Venezuela oil : వెనిజులా చమురుపై ట్రంప్ మాస్టర్ ప్లాన్‌.. 50 మిలియన్ బారెళ్ల విక్రయానికి సిద్ధం

Venezuela oil : వెనిజులా చమురుపై ట్రంప్ మాస్టర్ ప్లాన్‌.. 50 మిలియన్ బారెళ్ల విక్రయానికి సిద్ధం
x

Venezuela oil : వెనిజులా చమురుపై ట్రంప్ మాస్టర్ ప్లాన్‌.. 50 మిలియన్ బారెళ్ల విక్రయానికి సిద్ధం

Highlights

వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టు అనంతరం, ఆ దేశ చమురు నిల్వలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టు అనంతరం, ఆ దేశ చమురు నిల్వలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెనిజులా నుంచి సుమారు 50 మిలియన్ బారెళ్ల నాణ్యమైన ముడి చమురును సేకరించి, అంతర్జాతీయ మార్కెట్ ధరలకు విక్రయించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ విక్రయం ద్వారా వచ్చే నిధులను అమెరికా, వెనిజులా ప్రజల ప్రయోజనాల కోసం వినియోగిస్తామని వెల్లడించారు.

మంగళవారం తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ట్రంప్ ఈ సంచలన ప్రకటన చేశారు. వెనిజులాలో ప్రస్తుతం పనిచేస్తున్న తాత్కాలిక యంత్రాంగం ఈ చమురును అమెరికాకు అప్పగించేందుకు అంగీకరించిందని ఆయన తెలిపారు.

“వెనిజులా తాత్కాలిక అధికారులు 30 నుంచి 50 మిలియన్ బారెళ్ల అత్యంత నాణ్యమైన చమురును అమెరికాకు అందజేస్తున్నారు. ఇది చెప్పడం నాకు సంతోషంగా ఉంది” అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ చమురు విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.16,000 కోట్లకు పైగా)గా అంచనా వేయబడుతోంది.

నిధులపై పూర్తి నియంత్రణ అమెరికాకే

ఈ చమురు విక్రయం ద్వారా వచ్చే మొత్తంపై పూర్తిగా అమెరికా ప్రభుత్వ నియంత్రణే ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. “ఈ చమురును మార్కెట్ ధరకే విక్రయిస్తాం. అమెరికా అధ్యక్షుడిగా ఆ నిధుల వినియోగంపై నా పర్యవేక్షణ ఉంటుంది. ఈ మొత్తాన్ని కేవలం అమెరికా, వెనిజులా ప్రజల సంక్షేమం కోసమే ఉపయోగిస్తాం” అని తెలిపారు.

ప్రస్తుతం వెనిజులాలో లక్షలాది బారెళ్ల చమురు ట్యాంకర్లలో, భారీ స్టోరేజ్ ట్యాంకుల్లో నిల్వగా ఉన్నట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ చమురును ఎగుమతి చేయకుండా ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తాజా ప్రణాళికను అత్యవసర ప్రాతిపదికన అమలు చేయాలని ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్‌కు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. స్టోరేజ్ షిప్పుల ద్వారా ఈ చమురును నేరుగా అమెరికా అన్లోడింగ్ డాక్స్‌కు తరలిస్తామని ట్రంప్ వెల్లడించారు.

సైనిక చర్యలు – వెనిజులా ఆగ్రహం

అమెరికా డిమాండ్లకు లొంగకపోతే మరిన్ని సైనిక చర్యలు తప్పవన్న హెచ్చరికల నేపథ్యంలోనే ఈ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. మదురోను అరెస్ట్ చేయడానికి అమెరికా దళాలు నిర్వహించిన మెరుపు దాడిలో కనీసం 24 మంది వెనిజులా భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, వెనిజులా ఉన్నతాధికారులు అమెరికా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. మదురో అరెస్టును ‘కిడ్నాప్’గా అభివర్ణించిన వారు, దేశంలోని అపారమైన చమురు సంపదను దోచుకునేందుకే అమెరికా ఈ కుట్రకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు.

చమురు దిగ్గజాలతో ట్రంప్ భేటీ

వెనిజులాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా తన తదుపరి చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఎక్సాన్, షెవ్రాన్, కోనోకో ఫిలిప్స్ వంటి ప్రముఖ చమురు కంపెనీల ప్రతినిధులతో ట్రంప్ శుక్రవారం వైట్ హౌస్‌లో భేటీ కానున్నారు. ఈ వార్త వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సుమారు 1.5 శాతం మేర తగ్గడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories