World War III: అణు యుద్ధం వస్తుందా? రష్యా అంతకు తెగిస్తుందా?

World War 3
x

World War III: అణు యుద్ధం వస్తుందా? రష్యా అంతకు తెగిస్తుందా?

Highlights

World War 3: అణు యుద్ధం ముంచుకొస్తోందా? మూడో ప్రపంచ యుద్ధ విధ్వంసాన్ని ఈ ప్రపంచం చూడాల్సి వస్తోందా?

Russia New Nuclear Policy may leads to World War III: అణు యుద్ధం ముంచుకొస్తోందా? మూడో ప్రపంచ యుద్ధ విధ్వంసాన్ని ఈ ప్రపంచం చూడాల్సి వస్తోందా? రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో అణ్వస్త్రాల ప్రయోగం జరిగితే అది ఏయే దేశాలకు విస్తరిస్తుంది? ఐరోపా దేశాలు ఎందుకు బిక్కుబిక్కుమనే పరిస్థితి ఏర్పడింది? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇన్ని ప్రశ్నలకు కారణమైంది. ఇంతకీ పుతిన్ తీసుకున్న అంత పెద్ద నిర్ణయం ఏంటి? పుతిన్ నిర్ణయాన్ని అమెరికా ఎందుకు ఖండిస్తోంది? ఈ వివరాలను ఈ డీటెయిల్డ్ స్టోరీలో చూసే ప్రయత్నం చేద్దాం.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా న్యూక్లియర్ పాలసీకి మరింత పదును పెట్టారు. కొత్త పాలసీని ఆమోదిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను ఛేదించే లాంగర్ రేంజ్ మిస్సైల్స్ ను రష్యాపై ప్రయోగించిన తరువాత పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదొక హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. అమెరికా కూడా రష్యా నిర్ణయాన్ని ఖండించింది.

రష్యా తీసుకున్న నిర్ణయం ఏంటి?

రష్యా - ఉక్రెయిన్ మధ్య మూడేళ్ళుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధం మొదలై 1000 రోజులవుతోంది. అమెరికా అధ్యక్ష పదవి నుంచి త్వరలో దిగిపోనున్న జో బైడెన్ తాజాగా ఉక్రెయిన్‌ మద్దతుగా మాట్లాడారు. అమెరికా అందించిన లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ను రష్యా మీదకు ప్రయోగించుకోవచ్చని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్‌స్కీకి బైడెన్ అనుమతిచ్చారు. అమెరికా అండ చూసుకున్న జెలెన్ స్కీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రష్యా మీదకు 6 లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ప్రయోగించారు. వాటిని రష్యా ధీటుగా ఎదుర్కొని కూల్చేసింది. కానీ, ఉక్రెయిన్ మీద ఆ దేశానికి కోపం రెట్టింపైంది.

ఆ వెనువెంటనే అణ్వస్త్రాల వినియోగానికి సంబంధించిన పాలసీని సులభతరం చేసే ఫైలుపై రష్యా సంతకం చేసింది. ఈ కొత్త పాలసీ ప్రకారం అణ్వస్త్రాలు కలిగిన ఏ దేశమైనా సరే ఉక్రెయిన్‌కి సహకరిస్తే.. అది అణ్వాయుధాలు కలిగిన దేశం జరిపే దాడిగానే చూడాల్సి వస్తుందని కొత్త పాలసీ చెబుతోంది. ఆ దాడిని అంతే ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైతే రష్యా అణ్వస్త్రాలు ఉపయోగించేందుకు ఆ పాలసీ వీలు కల్పిస్తుంది.

ఐరోపా దేశాల్లో టెన్షన్.. టెన్షన్..

రష్యాను ప్రపంచంలోనే అధిక మొత్తంలో అణ్వస్త్రాలు కలిగిన దేశంగా చెబుతుంటారు. అలాగే అణ్వస్త్రాలు కలిగిన ఉత్తర కొరియా కూడా ఈ యుద్ధంలో రష్యాకు సాయం చేసేందుకు ముందుకొస్తోంది. అలాంటప్పుడు రష్యా కానీ అణ్వస్త్రాలు వెలికి తీస్తే శత్రు దేశాల పరిస్థితి ఏంటా అనేదే ప్రస్తుతం ఐరోపా దేశాల వెన్నులో వణుకుపుట్టేలా చేస్తోంది. ఆ నాటో జాబితాలో బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, పోలండ్, స్వీడెన్ వంటి దేశాలున్నాయి. ఇందులో కొన్ని దేశాలు రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్‌కు సైనిక సాయం చేస్తున్నాయి. అందుకే రష్యా తీసుకున్న ఈ నిర్ణయం వారిలో భయాందోళనలకు కారణమైంది.

ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్న దేశాలు..

ఒకవేళ రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం అణు యుద్ధానికి దారి తీస్తే, ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలని స్విడెన్, నార్వె, ఫిన్లాండ్ వంటి దేశాలు తమ పౌరులను సిద్ధం చేస్తున్నాయి. ఏకంగా తమ పౌరులను నిత్యవసర సరుకులు, ఔషధాలు, నీరు వంటివి నిల్వలు సిద్ధం చేసుకొమ్మని చెప్పాయి. బంగాళదుంపలు, క్యాబేజ్.. ఇలా ఎక్కువ కాలం నిల్వ ఉండే కూరగాయలు, ఆహార ధాన్యాలు రెడీ చేసుకొమ్మంటున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా పాంప్లెట్స్ పంచిపెట్టి మరీ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి. ఒకవేళ న్యూక్లియర్ ఎమర్జెన్సీ వస్తే అవి అత్యవసరంలో ఉపయోగపడతాయని సూచిస్తున్నాయి.

మూడో ప్రపంచ యుద్ధం వద్దంటున్నట్రంప్

రష్యా - ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డోనల్డ్ ట్రంప్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తనని కలిస్తే ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేద్దాం అని సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత మళ్లీ ఇంతవరకు అణ్వాయుధాలతో యుద్ధం చేసుకునే పరిస్థితి రాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అక్కడి వరకు వెళ్లేలా ఉంది. అదే కానీ జరిగితే అది మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది. ఇకనైనా యుద్ధంతో ఒకరినొకరు చంపుకోవడం ఆపేయాలి. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా జాగ్రత్తపడాలి అంటూ ట్రంప్ రష్యాకు హితబోధ చేశారు. ట్రంప్ చేసిన ఈ ట్వీట్ సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది.

రష్యా ఏమంటోందంటే..

డోనల్డ్ ట్రంప్ శాంతిమంత్రంపై రష్యా స్పందించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఉక్రెయిన్ తో యుద్ధంలో కాల్పుల విరమణ వరకు ఓకే. అంతేకానీ, తమ ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాన్ని తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదని పుతిన్ అన్నారని, కాల్పుల విరమణకు ఇంకా అనేక షరతులు విధించారని ఆ కథనం తెలిపింది. ఇప్పుడు అందరి కళ్ళూ పుతిన్ మీదే ఉన్నాయి. ఆయన ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపేస్తారా? లేక న్యూక్లియర్ వార్‌కు సై అంటారా? ఆయన మనసులో ఏముంది?

Show Full Article
Print Article
Next Story
More Stories