South Asia Unrest: శ్రీలంక నుంచి నేపాల్ వరకు ఆందోళనలు.. వెనుక అంతర్జాతీయ కుట్రలున్నాయా?


South Asia Unrest: శ్రీలంక నుంచి నేపాల్ వరకు ఆందోళనలు.. వెనుక అంతర్జాతీయ కుట్రలున్నాయా?
మొన్న శ్రీలంక, నిన్న బంగ్లా, ఇవాళ నేపాల్.. మూడు దేశాల్లోనూ ఒకేలా తిరుగుబాటు భారత్ ఇరుగు పొరుగు దేశాల్లో సంక్షోభాలు అవినీతి, అసమర్ధ పాలన, ఆర్థిక సంక్షోభం.. నిరుద్యోగం, యువతలో పెరిగిన నైరాశ్యం ఈ ఆందోళనలు ఎక్కడికి దారి తీస్తాయో? దక్షిణాసియా దేశాలపూ కుట్ర జరుగుతోందా?
మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్ మరి రేపు? మన పొరుగు దేశాల్లో జరుగుతున్న తిరుగుబాట్లు ఆందోళన కలిగించడం సహజం.. ఇవన్నీ స్కెచ్ గీసినట్లు ఒకే రీతిలో కనిపిస్తున్నాయి. అవినీతి, అసమర్ధత, నిరుద్యోగం, పేదరికంలాంటి అంశాలపై ముందుగా సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్ అవుతాయి. ప్రశ్నించేందుకు వీధుల్లోకి రమ్మని పిలుపునిస్తారు.. సహజంగానే ఆందోళనల్లో అసాంఘిక శక్తులు చేరడం, హింస, కాల్పులు జరిగిపోతాయి.. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోతుంది.. ఇదిగిదిగో పాలకుడు అంటూ ఎవరో తెర మీదకు వస్తారు.. ఇవన్నీ చూస్తుంటూ ఏమైనా అంతర్జాతీయ కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానం సహజం.. అసలేమిటీ కుట్రలు? వాచ్ దిస్ స్టోరీ..
ఎక్కడో పెట్టిన నిప్పు అడవి అంతటినీ దహించేస్తుంది.. ఒక్కసారిగా ముప్పు ముంచుకొచ్చేసరికి అదుపు చేయడం అంత సులభం కాదు.. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయి జరగాల్సిన నష్టం జరుగుతుంది. పుకార్లు పుట్టించడం చాలా సులువు. కానీ ఆ తర్వాత పరిణామాలను అదుపు చేయడం అంత సులభం కాదు. 2022లో శ్రీలంక.. 2024లో బంగ్లాదేశ్.. ఇప్పుడు 2025లో నేపాల్.. దేశాలు వేరు.. పాలకులు వేరు.. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం ఒక్కటే.. పెద్ద సంఖ్యలో జనాలు వీధుల్లోకి వస్తారు.. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు.. ఈ క్రమంలో భారీ హింస.. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఒకే తీరులో కనిపింది. కథ పాత్రలు మాత్రమే మారుతాయి.. శ్రీలంకలో రాజపక్స పాలన పతనం, బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ఇప్పుడు నేపాల్‌లో కేపీ శర్మ ఓలీ రాజీనామా.. వీటన్నింటికీ కారణం అవినీతి, అసమర్ధ పాలన, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగంలాంటి సమస్యలు.. యువతలో నిరాశ వంటి సమస్యలను పాలకులు పట్టించుకోకపోవడం. భారత్ పొరుగు దేశాల్లో జరుగుతున్న పరిణామాలు దాదాపు ఇకేలా కనిపిస్తున్నాయి..
మన దేశానికి భౌగోళికంగా దిగువన హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం శ్రీలంక.. 2022లో ఆ దేశం అతిపెద్ద ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని చూసింది. విదేశీ మారక నిల్వలు అయిపోవడం, ఇంధనం, మందుల కొరత, విపరీతమైన ద్రవ్యోల్బణం, అధిక అప్పుల కారణంగా ప్రజల జీవితాలు దుర్భరమయ్యాయి. వీటన్నింటి మీద సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రజలు ప్రధాని మహీంద రాజపక్స, అధ్యక్షుడు గోటబాయ రాజపక్సలను అధికారం నుంచి తరిమేయడమే కాకుండా.. వారి ఇళ్లను కూడా తగలబెట్టారు. అధ్యక్షుడు గోటబాయ రాజపక్స తన భవనాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. నిరసనకారులు పార్లమెంట్ భవనం, రాష్ట్రపతి భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంటే దశాబ్దాలుగా అధికారంలో ఉన్న రాజపక్స కుటుంబం ఒక్కసారిగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. శ్రీలంకలో కుటుంబ రాజకీయాలు.. అవినీతి.. ఒప్పందాలు.. ఇవన్నీ కూడా శ్రీలంకలో పరిస్థితి చేయి దాటిపోవడానికి కారణమని అంతర్జాతీయ మీడియా పెద్ద ఎత్తున కథనాలు అల్లింది..
ఇక తర్వాత కథ బంగ్లాదేశ్.. 2024 ప్రారంభం నుంచి ఆ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా యువత రోడ్లపైకి రావడం ప్రారంభించింది. విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల మద్దతుతో ఈ ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ప్రధాని షేక్ హసీనా కూడా దేశం వదిలి పారిపోవలసి వచ్చింది. అయినప్పటికీ ఆందోళనకారులు ఆగలేదు. షేక్ హసీనా ఇంట్లోకి చొరబడి దోచుకున్నారు. ఆమె ఆస్తులకు నిప్పంటించారు. ప్రభుత్వ భవనాలు, వాహనాలు, ఆస్తులను ధ్వంసం చేశారు. మైనారిటీల మీద విచ్చల విడిగా దాడులు జరిగాయి. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారకుడైన హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రహ్మన్ విగ్రహాలను, స్మారక చిహ్లాలను కూడా వదలకుండా ధ్వంసం చేశారు. ప్రస్తుతం షేక్ హసీనా ఇండియాలో నివసిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో మొహమ్మద్ యూనస్ నాయకత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే అక్కడి పరిస్థితులేవీ మారలేదు. పైగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత విచ్చిన్నమైంది. యూనస్ ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్‌లతో చేతులు కలిపింది.
ప్రస్తుతం నేపాల్‌లో ఇంకా దారుణమైన అల్లర్లు జరుగుతున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేసినా ఆందోళనలు చల్లారలేదు. దేశ అధ్యక్షుడితో సహా మాజీ ప్రధానుల ఇళ్లను, పార్లమెంటును, సుప్రీంకోర్టును, ప్రభుత్వ కార్యాలయాలను దహనం చేశారు. ఓ మాజీ ప్రధాని భార్యను మంటల్లో తగులబెట్టారు.. ఓ మంత్రిని వీథుల్లో ఉరికిస్తూ కొట్టారు. ఈ ఆందోళనలు ఎక్కడి వరకు దారి తీస్తాయో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి సైన్యం దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ గొడవలు తగ్గడం లేదు. అక్కడ అధికారపక్ష, ప్రతిపక్ష నాయకులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.. జరుగుతున్న గొడవల వల్ల పోయిన ప్రాణాలు కచ్చితంగా తెలియలేదు. నేపాల్‌లో జరిగిన అల్లర్ల వెనుక జెన్ జడ్ ఉద్యమకారులు ప్రధానంగా కనిపిస్తున్నారు. ఇది కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలను రద్దు చేసిన ఆగ్రహం కాదు… ఎన్నాళ్లుగా ప్రభుత్వ పనితీరు మీద, నిరుద్యోగం మీద, అవినీతి మీద, అసమర్థత మీద జనంలో పేరుకుపోతున్న కోపం, ఇలా బద్ధలైంది… అందుకే సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలను తిరిగి స్టార్ట్ చేసినా జనంలో కోపం తగ్గడం లేదు ..
జాగ్రత్తగా గమనించి చూస్తే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో జరిగిన పరిణామాలు ఒకే తీరున కనిపిస్తాయి. ఈ మూడు కూడా దక్షిణాసియాలో భారత్ చుట్టూ ఉన్న దేశాలే.. మూడు దేశాలు కూడా కొంత కాలంగా చైనాకు అనుకూలంగా మారాయి. శ్రీలంకలో పరిస్థితులు ఇప్పుడు కుదుట పడ్డాయి.. అక్కడ అసలేం అసలేం జరిగిందని పరిశీలిస్తే అగ్రరాజ్యం పాత్ర ప్రముఖంగా కనిపిస్తోంది.. శ్రీలంకలోని వనరులపై అమెరికా కంపెనీలు కన్నువేశాయి. బంగ్లాదేశ్ మీద కూడా ఎప్పటి నుంచో అమెరికా కక్ష కట్టింది. బంగ్లాదేశ్ పరిధిలోని బంగాళాఖాతంలోని ద్వీపంలో స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు అగ్రరాజ్యం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు షేక్ హసీనా అంగీకరించకపోవడంతో కక్ష కట్టింది. బంగ్లాదేశ్‌లో మతోన్మాద శక్తుల విజృంభన తన ప్రభుత్వం పడిపోవడానికి కారణం అమెరికా అని షేక్ హసీనా ఆరోపించారు. ఇప్పటికీ ఆమె అదే మాట మీద కట్టుబడి ఉన్నారు. తాజాగా నేపాల్‌లో జరిగిన అల్లర్ల వెనుక కూడా అమెరికా హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. జెన్ జడ్‌తో పాటు కొన్ని ఎన్జీవోలకు అమెరికా నుంచి ఫండింగ్ అందుతోందని చెబుతున్నారు. ఈ శక్తులే ప్రభుత్వ వ్యతిరేకతను రెచ్చగొట్టి తిరుగుబాటుకు కారణమయ్యాయని అంటున్నారు.
మన చుట్టూ ఉన్న దేశాల్లో అంతర్యుద్ధాలు సృష్టించి.. తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇటు చైనా, అటు అమెరికా ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్‌లో కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లతో చూస్తే పాక్‌తో మనకు మొదటి నుంచీ సమస్యలు ఉన్నాయి. ఆ దేశంలో చైనా గతంలో బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్టు చేపట్టింది. తాజా అమెరికా మన శత్రు దేశంతో మరింత స్నేహం చేస్తోంది. కారణం ఆ దేశలో ఉన్న అపార ఖనిజ వనరులే.. ఇందు కోసం అమెరికా, పాక్‌ల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం పేరుకు మాత్రమే. అక్కడ పెత్తనం అంతా సైన్యానిదే.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని పడగగొట్టిన సైన్యం నామమాత్రపు ఎన్నికలు జరిపి ప్రస్తుతం షహబాబ్ షరీప్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చింది. కానీ అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ ప్రధానికన్నా ఆర్మీ చీఫ్‌కే విలువ ఇస్తున్నారు.. ఇక దీర్ఘ కాలికంగా సైనిక పాలన ఉన్న దేశం మయన్మార్. అక్కడ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీకి అమెరికా మద్దతు ఇస్తోంది. 2020లో సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డమోక్రసీ పార్టీ భారీ విజయం సాధించింది. యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ పార్టీ సైన్యానికి, చైనాకు అనుకూలంగా వ్యవహరించేది. 2021 ఫిబ్రవరిలో సైన్యం సూకీతో పాటు అధికార పార్టీ నేతలందరినీ అరెస్టు చేసి.. దేశ పగ్గాలు తీసుకుంది. మిలిటరీ నాయకత్వానికి చైనా మద్దతు ఇస్తోంది. మిలిటరీతో పోరాడుతున్న, ప్రజాస్వామ్య అనుకూల సాయుధ బలగాలకు అమెరికా అండగా నిలిచింది.
శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ సంక్షోభాలను పరిశీలిస్తే.. ఓ కామన్ పాయింట్ కనిపిస్తోంది. అకస్మాత్తుగా ఒక విధానపరమైన కారణంతో నిరసనలు మొదలవుతాయి. అవి ఒక్కసారిగా విస్తరించి హింసాత్మకంగా మారుతాయి. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతాయి. రాజకీయ నేతల భవనాలు కూల్చేయడం, నిప్పుపెట్టడం చేస్తారు. తర్వాత ఓ వ్యక్తి ఆపద్ధర్మ దేశాధినేతగా పగ్గాలు చేపడతారు లేదా అధికార మార్పిడి జరుగుతుంది. ఇలా జరగడం వెనుక విదేశీ శక్తులు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. అమెరికా, చైనా మధ్య ఉన్న పోటీ ఈ పరిస్థితులకు ముఖ్య కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణాసియా ప్రాంతంలో తమ ప్రాబల్యం ఉండాలని.. అమెరికా, చైనా మధ్య పోటీ ఎక్కువైంది. ఈ రెండు దేశాలు.. తమ వ్యూహాత్మక, ఆర్థిక, సైనిక ప్రయోజనాల కోసం.. దక్షిణాసియా దేశాలను సంక్షోభ కుంపట్లలోకి నెట్టేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది.. పొరుగు దేశాలతో పోలిస్తే భారత్ చాలా భిన్నంగా కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వం కనిపించే మన దేశంలో తిరుగుబాట్లు అంత సులభం కాదు. అయినా ఏదో రూపంలో చిచ్చు పెట్టేందుకు కుట్రలు జరిగాయనే అభిప్రాయం ఉంది. భారత్‌లో జరిగిన కొన్ని ఉద్యమాల వెనుక విదేశీ హస్తం కాదనలేని నిజం అంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా పొరుగు దేశాల్లో జరుగుతున్న కుట్రల విషయంలో మన దేశం అప్రమత్తంగా ఉండక తప్పదు

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire