Pak-Afghan War : ఆఫ్ఘన్-పాక్ మధ్య భీకర యుద్ధం.. 19 సైనిక పోస్టులు కైవసం, 55 మంది పాక్ సైనికులు మృతి

Pak-Afghan War : ఆఫ్ఘన్-పాక్ మధ్య భీకర యుద్ధం.. 19 సైనిక పోస్టులు కైవసం, 55 మంది పాక్ సైనికులు మృతి
x
Highlights

ఆఫ్ఘన్-పాక్ మధ్య భీకర యుద్ధం.. 19 సైనిక పోస్టులు కైవసం, 55 మంది పాక్ సైనికులు మృతి

Pak-Afghan War : ఆసియా ఖండంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలతో అట్టుడుకుతున్న పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. గురువారం రాత్రి ఆఫ్ఘన్ దళాలు పాకిస్థాన్‌పై మెరుపు దాడి చేయడంతో మొదలైన ఈ గొడవ, ఇప్పుడు ఏకంగా వైమానిక దాడుల వరకు దారితీసింది. ఆఫ్ఘనిస్థాన్ దళాలు సరిహద్దు దాటి వచ్చి పాకిస్థాన్‌కు చెందిన సుమారు 19 సైనిక పోస్టులను తమ ఆధీనంలోకి తీసుకున్నాయని, ఈ క్రమంలో 55 మంది పాక్ సైనికులను మట్టుబెట్టామని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.

ఆఫ్ఘన్ దాడులతో రగిలిపోయిన పాకిస్థాన్ సైన్యం శుక్రవారం తెల్లవారుజామున ప్రతీకార చర్యలకు దిగింది. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ సహా కందహార్, పక్తియా వంటి ప్రధాన నగరాలపై పాక్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. అయితే, ఈ దాడులను ఆఫ్ఘన్ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. తమ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన ఒక పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని ఆఫ్ఘన్ బలగాలు కూల్చివేసినట్లు టోలోన్యూస్ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. పాక్ వైమానిక దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ యుద్ధ వాతావరణంపై ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్ తన హింసాత్మక విధానాలను మానుకోవాలని, పొరుగు దేశంతో గౌరవప్రదంగా మెలగాలని సూచించారు. ఆఫ్ఘన్ పౌరులు తమ దేశ రక్షణ కోసం ప్రాణాలైనా ఇస్తారని, పాక్ దాడులను ఐక్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అటు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా ఘాటుగా స్పందిస్తూ.. తమ దేశ సమగ్రత విషయంలో తగ్గేదేలేదని, తమ శాంతిని బలహీనతగా భావిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ప్రస్తుతం డ్యూరండ్ లైన్ (సరిహద్దు రేఖ) వెంబడి ఐదు ప్రావిన్సుల్లో భీకర పోరు సాగుతోంది. పాకిస్థాన్ తన భూభాగంలోని ఉగ్రవాదుల ఏరివేత కోసమే ఈ దాడులు చేస్తున్నామని చెబుతుండగా, ఆఫ్ఘనిస్థాన్ మాత్రం పాక్ దురాక్రమణకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది. సరిహద్దు పోస్టులను కోల్పోయామన్న వార్తలను పాక్ ఖండించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం యుద్ధాన్ని తలపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories