Donald Trump: గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్ను: సైనిక చర్యకు సిద్ధమంటున్న వైట్‌హౌస్.. డెన్మార్క్ సంచలన హెచ్చరిక!

Donald Trump: ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్కు ఇక మూడినట్లే కనిపిస్తోంది. అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడం తమకు అత్యంత అవసరమని తాజాగా వైట్‌హౌస్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపణలు రేపుతున్నాయి.
Donald Trump: ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్కు ఇక మూడినట్లే కనిపిస్తోంది. అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడం తమకు అత్యంత అవసరమని తాజాగా వైట్‌హౌస్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపణలు రేపుతున్నాయి. అవసరమైతే సైనిక చర్యకూ వెనుకాడబోమని స్పష్టం చేయడం డెన్మార్క్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రష్యా, చైనా వంటి ప్రత్యర్థులను నిరోధించడానికి తమకు ఈ ద్వీపం కావాలని పట్టబడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే గ్రీన్లాండ్ అక్కడి ప్రజలదని.. ఇందుకు సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే హక్కు వారికే మాత్రమే ఉంది యూరోప్ నాయకులు అంటున్నారు.
డొనాల్డ్ ట్రంప్‌లోని సామ్రాజ్యవాది మేల్కొ్న్నాడు. అర్ధరాత్రి వేళ వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను నిర్బంధించి తీసుకొచ్చి ప్రపంచానని విస్మయానికి గురి చేసిన ఊపులో మరింతగా చెలరేగిపోతున్నారు. తాను ఇంతటితో ఆగబోనని దారికి తేవాల్సిన దేశాలు ఇంకొన్ని ఉన్నాయని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు. తన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడుతూ అవసరమైతే ఏ క్షణమైనా విరుచుకుపడతాం అంటూ కొలంబియా, క్యూబా, మెక్సికో పేర్లను కూడా వినిపించారు డొనాల్డ్ ట్రంప్.. అంతే కాదు.. ఒక 20 రోజులాగండి, గ్రీన్లాండ్ గురించి మనమంతా మాట్లాడుకుందాం’’అంటూ వ్యాఖ్యలు చేశారాయన. గ్రీన్లాండ్ మాక్కావాల్సిందే. అమెరికా భద్రత దృష్ట్యా ఇది అత్యంత కీలకం. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.. అంటూ చాలా స్పష్టంగా చెప్పేశారు. ట్రంప్ చెప్పిన మాటలు చూస్తుంటే అమెరికా తదుపరి కార్యాచరణకు ఉపక్రమించే దేశాల వరుసలో ముందుగా ఉన్నది డెన్మార్క్ అధీనంలోని గ్రీన్లాండ్ అనేది స్పష్టమైపోయింది.
తాజాగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. "గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడం అమెరికా జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆర్కిటిక్ ప్రాంతంలో శత్రువులను నిరోధించడానికి ఇది ఎంతో కీలకం. ఈ విదేశీ విధాన లక్ష్యాన్ని చేరుకోవడానికి అధ్యక్షుడు, ఆయన బృందం చర్చిస్తున్నారు. ఈ క్రమంలో, కమాండర్ ఇన్ చీఫ్ అధికార పరిధిలో అమెరికా సైనిక బలగాలను ఉపయోగించే ఆప్షన్ ఆయనకు ఉంది" అంటూ ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కమాండర్ ఇన్ చీఫ్ అంటే మరెవరో కాదు అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్. గ్రీన్లాండ్ స్వాధీనం విషయంలో ట్రంప్ ఎంత పట్టుదలతో ఉన్నారో ఈ ప్రకటన మరింత స్పష్టతను ఇచ్చింది. డెన్మార్క్‌తో ఇందు కోసం చర్చలు జరుపతామని ట్రంప్ యంత్రాంగం చెబుతోంది. ఒప్పకోక పోతే తదితర కార్యాచరణగా మిలటరీని దింపాలనే ఆలోచన కూడా ఉంది.
గ్రీన్లాండ్ విషయంలో అమెరికా తీరును ఇప్పటికే డెన్మార్క్ తప్పుపట్టింది. తమ దేశంలోని గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటే, నాటో సైనిక కూటమి ఉనికి ముగిసిపోతుందని డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడరిక్సన్. ఇలాంటి చర్యల వల్ల రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి తమకు భద్రతను కల్పిస్తున్న నాటో కూటమి ఉనికి ప్రశ్నార్ధకంగా మారే ముప్పు ఉంటుందని హెచ్చరించారు. అటు ట్రంప్ వ్యాఖ్యలపై గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అంత ఈజీగా ఆక్రమించుకోలేదని, తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. వెనెజువెలాతో పోల్చి చూడటం సరికాదన్నారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలు పక్కన పెట్టి, తమతో ఉన్న దీర్ఘకాలిక సంబంధాల పునరుద్ధరణపై అమెరికా ప్రభుత్వం ఫోకస్ పెడితే బాగుంటుందని హితవు పలికారు.
అమెరికా అధ్యక్షుని తీరుపై యూరోప్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. గ్రీన్లాండ్ విషయమై అమెరికా, డెన్మార్క్ మధ్య మొదలైన రగడ నాటో కూటమి అస్తిత్వంపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. నాటో కూటమిలో అవి రెండూ సభ్య దేశాలేనన్నది తెలిసిందే. కూటమిలోని ఏ దేశంపై దాడి జరిగినా అది అందులోని దేశాలన్నిటిపైనా దాడిగానే పరిగణించి అంతా కలసికట్టుగా ఎదుర్కోవాలన్నది నాటో ఒప్పందం. అలాంటప్పుడు అమెరికా ఏకంగా తోటి సభ్య దేశంపైనే దాడికి దిగితే అది కూటమి మూల, వ్యవస్థాపక సూత్రాలకే విరుద్ధమవుతుంది. డెన్మార్క్‌కు మద్దతుగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, పోలాండ్, డెన్మార్క్ దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. గ్రీన్లాండ్ డెన్మార్క్ రాజ్యంలో అంతర్భాగమని, దాని భవిష్యత్తును నిర్ణయించే అధికారం కేవలం అక్కడ నివసించే ప్రజలకు, డెన్మార్క్‌కు మాత్రమే ఉందని ఈ దేశాలు స్పష్టం చేశాయి. అంతర్జాతీయ సరిహద్దులను బలవంతంగా మార్చడం అంగీకారం కాదని, సమితి చార్టర్‌ను గౌరవించాలని డిమాండ్ చేశాయి.
గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ ఆసక్తి వెనక బోలెడన్ని కారణాలున్నాయి. యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు అది సరిగ్గా మధ్యలో ఉంటుంది. దాంతో అమెరికా సైన్యానికి వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా కీలకం. అంతేగాక ఖండాంతర క్షిపణుల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఇది అత్యంత అనువైనది. వాయవ్య గ్రీన్లాండ్లోని పిటుఫిక్‌లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరముంది. ఇక్కడి నుంచి రష్యా నావికా దళ కదలికలపై అమెరికా అనునిత్యం స్పష్టంగా కన్నేసి ఉంచవచ్చు కూడా. ఆర్కటిక్ ప్రాంతంలో రష్యా, చైనా తమ సైనిక, వాణిజ్య ఉనికిని వేగంగా పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంగా మారిందని అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు. ఆర్కటిక్లో భద్రతను బలోపేతం చేయడానికి గ్రీన్‌లాండ్‌పై నియంత్రణ అవసరమని అమెరికా భావిస్తోంది.
అంతే కాదు గ్రీన్లాండ్లో అపారమైన ఖనిజ, చమురు, సహజవాయు నిల్వలు ఉన్నాయి. అత్యంత అరుదైన 34 ఖనిజాల్లో గ్రాఫైట్, లిథియం వంటి ఏకంగా 25 ఖనిజాలు గ్రీన్లాండ్లో అపారంగా ఉన్నట్టు తేలింది. విద్యుత్ వాహనాల తయారీలో ఇవి చాలా కీలకమన్నది తెలిసిందే. అమెరికా ఈ ఖనిజాల కోసం చాలాకాలంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. చైనాపై విధించిన భారీ టారిఫ్‌లను కూడా అంతే వేగంగా ట్రంప్ వెనక్కు తీసుకోవడానికి ఈ ఖనిజాల ఎగుమతిపై డ్రాగన్ నిషేధం విధించడమే ప్రధాన కారణం. గ్రీన్లాండ్ తమకు చిక్కితే ఇకపై ఆ ఖనిజాల కోసం చైనాను బెదిరించే దురవస్థ ఉండదన్నది ట్రంప్ యోచన. ఇక గ్రీన్లాండ్లో చమురు, సహజవాయు నిల్వలు కూడా అపారంగా ఉన్నా, పర్యావరణ కారణాల రీత్యా వాటి వెలికితీతపై నిషేధం కొనసాగుతోంది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించి వాటిని కూడా సొంతం చేసుకోవాలన్నది ట్రంప్ వ్యూహం. ట్రంప్ తదుపరి కార్యాచరణ ఏ రూపంలో ఉండబోతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది
నిజానికి డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉండగానే 2019లోనే గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామంటూ డెన్మార్క్‌కు ప్రతిపాదించారు. కానీ అక్కడి ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇక రెండోసారి అధ్యక్షుడు అయినప్పటినుంచీ గ్రీన్లాండ్ ఆక్రమణ కాంక్షన ఎప్పుడూ దాచుకోలేదు. అంతే కాదు గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలిపేసుకోవాలని తీవ్రంగా వాదించే లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీని ఏరికోరి ఆ ప్రాంతానికి ప్రత్యేక రాయబారిగా పంపారు. గ్రీన్లాండ్ ప్రాంతానికి చైనా, రష్యా సైన్యాలతో ముడిపెడుతూ ఇటీవలే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతం చుట్టూ ఆర్కిటిక్ మహా సముద్ర జలాల్లో చైనా, రష్యా యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయన్నారు. ఈనేపథ్యంలో అమెరికా జాతీయ భద్రత కోసం గ్రీన్‌లాండ్‌ను శత్రుదుర్బేధ్యంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. గ్రీన్లాండ్ తమది అని డెన్మార్క్ చెప్పుకుంటున్నప్పటికీ, ఆ ప్రాంతంపై డెన్మార్క్ ప్రభుత్వం పెద్దగా ఖర్చేం చేయలేదన్నారు ఇందుకోసం అమెరికా సహాయాన్ని యూరోపియన్ యూనియన్ తీసుకోవాలని సూచించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



