనిక బలంతో దేశంలోని వ్యవస్థలు అన్నింటినీ నాశనం చేస్తున్నాడని ఇమ్రాన్‌ ఖాన్‌ విమర్శించారు. మునీర్​ ప్రజాస్వామ్య వ్యవస్థలను నలిపేసి 'ఆసిమ్​ చట్టం' అమలు చేస్తూ పాకిస్థాన్​ను ఒక కఠినమైన రాజ్యంగా మారుస్తున్నాడని దుయ్యబట్టారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా నిప్పులు చెరిగారు.

"బలమైన దేశం అంటే రాజ్యాంగ విలువలు, చట్టబద్ధ పాలన, న్యాయం, ప్రజాస్వామ్య స్వేచ్ఛ వర్ధిల్లడం. కానీ ఆసిం మునీర్‌ దృష్టిలో బలమైన రాజ్యం అంటే సొంత చట్టాన్ని అమలు చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నాశనం చేయడం. వాస్తవానికి ప్రజల మద్దతు, వారి అంగీకారం లేకుండా ఏ దేశం కూడా బ లోపేతం కాదు. కానీ 'ఆసిం చట్టం' పేరుతో అకృత్యాలకు పాల్పడుతూ మునీర్​ ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరుస్తున్నాడు అని ఆరోపించారు.

జైలులో ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ ఏమైనా చేసే ప్రమాదం ఉందని ఆయన కుటుంబ సభ్యులు, తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు


Show Full Article
Print Article
Next Story
More Stories