
Gaza: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు..
గాజాపై మరింతగా విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ అటు బాంబు దాడులు.. ఇటు భూతల పోరు నేలమట్టమవుతున్న ఆకాశహర్మ్యాలు దక్షిణం వైపు వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు వేలాదిగా కొనసాగుతున్న వలసలు ఇజ్రాయెల్ దాడుల్లో 89 మంది మృతి
ఇజ్రాయెల్ సైన్య వైమానికి దాడులకు తోడు భూతల దాడులు మొదలు కావడంతో గాజా శిథిలాల దిబ్బగా మారుతోంది. భారీ పేలుళ్లతో భవనాలు నేలకూలుతున్నాయి. భీతిల్లిన జనం నగరాన్ని ఖాళీ చేసి వలసపోతున్నారు. గాజాలోని హమాస్ మిలిటెంట్లను తుద ముట్టించి బందీలను విడిపించుకోవడమే తాజా దాడుల లక్ష్యమని ఇజ్రాయెల్ సమర్ధించుకుంటోంది. గాజాను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు గాజా ప్రాంతంలో జనహననానికి పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమితి స్వతంత్ర నిపుణుల కమిటీ ఆరోపించింది. అయితే వీరి నివేదిక పూర్తిగా నిరాధారం అని ఇజ్రాయెల్ ప్రకటించింది.
హమాస్ సైనిక వనరుల నాశనమే లక్ష్యంగా గాజా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. కొన్ని రోజులుగా వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ బలగాలు ఇప్పుడు నేరుగా ఆ ప్రాంతంలో అడుగుపెట్టాయి. ఒకవైపు వైమానిక దాడులతో ఆకాశహర్మ్యాలను కూల్చేస్తూ.. మరోవైపు భూతల దాడులకు దిగాయి. గత రెండు రోజులుగా రాత్రింబళ్లు అనే తేడా లేకుండా దాడులు కొనసాగుతున్నాయి. శతఘ్నులు, హెలికాప్టర్లు, క్షిపణులు, డ్రోన్లు, ఎఫ్–16 యుద్ధ విమానాలతోవిరామం లేకుండా బాంబింగ్ కొనసాగిందని స్థానికులు చెబుతున్నారు. పేలుళ్ల తీవ్రతకు అక్కడి భవనాలు క్షణాల్లో నేలమట్టమవుతున్నాయి. ఈ దాడుల్లో 89 మంది చనిపోయారని అక్కడి అధికారులు తెలిపారు. 78 మంది ఒక్క గాజా సిటీలోనే మృతి చెందారు. షిఫా ఆస్పత్రికి పదులు సంఖ్యలో మృత దేహాలు వచ్చాయి. 90 మందికి పైగా గాయపడగా చికిత్స అందిస్తున్నారు. భవనాల శిథిలాల కింద చాలామందే చిక్కుకుని ఉన్నారని తెలుస్తోంది.
గాజా సిటీలో దాదాపు 3,000 మంది హమాస్ మిలిటెంట్లున్నారని ఇజ్రాయెల్ భావిస్తోంది. వారిని అంతమొందిస్తే తమ లక్ష్యం నెరవేరుతుందని భావించి ఆ నగరంపై విరుచుకుపడుతోంది. అంతకుముందే గాజా సిటీని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ రక్షణ దళం ఆదేశించడంతో దాదాపు 3.5 లక్షల మంది ఇప్పటికే వెళ్లిపోయారు. దాడులు మొదలు కాగానే వేల మంది వలస బాట పట్టారు.
దక్షిణప్రాంతంలోని అల్ మువాసిలో ఏర్పాటు చేసిన మానవీయ జోన్‌కు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎడతెగని దాడులతో భీతిల్లిన జనం నగరాన్ని వీడి పెద్ద సంఖ్యలో వెళ్లిపోతున్నారు. తీరం వెంబడి రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఇజ్రాయెల్‌యుద్ధ విమానాలు గాజాలోని లక్ష్యాలపై విరుచుకుపడుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాలా కుటుంబాలు తమ ఇళ్లల్లో నిద్ర పోవడానికిభయపడిపోయాయి. దీంతో వీరంతా వీధుల్లోనే పిల్లాపాపలతో కలిసి నిద్రిస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి.
గాజా నగర జనాభా దాదాపు 10 లక్షలు కాగా ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో గత నెల నుంచి ఇప్పటి వరకు 2.20లక్షల మంది దక్షిణాదికి వలస వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.
మరోవైపు ‘గాజా తగులబడుతోంది అంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వ్యాఖ్యానించారు హమాస్ సాయుధ వనరులను ధ్వంసం చేసి, బందీలను విడిపించుకుంటామన్నామని ఆయన తెలిపారు. లక్ష్యం నెరవేరేదాకా వెనక్కి తగ్గేది లేదన్నారు. . బందీలను విడుదల చేయించేందుకు.. హమాస్‌ను ఓడించేందుకు తీవ్ర స్థాయిలో పోరాడుతున్నట్లు తెలిపారు కట్జ్.
గాజా సిటీ శివార్ల నుంచి మధ్యలోకి వెళ్లేందుకు తమ బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయని, ఆకాశ హర్మ్యాలే లక్ష్యంగా వైమానిక దాడులు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ సైన్యాధికారి ఒకరు తెలిపారు. ఈ దాడులు పూర్తయ్యే సరికి తీర ప్రాంతం తప్ప మొత్తం తమ ఆధీనంలోకి వస్తుందని వెల్లడించారు. కాగా హమాస్ నెట్‌వర్క్ ధ్వంసమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ సేనలు.. గాజా సిటీలో భూతల దాడులు ఎన్నిరోజులు కొనసాగుతాయో స్పష్టత ఇవ్వలేదు.
మరోవైపు యెమెన్‌లోని తీర ప్రాంత నగరం హొడైడాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. హూతీల సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని ప్రకటించింది. దీంతో తమ గగనతల రక్షణ వ్యవస్థను క్రియాశీలం చేశామని ఇరాన్ మద్దతున్న హూతీ రెబల్స్ ప్రకటించారు. హూతీల గగనతల రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని గందరగోళానికి గురి చేసిందని, దీంతో యెమెన్ గగనతలాన్ని వీగి అది వెళ్లిపోయిందని హూతీల అధికార ప్రతినిధి యాహ్యా సరీ తెలిపాడు. గత వారం ఇజ్రాయెల్ దాడిలో మరణించిన 31 మంది జర్నలిస్టుల అంత్యక్రియల్లో పాల్గొనడానికి రాజధాని సనాలో వేల మంది హాజరైన సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణి తమ దేశంవైపు వచ్చిందని ఇజ్రాయెల్ వెల్లడించింది. దానిని తమ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డగించిందని తెలిపింది.
మరోవైపు ఇజ్రాయెల్ ఆర్మీ గాజా ప్రాంతంలో జనహననానికి పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమితి నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ పేర్కొంది. మారణహోమానికి ముగింపు పలికి, ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఇజ్రాయెల్‌లోని అగ్రనాయకులు కూడా ఈ దాడులను ప్రోత్సహించారని ఈ కమిటీ నివేదిక పేర్కొంది. మొత్తం 72 పేజీల నివేదిక విడుదలైంది. ఇజ్రాయెల్ 2023 అక్టోబర్ నుంచి 4 జాతి విధ్వంసకర దాడులకు పాల్పడిందని సమితి మానవహక్కుల మండలి ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక వివరించింది.
అక్టోబర్ 7 దాడులకు ముందు నుంచే ఇజ్రాయెల్ పాలస్తీనాలోకి సరకు రవాణాను అడ్డుకుందని నివేదిక తెలిపింది. హమాస్ దాడి తర్వాత రవాణా పూర్తిగా ఆగిపోవడంతో గాజావాసుల జీవనం దుర్భరంగా మారిందని వివరించింది. ‘జీవనాధార అవసరాలను నిలిపివేయడాన్ని ఇజ్రాయెల్ ఆయుధంగా మలచుకుంది. ముఖ్యంగా నీరు, ఆహారం, విద్యుత్, ఇంధనం, మానవతా సాయం సహా ఇతర ముఖ్యమైన సామగ్రిని నిలిపివేసింది’ అని ఐక్యరాజ్యసమితి కమిషన్ పేర్కొంది.
ఇళ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు, మత ప్రదేశాలు అనే తేడా లేకుండా దాడులు జరిగాయని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. చిన్నారులని తెలిసి కూడా ఇజ్రాయెల్ సేనలు దాడి చేశాయని ఐదేళ్ల హిండ్ రజాబ్ మరణాన్ని ఉదహరించింది. పౌరులు ప్రాణాలు కోల్పోతారని తెలిసి కూడా మందుగుండు వాడారని పేర్కొంది.
పాలస్తీనా ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం అక్టోబర్ 7 నుంచి 65 వేల మంది చనిపోయారు. వీరిలో హమాస్‌కు చెందిన వారు ఎంత మంది? మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారా? అనే వివరాలు వెల్లడించలేదు. అయితే, తాము ఆత్మరక్షణ కోసమే దాడులు చేశామని ఎలాంటి మారణహోమానికి పాల్పడలేదని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ‘వక్రీకరించిన, తప్పుడు నివేదికను ఇజ్రాయెల్ తిరస్కరిస్తుంది. విచారణ కమిషన్‌ను వెంటనే రద్దు చేయాలని పిలుపునిస్తున్నాం’ అని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ ప్రకటించింది. ఈ నివేదిక హమాస్ తయారు చేసిన అబద్ధాలతో కూడి ఉందని విమర్శించింది. రచయితలకు ఉగ్రమూకలతో సంబంధాలున్నాయని ఆరోపించింది. యూదుల గురించి వారి ప్రకటనలను ప్రపంచం మొత్తం ఖండించిందని ఇజ్రాయెల్ వ్యాఖ్యానించింది.
ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్థం తీవ్రరూపం దాల్చడంతో కాల్పుల విరమణ కోసం ఇప్పటి వరకు కొనసాగిన దౌత్యప్రయత్నాలకు ముగింపు పలికినట్లేనని భావిస్తున్నారు.అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో ఇజ్రాయెల్ చేరుకుని, ప్రధాని నెతన్యాహూతో చర్చలు జరిపారు. గాజాలో క్షేత్రస్థాయి ఆపరేషన్ ప్రారంభమైనందున, ఒప్పందం కుదుర్చుకునేందుకు తగు సమయం లేదంటూ వ్యాఖ్యానించారు. ఎంతో ముఖ్యమైన ఈ ఆపరేషన్ కొన్ని వారాల్లోనే ముగియనుందన్నారు.
అటు దోహాలో జరిగిన అరబ్, ముస్లిం దేశాల నేతల సమావేశం ఖతార్‌పై ఇజ్రాయెల్ గత వారం చేపట్టిన దాడులను తీవ్రంగా ఖండించింది. అయితే ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలపై ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. అయితే, ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధానికి దౌత్యప రమైన ఒత్తిడుల ద్వారా ముగింపునకు తేవాలని నిర్ణయించింది. ఇజ్రాయెల్‌ను శత్రువంటూ దోహాలో జరిగిన సమావేశంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సిస్సి అభివర్ణించారు. 1979లో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలయ్యాక ఇజ్రాయెల్‌ను ఆ దేశం ఇంత తీవ్రంగా నిందించడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. అయితే, ఇది కేవలం తమ అసంతృప్తి తీవ్రతను వ్యక్తం చేసేందుకే తప్ప, ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెంచుకునేందుకు కాదని అంటున్నారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire