Greenland: గ్రీన్‌లాండ్‌పై మళ్లీ ట్రంప్ కన్ను.. అమెరికా–డెన్మార్క్ మధ్య కొత్త ఉద్రిక్తత

Greenland: గ్రీన్‌లాండ్‌పై మళ్లీ ట్రంప్ కన్ను.. అమెరికా–డెన్మార్క్ మధ్య కొత్త ఉద్రిక్తత
x

Greenland: గ్రీన్‌లాండ్‌పై మళ్లీ ట్రంప్ కన్ను.. అమెరికా–డెన్మార్క్ మధ్య కొత్త ఉద్రిక్తత

Highlights

గ్రీన్‌లాండ్‌పై మళ్లీ డొనాల్డ్ ట్రంప్ కన్ను గ్రీన్‌లాండ్‌లో అమెరికా దూత అర్కిటిక్‌పై నియంత్రణ కోసమేనా? ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపం డెన్మార్క్ పరిధిలో ఉన్న గ్రీన్‌లాండ్‌ పుష్కలంగా రాగి, లిథియం ఖనిజాలు

గ్రీన్‌లాండ్ మీద మరోసారి అమెరికా అధ్యక్షుని కన్నుపడింది. అక్కడి అపార ఖనిజ సంపదే ఇందుకు కారణం.. ఇందుకోసం ఏకంగా లూసియానా గవర్నర్‌ జెఫ్‌ లాండ్రీని ప్రత్యేక దూతగా నియమించారు డొనాల్డ్ ట్రంప్. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది డెన్మార్క్. అమెరికాతో సహా ప్రతి ఒక్కరూ మా ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలని స్పష్టం చేసింది. అయితే అమెరికా జాతీయ భద్రత కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చుకున్నారు ట్రంప్. గ్రీన్‌లాండ్‌లోని ఖనిజాల మీద కన్నేశామడం సరికాదని తెలిపారు. గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదని డెన్మార్ పదే పదే చెప్పినా ట్రంప్ చూపు ఆ ద్వీపం మీదే ఉంది.


గ్రీన్‌లాండ్ మరోసారి వార్తల్లోకి వచ్చేసింది.. అదీ అమెరికా అధ్యక్షుని వ్యాఖ‌్య కారణంగానే.. గ్రీన్‌లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఇది.. ఆర్కిటిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య ఉన్న ఈ ద్వీపం భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలో భాగం. అయినప్పటికీ యూరోప్‌లోని డెన్మార్‌ ఆధీనంలో ఉంది గ్రీన్‌లాండ్. డెన్మార్క్‌లో ప్రావిన్స్‌ అయిన గ్రీన్‌లాండ్‌కు స్వయంప్రతిపత్తి ఉంది. అయితే ఈ ద్వీపానికి చెందిన విదేశాంగ వ్యవహారాలు, రక్షణ, సహజవనరులు అన్నీ డెన్మార్క్ చూస్తుంది. 20 లక్షల చదరపు కి.మీ విస్తీర్ణం గల గ్రీన్‌లాండ్‌ జనాభా 57వేలు. ఈ ద్వీపంలోని 85 శాతం భూభాగంపై 3 కి.మీ మందంతో మంచుదుప్పటి కప్పుకుంది. అయితే గ్రీన్‌లాండ్‌లో రాగి, లిథియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాటరీలు, ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వీటి వినియోగం ఎక్కువ.. ఈ కారణంగానే అమెరికా ఈ ద్వీపం మీద కన్నేసింది.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా గ్రీన్‌లాండ్ స్వాధీనం గురుంచి మాట్లాడుతున్నారు.. ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్న 2019 ఆగస్టులో డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడం వీలవుతుందా? అని తన సన్నిహితులతో ఆలోచన పంచుకున్నారు. అయితే ఈ ప్రతిపాదనను గ్రీన్‌లాండ్‌ ఖండించింది. ట్రంప్‌ ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌ చేస్తున్నారనుకుంటా. కానీ ఇది సీజన్‌ కాదు అని గ్రీన్‌లాండ్‌ మాజీ ప్రధాని లార్స్‌ రాముస్సేన్‌ వ్యాఖ్యానించారు. గ్రీన్‌లాండ్‌ అమ్మకానికి సిద్ధంగా లేమని.. భవిష్యత్తులో అమ్మే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా ట్రంప్ ఈ ఏడాది జనవరిలో మరోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే డెన్మార్క్‌ ప్రధాని ఫ్రెడెరిక్సన్‌కు ఫోన్ చేసి గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునే విషయంలో సీరియస్‌ ఆలోచన చేస్తున్నామన్నారురు. అయితేదానికి ఫ్రెడెరిక్సన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ కోపంతో డెన్మార్క్‌ను ఆర్థికంగా శిక్షిస్తానని బెదిరించారు. అమెరికా అధ్యక్షుని బెదింపుతో డెన్మార్క్ ప్రభుత్వం దిగ్బ్రాంతికి గురైంది


ఈ ఏడాది మార్చిలో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌ తన సతీమణి ఉషతో కలిసి గ్రీన్‌లాండ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తారు. డెన్మార్క్‌తో సంబంధాలు తెంచుకోవాలని గ్రీన్‌లాండ్‌ పౌరులకు పిలుపునిచ్చారు. ఆ దేశం మిమ్మల్నిఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. చైనా, రష్యాలకు గ్రీన్‌లాండ్‌ను అప్పగించాలన్నదే డెన్మార్క్‌ ఆలోచనగా కనిపిస్తోందని మండిపడ్డారు. అందుకే అమెరికాతో ఒక ఒప్పందానికి వస్తే బాగుంటుందని గ్రీన్‌లాండ్‌ ప్రజలకు సూచించారు. ఇతర దేశాల ఆక్రమణల నుంచి కాపాడే సత్తా అమెరికాకు మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. గ్రీన్‌లాండ్‌ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. గ్రీన్‌లాండ్‌ భద్రతతోనే అమెరికా భద్రత ముడిపడి ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై డెన్మార్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.


తాజాగా గ్రీన్‌లాండ్ విషయం మరోసారి తెర మీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ లూసియానా గవర్నర్‌ జెఫ్‌ లాండ్రీని గ్రీన్‌ ల్యాండ్‌కు ప్రత్యేక దూతగా నియమించారు. ఈ చర్య మీద గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్-ఫ్రెడరిక్ నీల్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భవితవ్యాన్ని తామే నిర్ణయించకుంటామన్నారు. మరోవైపు అమెరికాతో సహా ప్రతిఒక్కరూ డెన్మార్క్‌ దేశ ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలని డెన్మార్క్‌ విదేశాంగ మంత్రి లార్స్ లోకే రాస్ముస్సేన్ పేర్కొన్నారు.

దీంతో అధ్యక్షుడు ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. అమెరికాకు జాతీయ భద్రత నిమిత్తం గ్రీన్‌లాండ్‌ కావాలని.. ఖనిజాల కోసం కాదని సమర్దించుకున్నారు. ఈ బాధ్యతను నిర్వర్తించడానికే ప్రత్యేక దూతగా జెఫ్‌ లాండ్రీని నియమించినట్లు తెలిపారు.


గ్రీన్‌లాండ్‌ ఖనిజ సంపద విలువ సుమారు 1.1 ట్రిలియన్‌ డాలర్లు గా ఉండొచ్చని ఓ అంచనా. అయితే అమెరికా గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలంటే 12.5 బిలియన్ డాలర్ల నుంచి 77 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని న్యూయార్క్ మాజీ ఆర్థికవేత్త డేవిడ్ బార్కర్ ఓ అంచనా వేశారు.. అంటే ఈ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం.. రూ.1 లక్ష కోట్ల నుంచి రూ. 6.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పవచ్చు. వాస్తవానికి గ్రీన్‌లాండ్‌ను కొనాలనే అమెరికా ఆలోచన కొత్తదేమీ కాదు. 1946లో నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ 100 మిలియన్ డాలర్ల విలువైన బంగారానికి కొనుగోలు చేయాలని అనుకున్నారు. కానీ ఆయన ప్రతిపాదనను దీన్ని డెన్మార్క్ తిరస్కరించింది. విదేశీ భూభాగాలను కొనుగోలు చేయడం అమెరికాకు కొత్తేమీ కాదు. గతంలో ఇటువంటి లావాదేవీలు జరిగాయి. ఫ్రాన్స్‌ నుంచి లూసియానా, రష్యా నుంచి అలస్కా, డెన్మార్క్‌ నుంచి యూఎస్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌ను అమెరికా కొనుగోలు చేసింది.


గ్రీన్‌లాండ్ మీద అమెరికా కన్నేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. అర్కిటిక్‌పై నియంత్రణ కోసం గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ఆలోచన. అదే సమయంలో రష్యా ఆర్కిటిక్‌లోని తన సైనిక స్థావరాలను ఆధునీకరిస్తోంది. ఇటు అమెరికా, అటు రష్యా చేస్తున్న ఈ ప్రయత్నాలు నాటో కూటమిలోని యూరప్‌ దేశాలను భయపెడుతున్నాయి. . ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతమైన అర్కిటిక్‌ కోసం పెద్ద దేశాల మధ్య ముదురుతున్న ఈపోటీ ప్రపంచ భద్రతకే పెను ముప్పుగా మారుతోంది.గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడం అంత తేలికేమీ కాదు. అమెరికా జాతీయ భద్రతపై ఆందోళనలు ఈ కొనుగోలు ఆసక్తికి కారణమైనప్పటికీ.. గ్రీన్‌లాండ్‌ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జాతీయవాదం, ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ చట్టాల దృష్ట్యా ఒక దేశాన్ని కొనుగోలు చేయడం అంత సులభమేమీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు గ్రీన్‌లాండ్‌లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఎంతగా అంటే ఏటా సగటున 5,500 కోట్ల టన్నుల మేరకు! 1992లో మొదలైన ఈ ధోరణి ఏటా అంతకంతకూ పెరుగుతూనే వస్తోందట. ఆ లెక్కన గత 28 ఏళ్లలో అక్కడ ఏకంగా 5 లక్షల టన్నుల మంచు మాయమైపోయింది. అపారమైన మంచు నిల్వలకు గ్రీన్‌లాండ్‌ ఆలవాలం. ప్రపంచంలోని మొత్తం మంచినీటిలో 8 శాతం అక్కడే ఉందని అంచనా. అక్కడినుంచి ఆవిరవుతున్న నీరు ఎటు వెళ్తోందో తెలియడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఆర్కిటిక్‌పై పట్టు కోసం అగ్రరాజ్యాలు చేస్తున్న ప్రయత్నాలు ఆక్కడ విపరీతమైన వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. 2040 నాటికి వేసవిలో ఈ ప్రాంతంలో మంచు ఆనవాలే ఉండకపోవచ్చని ఒక అధ్యయనం ఇప్పటికే హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories