Enteromics Cancer Vaccine: క్యాన్సర్‌పై రష్యా బ్రహ్మాస్త్రం! ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ క్లినికల్ దశకు

Enteromics Cancer Vaccine: క్యాన్సర్‌పై రష్యా బ్రహ్మాస్త్రం! ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ క్లినికల్ దశకు
x

Enteromics Cancer Vaccine: క్యాన్సర్‌పై రష్యా బ్రహ్మాస్త్రం! ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ క్లినికల్ దశకు

Highlights

క్యాన్సర్‌పై రష్యా బ్రహ్మాస్త్రం సరికొత్త వ్యాక్సిన్‌ ఎంటెరోమిక్స్‌ అతి త్వరలో అందుబాటులోకి.. ఇప్పటికే ప్రీ క్లినికల్ ట్రయల్స్ పూర్తి క్లినికల్ ట్రయల్స్‌కు వ్యాక్సిన్ సిద్ధం పెద్ద పేగు, బ్రెయిన్, చర్మ క్యాన్సర్లలో 80 శాతం % కచ్చితమైన ఫలితాలు క్యాన్సర్ రోగులలో కొత్త ఆశలు ఎంటెరోమిక్స్‌ మన దేశాని వస్తుందా?

క్యాన్సర్ పేరు వినగానే ఒకరకమైన భయం.. శారీరకంగా, మానసికంగా ఎంతో క్రుంగదీస్తుంది ఈ మహమ్మారి.. ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతకంగా మారిన క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎప్పటిదకా సరైన టీకాలు లేవు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ మహమ్మారిపై రామబాణంగా దూసుకువస్తోంది ఎంటెరోమిక్స్. రష్యన్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ఇప్పటికే ప్రీ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధంగా ఉంది. ఎప్పటి నుంచో క్యాన్సర్ వ్యా్క్సిన్ కోసం ఎదురు చూస్తున్న ప్రపంచానికి రష్యా కారణంగా సరికొత్త ఆశలు చిగురించాయి. ఇంతకీ ఏమిటీ ఎంటెరోమిక్స్?


క్యాన్సర్.. ప్రాణాంతకంగా మారిన మహమ్మారి ఇది.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షల మందిని పొట్టన పెట్టుకుంటున్న వ్యాధి ఇది. క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకూ సరైన మందులు, సరైన చికిత్స లేక జీవితాంతం క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో శుభవార్త వినిపించింది రష్యా. క్యాన్సర్‌కు చికిత్స అందించేందుకు బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేశారు రష్యన్ శాస్త్రవేత్తలు దాని పేరే ఎంటెరోమిక్స్. దీనిపై ఇప్పటికే ఏడాదిపాటు పరిశోధనలు, మూడేళ్లపాటు ముందస్తు క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగాయి. ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ ప్రీ-క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం ప్రభావం చూపించిందని తయారీ సంస్థ ఫెడరల్‌ మెడికల్, బయోలాజికల్‌ ఏజెన్సీ -ఎఫ్‌ఎంబీఏ వెల్లడించింది. ఈ టీకా క్యాన్సర్ కణితి పెరుగుదలను గణనీయంగా తగ్గించిందని, అలాగే ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని రష్యా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. పలు అగ్రెసివ్ క్యాన్సర్లను ఎదుర్కోవడంలో ఇది ఎంతగానో ఉపయోగపడనుందని వెల్లడించారు. ఎంటెరోమిక్స్ ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులలో కొత్త ఆశలు చిగురించాయి.


కోవిడ్-19 వ్యాక్సిన్‌ల మాదిరిగానే ఈ 'ఎంటెరోమిక్స్' కూడా mRNA టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. దీని ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, ఇది ప్రతి రోగికి వారి కణితి కణాల జన్యువుల ఆధారంగా వ్యక్తిగతంగా రూపొందించబడుతుంది. ఈ వ్యాక్సిన్ రోగి రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని నాశనం చేసే శిక్షణ ఇస్తుంది. ఆంకోలిటిక్, పర్సనలైజ్డ్ mRNA పద్ధతుల్లో ఏకకాలంలో ఎంటెరోమిక్స్ టీకాను అభివృద్ధి చేసింది రష్యా. ఎంటెరోమిక్స్ టీకా శరీరంలో ఉత్పత్తయ్యే ప్రొటీన్లే క్యాన్సర్‌ కణాలను నిర్వీర్యం చేసేలా రోగ నిరోధక శక్తిని పెంచుతున్నట్లు వెల్లడైంది. దీన్ని పలుమార్లు తీసుకున్నా శరీరంలో దుష్ప్రభావాలేవీ కనిపించడం లేదని, పైగా అత్యంత ప్రభావవంతంగా పని చేస్తోందని తేలింది. ఈ వ్యాక్సీన్‌ పూర్తి సురక్షితమని పరిశోధకులు హామీ ఇస్తున్నారు. పలు కేసుల్లో క్యాన్సర్‌ గడ్డల పరిమాణాన్ని ఈ వ్యాక్సిన్‌ ఏకంగా 60 శాతం నుంచి 80 శాతం దాకా తగ్గిస్తున్నట్లు వెల్లడైంది! ప్రధానంగా పెద్ద పేగు, బ్రెయిన్, చర్మ క్యాన్సర్‌పై ఇది రామబాణమేనని అంటున్నారు శాస్త్రవేత్తలు


అసలు రష్యన్ శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని ఎలా ఆవిష్కరించారు? పూర్తి వివరాల్లోకి వెళదాం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. 2020లో దాదాపు కోటి మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతి ఆరు మరణాల్లో ఒక చావుకి.. క్యాన్సరే కారణం. 2022 నాటికి దాదాపు 2 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు నమోదైతే.. దాదాపు కోటి మంది ప్రాణాలు కోల్పోయారని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించింది. 2050 వరకు 3.5 కోట్ల క్యాన్సర్ కేసులు నమోదు కావొచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 200లకు పైగా రకాల క్యాన్సర్లు మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో లంగ్, బ్రెస్ట్, కొలోరెక్టర్, ప్రోస్టేట్, స్టొమక్, బ్లడ్ క్యాన్సర్ వంటివి ప్రాణాంతకంగా పరిణమిస్తు్న్నాయి. శరీరంలోని వివిధ భాగాల్లో క్యాన్సర్ కణాలు నియంత్రించలేని విధంగా పెరుగుతాయి. మిగతా శరీర భాగాలకు కూడా వ్యాపించి మరణానికి దారి తీస్తాయి.


క్యాన్సర్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా తయారు చేసే దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో న్యూయార్క్‌కు చెందిన మెమోరియల్ స్లోయాన్ కెట్టెరింగ్ సంస్థ.. పాంక్రియాటిక్ క్యాన్సర్‌పై విస్తృతంగా పరిశోధనలు చేస్తోంది ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం సిపులెల్‌సెల్-టీ అనే టీకాను అభివృద్ధి చేశారు. ఇలా ఇప్పటికే పలు ప్రివెంటివ్, థెరపాటిక్ వ్యాక్సిన్లు ఉన్నాయి. ప్రతి క్యాన్సర్ రోగికి ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు థెరపాటిక్ వ్యాక్సిన్‌ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది రష్యా. ఈ ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్‌ను రష్యా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్, ఎంగ్లిల్‌హార్డ్ట్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మాలెక్యులర్ బయాలజీ, గమేలయా ఇన్స్‌స్టిట్యూట్ కలిసి అభివృద్ధి చేశాయి. కొవిడ్ వ్యాక్సిన్ రూపొందించిన అనుభవం గమేలయా ఇన్స్‌స్టిట్యూట్‌కు ఉంది. అన్ని క్యాన్సర్లకు ఒకే రకమైన టీకా కాకుండా.. ఒక్కొక్క రకాన్ని లక్ష్యంగా చేసుకుని పరిశోధన చేశారు. కరోనా వ్యాక్సిన్ అనుభవం ఎంటెరోమిక్స్ అభివృద్ధికి ఉపయోగపడింది.


అయితే అమెరికా ఎందుకు ఇప్పటి వరకూ క్యాన్సర్‌కు వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయింది?.. అగ్రరాజ్యంలో పలు ప్రైవేటు కంపెనీలు, విద్యాసంస్థలతో భాగస్వామ్యం, కఠిన ఎఫ్‌డీఏ నిబంధనల కారణంగానే ఆలస్యమవుతోందని చెబుతున్నారు. మొడెర్నా, మెర్క్, బయోఎన్‌టెట్ వంటి కంపెనీలు వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, మౌంట్ సినియ్, యేల్ యూనివర్సిటీ.. వంటి విద్యాసంస్థలు ఇందులో ఉన్నాయి. కాగా రష్యా బయోటక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగంలో అనుభవం ఉన్న సంస్థలను ఒక గొడుగు కిందకు తీసుకొచ్చింది. పరిశోధన క్రమంలో తక్కువ పరిమితులు ఉండటం, అనుమతులు త్వరగా రావడంతో పరిశోధనలో వేగం పెరిగింది. ఈ టీకా పరిశోధనలో టెక్నాలజీని కూడా పెద్ద ఎత్తున వినియోగించింది రష్యా. క్యాన్సర్ పేషెంట్ల ట్యూమర్, జెనెటిక్ ప్రొఫైల్‌ను విశ్లేషించడానికి.. ఏఐ, మెషీన్ లెర్నింగ్‌తో NMRRC ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం గమనార్హం. దీనివల్ల ఒక్కో పేషెంట్‌కు ప్రత్యేక వ్యాక్సిన్ వేగంగా తయారు చేయడానికి వీలైంది


కాగా భారత్‌లో కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు చేస్తోంది.ముఖ్యంగా భారత క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ -BCGA వంటి భారీ ప్రాజెక్టులతో DNA ఆధారిత రోగ నిర్ధారణ, చికిత్సలను అభివృద్ధి చేస్తూ, రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తున్నాయి. టాటా మెమోరియల్ సెంటర్, ACTREC వంటి సంస్థలు ప్రాథమిక, క్లినికల్ పరిశోధనలను చేస్తున్నాయి, అదే సమయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వంటి సంస్థలు సమగ్ర క్యాన్సర్ నియంత్రణ కార్యక్రమాలను చేపడుతున్నాయి. పరిశోధనలు రోగనిర్ధారణ పద్ధతులను, చికిత్సలను మెరుగుపరచడమే కాకుండా, క్యాన్సర్ సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి mRNA టెక్నాలజీ, జీన్ సీక్వెన్సింగ్‌, ఏఐలో భారత్‌కు మంచి పట్టు ఉంది. ప్రస్తుతం మహిళల్లో ఎక్కువగా ఉన్న బ్రెస్ట్, ఓరల్, సర్వైకల్ క్యాన్సర్ల కోసం టీగా తయారీలో భారత్ నిమగ్నమైంది. అత్యాధునిక ఇమ్యునోథెరపీలు, పర్సనలైజ్డ్ క్యాన్సర్ చికిత్సల్లో భారత్ ముందు వరుసలో ఉంది.



మొత్తం మీద క్యాన్సర్‌ చికిత్సలో కీలక ముందడుగు పడింది. ఇదే వేగంతో ముందుకెళ్తే.. అనేక క్యాన్సర్ వ్యాక్సిన్లు.. క్లినికల్ టయల్స్‌ దశను దాటుకుని చికిత్సకు ఉపయోగించేలా సిద్ధమయ్యే అయ్యే అవకాశం ఉంది. రష్యా మాదిరిగానే భారత్‌ కూడా బయోటెక్నాలజీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఏజెన్సీలు, విద్యా సంస్థలు, కంపెనీలను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చి.. క్యాన్సర్ వ్యాక్సిన్ పరిశోధనల్లో జాప్యం లేకుండా చూడాలి. ముఖ్యంగా క్యాన్సర్ టీకాలు, చికిత్స సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు పడాలి. రష్యా తయారు చేసిన ఎంటెరోమిక్స్ క్లినికల్ ట్రయల్స్‌ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే మార్కెట్‌లోకి వచ్చేందుకు ఎంతో కాలం పట్టదు. భారత్‌లోని క్యాన్సర్ పేషంట్లు కూడా ఈ టీకా కోసం ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories