Turkey Parliament: టర్కీ పార్లమెంట్‌లో ఎంపీల ఫైటింగ్.. పిడిగుద్దుల వర్షం!

Turkey Parliament: టర్కీ పార్లమెంట్‌లో ఎంపీల ఫైటింగ్.. పిడిగుద్దుల వర్షం!
x
Highlights

Turkey Parliament: టర్కీ (తుర్కియే) పార్లమెంటు బుధవారం యుద్ధభూమిని తలపించింది. కొత్త న్యాయశాఖ మంత్రి నియామకంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఎంపీల మధ్య భౌతిక దాడులకు దారితీసింది.

Turkey Parliament: టర్కీ (తుర్కియే) పార్లమెంటు బుధవారం యుద్ధభూమిని తలపించింది. కొత్త న్యాయశాఖ మంత్రి నియామకంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఎంపీల మధ్య భౌతిక దాడులకు దారితీసింది. ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ, తోపులాటకు దిగడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇటీవల తన కేబినెట్‌లో మార్పులు చేస్తూ, వివాదాస్పద అధికారి అకిన్ గుర్లెక్‌ను న్యాయశాఖ మంత్రిగా నియమించారు. గుర్లెక్ ప్రమాణ స్వీకారం చేసేందుకు పోడియం వద్దకు వస్తున్న సమయంలో, ప్రతిపక్ష రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (CHP) సభ్యులు ఆయనను అడ్డుకున్నారు. దీనిని అధికార ఏకే (AK) పార్టీ సభ్యులు నిలువరించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.

గతంలో ఇస్తాంబుల్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన గుర్లెక్, ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లుపై 142 అభియోగాలు మోపారు. ఆయనకు 2,000 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడేలా కుట్రలు చేశారని ప్రతిపక్షం మండిపడుతోంది. అలాంటి వ్యక్తిని న్యాయశాఖ మంత్రిగా చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వారు విమర్శిస్తున్నారు.

సభలో గందరగోళం మిన్నంటడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం భారీ భద్రత మధ్య, అధికార పార్టీ ఎంపీల రక్షణ వలయంలో అకిన్ గుర్లెక్ తన ప్రమాణ స్వీకార ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories