ట్రంప్‌కు భారీ ఎదురు దెబ్బ..! స్థానిక ఎన్నికల్లో డెమొక్రాట్ల దూకుడు

ట్రంప్‌కు భారీ ఎదురు దెబ్బ..! స్థానిక ఎన్నికల్లో డెమొక్రాట్ల దూకుడు
x

ట్రంప్‌కు భారీ ఎదురు దెబ్బ..! స్థానిక ఎన్నికల్లో డెమొక్రాట్ల దూకుడు

Highlights

డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురు దెబ్బ స్థానిక ఎన్నికల్లో డెమొక్రాట్స్ విజయం రిపబ్లికన్ అభ్యర్థులకు పరాజయం న్యూయార్క్‌లో డొనాల్ట్ ట్రంప్ షాక్

అమెరికా ఫస్ట్ నినాదంతో వివాదాస్పద వలస విధానాలు, సుంకాలతో ప్రపంచ దేశాలతో కయ్యానికి దిగిన డొనాల్డ్ ట్రంప్‌కు సొంత ప్రజలే షాక్ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్లకు పరాజయం ఎదురైంది. ముఖ్యంగా న్యూయార్క్ మేయర్‌గా జొహ్రాన్ మమ్దానీ ఎన్నిక ట్రంప్‌కు మింగుడు పడని విషయమే. తన విజయం అమెరికాను మోసం చేస్తున్న ట్రంప్‌ను ఓడించే మార్గాన్ని చూపించిందని వ్యాఖ్యానించారు మమ్దానీ. అనేక రాష్ట్రాలు, నగరాల్లో డెమొక్రాట్లు విజయం సాధించారు. అయితే షట్‌డౌన్ కారణంగా రిపబ్లికన్లు ఓడిపోయారంటున్నారు ట్రంప్. పైగా బ్యాలట్ పేపర్‌లో తన పేరు లేదు కదా అనే విచిత్రమైన సమాధానం ఇచ్చారు.


అమెరికా స్థానిక ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ తెప్పించాయి. అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు ఓటర్లు ఝలక్‌ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన కీలక నేతలను ఓడించారు. . ముఖ‌్యంగా న్యూయార్క్ మహానగరంలో భారత్-ఉగాండ మూలాలన్న జొహ్రాన్‌ మామ్దానీ మేయర్‌గా ఎన్నిక కావడం ట్రంప్‌కు మింగుడు పడని విషయం. తన ప్రత్యర్థిపై లక్షా 9 వేల 127 ఓట్ల మెజారిటీని సాధించారాయన. మమ్దానీకి 49.6 శాతం అంటే 6,77,615 ఓట్లు పోల్‌ అయ్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ న్యూయార్క్‌ గవర్నర్ ఆండ్రూ క్యూమోకు 41.6 శాతం 5,68,488 వచ్చాయి. ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చి ఓటు వేశారు. 1969 తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో ఓటు వేయడం ఇదే మొదటిసారి. జోహ్రాన్ మామ్దానీ మేయర్‌గా ఎన్నికకావడంతో న్యూయార్క్‌ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ఆవిష్కృతమైందని చెప్పచ్చు. న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికైన తొలి దక్షిణాసియా మూలాల నాయకుడే మాత్రమే కాకుండా, తొలి ముస్లిం కావడం విశేషం.


జోహ్రాన్ మమ్దానీని ఓడించేందుకు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఓటర్లను హెచ్చిరించే విధంగా ట్వీట్ చేశారు. కమ్యూనిస్టు భావజాలం ఉన్న మామ్దానీని గెలిపిస్తే, నగరానికి కనీస అవసరాలకు సరిపోయేంత నిధులు మాత్రమే ఇస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు. మామ్దానీ గెలిస్తే న్యూయార్క్‌ నగర మనుగడ దెబ్బతింటుందని ఆర్థిక, సామాజిక విధ్వంసానికి గురవుతుందని హెచ్చరించారు. అయినప్పటికీ మామ్దానీకే ఓటేశారు న్యూయార్క్ వాసులు. ఎన్నికల ఫలితాలపై ట్రంప్‌ అసహనం వ్యక్తంచేశారు. రాజ్యాంగ విరుద్ధమైన రీమ్యాపింగ్‌ పేరుతో కాలిఫోర్నియాలో భారీ స్కామ్‌ జరిగింది. ఓటింగ్‌ ప్రక్రియలోనూ రిగ్గింగ్‌ చోటుచేసుకుంది. మెయిల్‌-ఇన్‌ ఓట్లను పక్కనబెట్టేశారు. ఇది చాలా తీవ్రమైన అంశం అని ట్రంప్‌ ఆరోపించారు. ‘‘బ్యాలెట్‌లో ట్రంప్‌ పేరు లేదు. మరోవైపు నెల రోజులకు పైగా కొనసాగుతోన్న ఫెడరల్‌ షట్‌డౌన్‌. ఈ రెండు కారణాల వల్ల రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది’’ అని పోల్‌స్టర్స్‌ సర్వే అభిప్రాయాన్ని ట్రంప్‌ తన ట్రూత్‌ ఖాతాలో షేర్‌ చేశారు. (Trump Social + Trump Truth)


జొహ్రాన్‌ మమ్‌దానీ 1991 అక్టోబరులో ఉగాండాలోని కంపాలాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ భారత మూలాలున్న వ్యక్తులే కావడం విశేషం. తల్లి మీరా నాయర్‌ పంజాబీ హిందూ మహిళ. ప్రముఖ భారతీయ సినీ దర్శకుల్లో ఒకరు ఆమె. ‘సలామ్‌ బాంబే’, ‘మాన్‌సూన్‌ వెడ్డింగ్‌’ వంటి ప్రముఖ చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. తండ్రి మహ్మద్‌ మమ్‌దానీ గుజరాతీ ముస్లిం. బాంబేలో జన్మించిన మహ్మద్‌ మమ్‌దానీ ఆ తర్వాత ఉగాండాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఈయన విద్యావేత్త. జొహ్రాన్‌ మమ్‌దానీకి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌కు మారింది. ఆ తర్వాత రెండేళ్లకే న్యూయార్క్‌కు మకాం మార్చి అక్కడే స్థిరపడింది. సైన్స్‌, ఆఫ్రికన్‌ స్టడీస్‌లో జొహ్రాన్‌ మమ్‌దానీ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. జొహ్రాన్‌ మమ్‌దానీ రాజకీయ విజయాల వెనుక తల్లిదండ్రుల పాత్రే ఎక్కువ. జోహ్రాన్ మామ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. సోషలిస్టుగా చెప్పుకునే మామ్దానీ 2021 నుంచి న్యూయార్క్‌ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.


జోహ్నాన్ మామ్దానీ మొదటి నుంచి న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరించారు. ప్రచారంలో పలు హామీలతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పనిచేసే వర్గాలకు జీవన వ్యయాన్ని తగ్గించడం మొదటి బాధ్యత అని ప్రకటించారు. పెరుగుతున్న ఇళ్ల అద్దెలు, ఆహార ధరలు, ఉద్యోగ అస్థిరతలతో బాధపడుతున్న మధ్యతరగతి,కార్మిక వర్గానికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అమెరికాను మోసం చేస్తున్న ట్రంప్‌ను ఓడించే మార్గాన్ని న్యూయార్క్ సిటీ చూపించిందని మామ్దానీ తెలిపారు. ట్రంప్ లాంటి బిలియనీర్లు పన్నులను ఎగవేస్తున్నారంటే, పన్ను మినహాయింపులను దుర్వినియోగం చేస్తున్నారంటే అందుకు కారణం అవినీతే అని జొహ్రాన్ ఆరోపించారు. ఈ విషయాన్ని తెలుసుకోవాలని ట్రంప్‌కు హితవు పలికారు. అందరినీ కలుపుకొని ట్రంప్ ముందుకు సాగితేనే అమెరికా వికాసం సాధ్యమవుతుందన్నారు. అవినీతిని అంతం చేస్తానని ఈసందర్భంగా ఆయన శపథం చేశారు. మమ్దాని వ్యాఖ్యలపై 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ స్పందించారు. "అయితే అది మొదలైందన్న మాట" అని పేర్కొన్నారు (So Bigin Truth Social)


మరోవైపు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమొక్రాట్ అభ్యర్థి గజాలా హష్మీ విజయం సాధించారు. ఆమె రిపబ్లికన్ అభ్యర్థి జాన్ రీడ్‌నుఓడించారు. వర్జీనియా సెనేట్‌లో సెనేటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమె తొలి ముస్లిం మహిళగా, మొదటి దక్షిణాసియా అమెరికన్‌గా గుర్తింపు పొందారు.

1964లో హైదరాబాద్‌లో జియా హష్మీ, తన్వీర్ హష్మీ దంపతులకు జన్మించిన గజాలా తన బాల్యాన్ని మలక్‌పేటలోని తన తాత ఇంట్లో గడిపారు. హష్మీ తన నాలుగేళ్లప్పుడు తల్లి, అన్నయ్యతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. గజాలా జార్జియా సదరన్ విశ్వవిద్యాలయం నుండి బీఏ, ఎమోరీ విశ్వవిద్యాలయం నుండి అమెరికన్ సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. 1991లో హష్మి, ఆమె భర్త అజార్ రఫీక్‌తో పాటు రిచ్‌మండ్ ప్రాంతానికి తరలి వెళ్లారు. హష్మీ దాదాపు 30 సంవత్సరాల పాటు ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆమె 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజల జీవితాలను మెరుగు పరచడంతో పాటు గృహనిర్మాణం, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ న్యాయం తదితర సమస్యలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు గజాలా హష్మీ.


వర్జీనియా మేయర్‌ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదయ్యింది. డెమొక్రాట్ అబిగైల్ స్పాన్‌బెర్గర్ రిపబ్లికన్ అభ్యర్థి విన్సమ్ ఎర్లే-సియర్స్‌ను ఓడించారు. అబిగైల్ కు 14.80 లక్షల ఓట్లు పోలయ్యాయి. 2026 మధ్యంతర ఎన్నికలకు వెళ్లే డెమొక్రాట్‌లకు కీలక విజయాన్ని అందించి, సరికొత్త చరిత్ర సృష్టించారు స్పాన్‌బెర్గర్.తన ప్రచారంలో ట్రంప్‌ విధానాలను, ఆర్థిక ప్రణాళికలను ఎండగట్టారు. రిపబ్లికన్ మద్దతు కలిగిన ప్రాంతాలతో సహా వర్జీనియా అంతటా ప్రచారం సాగించారు. యూఎస్‌ ప్రభుత్వ షట్‌డౌన్, సమాఖ్య ఉద్యోగులున్న వర్జీనియాపై దాని ప్రతికూల ప్రభావాన్ని స్పాన్‌బెర్గర్ సమర్థవంతంగా వివరించారు.

మరోవైపు సిన్సినాటి మేయర్ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సవతి తమ్ముడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కోరీబౌమన్ కూడా ఓడిపోయారు. ఈయనపై డెమొక్రాట్ అఫ్తాబ్ పురేవాల్ గెలుపొందారు. పురేవాల్‌ రెండవ సారి మేయర్ గా ఎన్నికయ్యారు. అట్లాంటా మేయర్‌గా డెమోక్రాట్ అభ్యర్థి ఆండ్రీ డికెన్స్ తిరిగి ఎన్నికయ్యారు. అలాగే పిట్స్‌బర్గ్ మేయర్ రేసులో డెమోక్రాట్ అభ్యర్థి కోరీ ఓకానర్ విజయం సాధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories