Kuwait Citizenship Fraud :ఆరు పెళ్లిళ్లు.. 18 మంది పిల్లలు.. కట్ చేస్తే మతులు పోగొట్టే నిజం

Kuwait Citizenship Fraud :ఆరు పెళ్లిళ్లు.. 18 మంది పిల్లలు.. కట్ చేస్తే మతులు పోగొట్టే నిజం
x
Highlights

ఆరు పెళ్లిళ్లు.. 18 మంది పిల్లలు.. కట్ చేస్తే మతులు పోగొట్టే నిజం

Kuwait Citizenship Fraud : కువైట్‌లో పౌరసత్వానికి సంబంధించి బయటపడ్డ ఒక భారీ కుంభకోణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆరు పెళ్లిళ్లు, 18 మంది పిల్లలు, వందలాది మంది ఆశ్రితులు.. పైకి అంతా ఒక పెద్ద కుటుంబంలా కనిపిస్తున్నా, లోతుగా ఆరా తీస్తే వెలుగుచూసిన నిజాలు చూసి అధికారులు సైతం నోరెళ్లబెట్టారు. డీఎన్ఏ టెస్టుల పుణ్యమా అని దశాబ్దాలుగా సాగుతున్న ఈ అక్రమ పౌరసత్వ దందా బట్టబయలైంది. కువైట్ జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో అనేకమంది నకిలీ ధృవీకరణ పత్రాలతో పౌరసత్వం పొంది ఎంజాయ్ చేస్తున్నట్లు తేలింది.

ఈ కథలో అసలు ట్విస్ట్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ ద్వారా మొదలైంది. ఒకే తండ్రికి పుట్టినట్లు రికార్డుల్లో ఉన్న 18 మంది కుమారులకు పరీక్షలు నిర్వహించగా, వారిలో చాలామందికి ఒకరికొకరు రక్తసంబంధమే లేదని తేలింది. వీరంతా కేవలం కువైట్ పౌరసత్వం కోసం తండ్రి పేరును వాడుకున్న నకిలీలని వెల్లడైంది. ఇప్పటికే నలుగురు కుమారుల పౌరసత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయగా, వారితో సంబంధం ఉన్న మరో 226 మంది ఆశ్రితుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంలో పడింది. మొదట ఇద్దరు నకిలీ కొడుకుల వల్ల 131 మంది ప్రభావితం కాగా, తాజాగా మరో ఇద్దరి పేర్లు బయటకు రావడంతో మరో 95 మంది పౌరసత్వాలు రద్దయ్యే ప్రమాదం ఉంది.

దర్యాప్తులో వెలుగుచూసిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఈ నెట్‌వర్క్‌లోని ప్రధాన నిందితుడు ఒకడు 2025 నుంచి కువైట్ వదిలి పరారీలో ఉన్నాడు. అతని పేరు మీద 15 మంది పిల్లలు, 41 మంది ఆశ్రితులు నమోదై ఉన్నారు. అయితే అధికారులు డిజిటల్ ఆధారాలు సేకరించగా, గూగుల్‌లో అతని ఆఫీసు పేరు ఒక విదేశీ గల్ఫ్ పేరుతో ఉండటం గమనించారు. సోషల్ మీడియాలో తన కొడుకు పెళ్లి శుభాకాంక్షలు కూడా అదే అసలు పేరుతో పోస్ట్ చేయడంతో దొరికిపోయాడు. ఆ పిల్లల డీఎన్ఏను వారి బాబాయ్‌లతో పోల్చగా, ఎక్కడా మ్యాచ్ అవ్వలేదు. దీంతో వీరంతా నకిలీ అని తేలిపోయింది.

రెండో కేసులో కూడా దాదాపు ఇదే సీన్ రిపీట్ అయింది. ఒకే ఏడాదిలో ఇద్దరు సోదరులు పుట్టినట్లు రికార్డులు ఉండటంతో అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీశారు. విదేశాల్లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో ఇతని అసలు పేరు బయటపడింది. ఇతనికి 12 మంది పిల్లలు, 55 మంది ఆశ్రితులు ఉన్నారు. డీఎన్ఏ పరీక్షల్లో సోదరులతో సంబంధం లేదని తేలడమే కాకుండా, మిగిలిన కుటుంబ సభ్యులు కూడా అతను తమవాడు కాదని ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఇదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరి ఫైళ్లపై దర్యాప్తు జరుగుతోంది. ఇదే నిజమైతే ఆ 18 మందిలో 6 మంది కొడుకులు నకిలీలని అధికారికంగా తేలుతుంది. ఆధునిక సాంకేతికత, ఇమేజ్ మ్యాచింగ్ సాయంతో కువైట్ ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి నకిలీ పౌరసత్వ నెట్‌వర్క్‌ల అడ్రస్ గాలిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories