UK: బ్రిటన్‌లో వలస వ్యతిరేక ర్యాలీ: 1.5 లక్షల మంది పాల్గొన్నారు

UK: బ్రిటన్‌లో వలస వ్యతిరేక ర్యాలీ: 1.5 లక్షల మంది పాల్గొన్నారు
x

UK: బ్రిటన్‌లో వలస వ్యతిరేక ర్యాలీ: 1.5 లక్షల మంది పాల్గొన్నారు

Highlights

వలసలకు వ్యతిరేకంగా నిరసన బ్రిటన్ చరిత్రలో అతిపెద్ద ర్యాలీ ఆందోళనలో 1.50 లక్షల మంది అతివాద నేత రాబిన్సన్ ఆధ్వర్యంలో.. యునైట్‌ ది కింగ్‌డమ్‌ పేరిట ర్యాలీ వలసదారులను వెనక్కి పంపాల్సిందే.. నిరసనకు ఎలాన్‌ మస్క్‌ మద్దతు పోటీగా స్టాండ్‌ అప్‌ టు రేసిజమ్ ర్యాలీ ఘర్షణల్లో 26 మంది గాయాలు అల్లర్లకు పాల్పడ్డ 25 మంది అరెస్టు నిరసనలను తప్పుపట్టిన ప్రధాని స్టార్మర్‌ బ్రిటన్‌లో పెరిగిపోయిన వలసలు.

వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్‌ అట్టుడుకుతోంది. తమ దేశంలోకి ప్రవేశిస్తున్న వలసదారులను వెనక్కు పంపేయాలని లండన్‌లో నిర్వహించిన భారీ స్థాయి ర్యాలీలో దాదాపు లక్షన్నర మంది పాల్గొన్నారు. ఈ ర్యాలీ బ్రిటన్‌ చరిత్రలోనే అతి పెద్దది. అతివాద నాయకుడు టామీ రాబిన్సన్ చేపట్టిన ఈ ర్యాలీకి ఎలాన్ మస్క్ కూడా మద్దతు తెలిపారు. ఇందుకు ప్రతిగా జాత్యంహంకారాన్ని నిరసిస్తూ మరో ప్రదర్శన జరగడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో 26 మంది గాయపడ్డారు. ఈ ప్రదర్శనపై బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసలదారుల వ్యతిరేక నిరసనలకు బ్రిటన్‌ ఎప్పటికీ తలవంచబోదని స్పష్టంచేశారు.


ఒకనాటి వలసవాద దేశం ఇప్పుడు వలసదారులకు వ్యతిరేకంగా గళమెత్తింది. వలసదారులకు వ్యతిరేకంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ రాజధాని లండన్‌లో చేపట్టిన భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఇది బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్ద ప్రదర్శన అని చెబుతున్నారు. విదేశీయులను దేశం నుంచి బయటకు పంపాలనే డిమాండ్‌తో యాంటీ-ఇమిగ్రేషన్ కార్యకర్త, అతివాద నాయకుడు టామీ రాబిన్సన్‌ పిలుపు మేరకు ‘యునైట్‌ ద కింగ్‌డమ్‌ ర్యాలీ’ పేరిట సెంట్రల్‌ లండన్‌లో కదం తొక్కారు. పార్లమెంట్‌ సమీపంలోనే భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏకంగా లక్షన్నరకు పైనా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనల్లో అమెరికా, ఇజ్రాయెల్‌ జెండాలను కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌ను విమర్శిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ‘వారిని తిరిగి పంపించేయండి’ అని వలస వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. మరికొంత మంది ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ అని రాసి ఉన్న టోపీలు ధరించారు.


లండన్‌ నగరం వలస వ్యతిరేక నిరసనలతో దద్దరిల్లడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కార్యక్రమం కూడా జరిగింది. మరోవైపు జాత్యాహంకారానికి వ్యతిరేకంగా ‘స్టాండ్‌ అప్‌ టు రేసిజమ్‌’ అనే నిరసన కూడా చేపట్టారు. దీనిలో 5వేల మంది పాల్గొన్నారు. రాబిన్సన్ మద్దతుదారులను జాత్యహంకారులుగా, మహిళా వ్యతిరేకులుగా వారు ఆరోపించారు. వీరు యూనియన్ ఫ్లాగ్, సెంట్ జార్జ్ క్రాస్ జెండాలను ప్రదర్శించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య గొడవలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులను భారీగా మోహరించారు. పోలీసులు ప్రదర్శకులను చెదరగొట్టేందుకు ప్రయత్నించగా వారు బాటిల్స్, రాళ్లు విసిరారు. దీంతో తోపులాటలు జరిగాయి. ఈ దాడుల్లో 26మంది గాయపడ్డారని, వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకారంగా ఉందని చెబుతున్నారు. అల్లర్లకు పాల్పడ్డ 25 మందిని అరెస్టు చేశామని. మరింతమందిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.


ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల నుంచి వలసలు, శరణార్థుల సంఖ్య పెరిగిపోవడంతో తమ సంస్కృతి దెబ్బతింటోందని, నేరాలు అధికమవుతున్నాయని బ్రిటన్‌లోని జాతీయవాద వర్గాలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయిఈ ప్రదర్శనలకు టామీ రాబిన్సన్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన అసలు పేరు స్టీఫెన్‌ యాక్ల్సీ లెన్నాన్‌. జర్నలిస్టుగా పనిచేస్తున్న రాబిన్సన్ కొంత కాలంగా బ్రిటన్‌లో వలసలు, ఇస్లామీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు‌.. బ్రిటన్ ప్రభుత్వంలోని అవినీతిని బయటపెడతానంటూ పలుమార్లు హెచ్చరించారు. అక్రమ వలసల మీద బ్రిటన్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రాబిన్సన్‌ ఆరోపిస్తున్నారు.


బ్రిటన్‌లో నిర్వహించిన యాంటీ ఇమిగ్రేషన్‌ ర్యాలీకి ప్రపంచ బిలియనీర్‌, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మద్దతు పలికారు. ప్రస్తుత పార్లమెంట్‌ను రద్దుచేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. మితిమీరిన వలసల కారణంగా దేశం విధ్వంసం అంచున ఉన్నట్లు హెచ్చరించారు. ఇప్పుడున్నవి రెండే మార్గాలని తేల్చిచెప్పాలి. పోరాటం చేయాలని, లేదంటే చచ్చిపోయే పరిస్థితి వస్తుందని స్పష్టంచేశారు‘భారీగా, అనియంత్రితంగా వస్తున్న వలసలతో బ్రిటన్ నాశనమవుతోంది. వలసల కారణంగా హింస పెరిగిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే హింస ప్రజలందరి వద్దకు వస్తుంది. ఇ‍ప్పటికైనా ప్రతిఘటించాల్సిందే.. పోరాడాల్సిందే. మన హక్కులు కాపాడుకోవాల్సిందే. పోరాడండి.. లేదంటే చనిపోతారు.. అని వారికి మద్దతు ఇచ్చారు. చివరగా.. బ్రిటన్‌లో ప్రభుత్వ మార్పు జరగాలని నేను అనుకుంటున్నాను’ అని తెలిపారు.. మస్క్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిపోయాయి


ఈ పరిణామాలపై బ్రిటన్‌ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసలదారుల వ్యతిరేక నిరసనలకు బ్రిటన్‌ ఎప్పటికీ తలవంచబోదని స్పష్టంచేశారు. లండన్‌లో జరిగిన హింసను ఖండించారు. జాతీయ జెండాను ముసుగుగా కప్పుకొని హింసాకాండకు పాల్పడ్డారని ఆరోపించారు. అతివాదులకు బ్రిటన్ ఎప్పటికీ లొంగిపోదని ప్రకటించారు. ఎరుపు, తెలుపు ఇంగ్లిష్‌ జెండా దేశ వైవిధ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. చర్మం రంగు లేదా నేపథ్యం ఆధారంగా పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని, వారిని వ్యతిరేకించడాన్ని సహించబోమని స్టార్మర్‌ హెచ్చరించారు. ‘ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంది. అయినప్పటికీ.. రంగు, నేపథ్యం ఆధారంగా పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని సహించబోం. అధికారులపై దాడి చేయడం ద్వారా ఆందోళనకారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరు. సహనం, వైవిధ్యం, గౌరవమనే పునాదులపై బ్రిటన్‌ నిర్మితమైంది’ అని బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ పేర్కొన్నారు.


బ్రిటన్‌కు ప్రధానంగా అక్రమ వలసదారులుసమస్యగా మారారు. 2024 చివరి నాటికి దేశంలో 5,15,697 మంది అధికారిక శరణార్థులు ఉన్నారు. మరో లక్షా 24 వేల మందికి పైగా ఆశ్రయం కోసం చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా దేశంలో నివసిస్తున్న వారి సంఖ్య 10 నుంచి 15 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఈ ఏడాది ఇప్పటివరకు 28,000 మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్‌కు చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బ్రిటన్‌కు వచ్చే వారిలో చాలామంది ఆశ్రయం కోరుతూ వస్తున్నారు. వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానికుల్లో అసంతృప్తి పెరిగింది. వలసదారులు దేశ వనరులను వాడేస్తున్నారని, స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో ఉండగా, అక్రమ వలసదారులు దేశానికి భారంగా మారారని ఆందోళనకారుల వాదన. వలసల వల్ల తమ జాతీయ గుర్తింపు, సాంస్కృతిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయని భావిస్తున్నారు.


ఇటీవల లండన్‌ శివారులో 14 ఏళ్ల బాలిక లైంగిక దాడికి గురైంది. ఇథియోపియా నుంచి వలసవచ్చిన ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు తేలింది. దాంతో వలసదారులకు వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఇమ్మిగ్రెంట్లు తలదాచుకుంటున్న ఇళ్లు, హోటళ్లను జనం ముట్టడించారు. వలసదారుల కారణంగా ఇంగ్లండ్‌ సంస్కృతి నాశనమవుతోందని వీరు మండిపడుతున్నారు. మరోవైపు వలస సమస్య బ్రిటన్ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. బ్రిటన్‌లో అక్రమ వలసలు పెరగడంపై ప్రధాని కీర్‌ స్టార్మర్‌ కూడా గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. వీరిని దేశం నుంచి పంపేస్తామని ప్రకటించారు. ( Keir Starmer on X) వాస్తవానికి ఒకప్పుడు బ్రిటిష్ వారు తమ దేశంలో శ్రామిక శక్తి తక్కువగా ఉండటంతో వలసలను ప్రోత్సహించారు. ముఖ్యంగా తాము పాలించిన దేశాల నుంచి కార్మికులను తెచ్చుకున్నారు. అయితే ఆల్బేనియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇరాన్, సిరియా, ఎరిట్రియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల నుంచి భారీ సంఖ్యలో అక్రమ మార్గాల్లో బ్రిటన్‌లోకి చొరబాట్లు ఎక్కువయ్యాయి. మన దేశం నుంచి కూడా హోటళ్లలో, టాక్సీ డ్రైవర్లుగా పని చేసేందకు పెద్ద సంఖ్యలో బ్రిటన్‌కు వలస వెళుతున్నారు.


తాజా బ్రిటన్‌లో ప్రవాస భారతీయ మహిళపై అత్యాచారంతో పాటు జాత్యహంకార వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఓల్డ్‌బరీ టౌన్‌లో 20 ఏళ్ల బ్రిటన్‌ సిక్కు మహిళపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ‘ ఇక మీ దేశానికి వెళ్లిపో’ అంటూ హెచ్చరించారు. సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్న పోలీసులు.. ఫోరెన్సిక్‌ ఆధారాలు సంపాదించే పనిలో ఉన్నారు. ఈ ఘటన పాల్పడిన ఇద్దరు అనుమానితులను తెల్లవారిగా గర్తించారు. సిక్కు కమ్యూనిటీని టార్గెట్‌ చేసే ఈ దాడులు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. గత నెలలో కొంతమంది సిక్కు యువకుల్ని వేధింపులకు గురి చేసిన ఘటన సైతం ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు ఓ సిక్కు మహిళపై అత్యాచారానికి పాల్పడటం అక్కడ ఉండే సిక్కు మతస్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దీనిపై పోలీస్‌ పెట్రోలింగ్‌ను మరింత పెంచుతామని యూకే పోలీసులు స్థానికులకు భరోసా ఇచ్చారు. ఈ ఘటనను బ్రిటీష్‌ ఎంపీ ప్రీత్‌ కౌర్‌ గిల్‌ తీవ్రంగా ఖండిచారు. ఇటీవల కాలంలో బహిరంగంగానే జాత్యహంకార జాడ్యం విస్తృతమైనట్లు పేర్కొన్నారు. ఇది కచ్చితంగా తీవ్రంగా పరిగణించాల్సిన అంశంగా స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories