Ali Khamenei biography: ఎవరీ ఖమేనీ.. ఎందుకు ఆయన్ని అమెరికా..ఇజ్రాయేల్ లక్ష్యంగా చేసుకున్నాయి?

Ali Khamenei biography: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎవరు?
x

Ali Khamenei biography

Highlights

Ali Khamenei biography: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎవరు? ఆయన రాజకీయ ప్రస్థానం, ఇరాన్ రాజకీయాల్లో ఆయన పాత్ర గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి

Ali Khamenei biography: ఇరాన్ - ఇజ్రాయేల్ మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయేల్ సంయుక్తంగా దాడులు మొదలు పెట్టాయి.. ప్రతిగా ఇరాన్ కూడా దిగింది. మధ్య ప్రాచ్యం అంతా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పరస్పర దాడులతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే, ఆయన మరణాన్ని ఇరాన్ ధ్రువీకరించలేదు. కానీ, కొన్ని ఇరానీ మీడియా వార్తలు మాత్రం ఖమేనీ చనిపోయినట్లు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. అసలు అమెరికా ఇజ్రాయేల్ చెబుతున్నట్టు ఈ దాడులు కేవలం ఇరాన్ అణుకార్యక్రమాలు అడ్డుకోవడానికేనా? అదే అయితే ఎందుకు ఖమేనీని లక్ష్యంగా చేసుకున్నాయి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఇరాన్‌లో తిరుగుబాటును కోరుకుంటున్నారు. అందుకే శనివారం ఇరాన్‌పై దాడి తర్వాత ఖమేనీని టెహ్రాన్ నుండి ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశానికి తరలించారు.

ఖమేనీ, అతని వారసులను హత్య చేయడానికి ట్రంప్‌కు ఒక ప్రణాళికను అందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఖమేనీ హత్య ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని తీసుకువస్తుందని నెతన్యాహు కూడా విశ్వసిస్తున్నారు.

ఆయతుల్లా అలీ ఖమేనీ కథ ఏమిటి? ఆయన ఇరాన్ సుప్రీం లీడర్ ఎలా అయ్యాడు? అమెరికా -ఇజ్రాయెల్ ఎందుకు ఆయన వెంటపడ్డాయి?

ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు.. అసలు ఇజ్రాయేల్ తో ఇరాన్ శత్రుత్వం ఏమిటి అనేది చూద్దాం. నిజానికి, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య శత్రుత్వానికి చాలా పెద్ద కారణాలు ఉన్నాయి...

  • అమెరికా, ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఖమేనీ మత జాతీయవాదాన్ని ఆయుధంగా మార్చాడు. అతను ఇరాక్, సిరియా, లెబనాన్, యెమెన్‌లలో "యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్" అనే మిలిటెంట్ నెట్‌వర్క్‌ను స్థాపించాడు.
  • ఇరాన్ ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించదు. పాలస్తీనాను గట్టిగా సమర్థిస్తుంది. ఆ విధంగా ఖమేనీ హిజ్బుల్లా, హౌతీలు, హమాస్ వంటి మిలిటెంట్ నెట్‌వర్క్‌లను స్థాపించడం ద్వారా ఇజ్రాయెల్‌పై పరోక్ష యుద్ధాన్ని ఖమేనీ ప్రారంభించాడు.
  • ఖమేనీ ఇరాన్ అణు కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు. అమెరికా - ఇజ్రాయెల్‌తో సహా పాశ్చాత్య దేశాలపై ఆయన ఒత్తిడిని కొనసాగించాడు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ తనకు అతిపెద్ద ముప్పుగా భావిస్తుంది.
  • ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఎప్పటికప్పుడు 'షాడో వార్' అంటే తెరవెనుక సైనిక, సైబర్ దాడులు కొనసాగుతున్నాయి.
  • ఇరాన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన షియా దేశం. ఖమేనీ నాయకత్వంలో, మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావం పెరిగింది. అందువల్ల, అతని మరణం మధ్యప్రాచ్య భవిష్యత్తును మార్చడమే కాకుండా ప్రపంచంపై కూడా ప్రభావం చూపుతుంది.

అసలెవరీ ఖమేనీ..

Ali Khamenei biography: ఇరాన్‌లోని అతిపెద్ద మతపరమైన నగరమైన మష్హాద్‌లో. ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ.. ఒక మతాధికారి సయ్యద్ జావద్ ఖమేనీకి ఏప్రిల్ 19, 1939న, జన్మించాడు. అతను ఎనిమిది మంది తోబుట్టువులలో రెండవవాడు. నాలుగు సంవత్సరాల వయస్సులో, ఖమేనీని ఒక సెమినరీకి పంపారు. అక్కడ అతను ఖురాన్, అరబిక్ మరియు ఇస్లామిక్ విద్యను నేర్చుకున్నాడు.

ఖమేనీ ఆత్మకథలో రాసుకున్న దాని ప్రకారం ఆయన ఇంగ్లీష్, మాథ్స్ లో చాలా చురుకుగా ఉండేవాడు. అయితే, స్కూల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఖురాన్ నుంచి శ్లోకాలను అద్భుతంగా ఆయన చెప్పారు. స్కూల్ అంతా ఆయన్ని అభినందనలతో ముంచెత్తింది. దీంతో ఖమేనీ తన తండ్రిలా మతాధికారి కావాలని నిర్ణయించుకున్నాడు. దీని తరువాత అతను ఇరాన్‌లోని కోమ్ నగరానికి వెళ్లి, అయతుల్లా రుహోల్లా ఖొమేని నుండి శిక్షణ పొందాడు. 11 సంవత్సరాల వయస్సులో మౌల్వి అయ్యాడు.

Ali Khamenei biography: ఇరాన్ అప్పట్లో చాలా మోడరన్ కంట్రీ. అప్పుడు షా మొహమ్మద్ రెజా పహ్లావి ఇరాన్ ను పాలించేవాడు. మోడలింగ్, సినిమాలు, నైట్‌క్లబ్ పార్టీలు, పాశ్చాత్య దుస్తులు ధరించడం చాలా ఆధునికంగా ఆ దేశం ఉండేది. అయితే, ఖమేనీ చిన్నతనంలో మతాధికార దుస్తులు ధరించి వీధిలో ఆడుకునేవాడు. అతని డ్రెస్ ను చూసి ప్రజలు ఎగతాళి చేశేవారు. ఇది ఖమేనీలో మతంపై మరింత శ్రద్ధ పెరిగేలా చేసింది.

మొహర్రం రోజుల్లో సినిమాలు.. ఖమేనీ రాజకీయ అడుగులు..

ఇరాన్ లో 1950 సమయంలో మొహర్రం నెలలో అన్ని సినిమా హాళ్లు మూసి ఉంచే నియమం ఉండేది. కానీ, 1955లో ఆ నిషేధం ఎత్తివేశారు. దీంతో పెద్ద అలజడి రేగింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం నిర్వహించారు ఖమేనీ. అలా రాజకీయాల వైపు ఖమేనీ మళ్ళారు.

ఇరానియన్ మతాధికారి రుహోల్లా ఖమేనీచే తీవ్రంగా ప్రభావితుడయినా ఖమేనీ మతాన్ని.. రాజకీయాన్ని వేరు చేయలేమని బలంగా నమ్మరు. అప్పటి ఖమేనీ ఇరాన్ పాలకుడి విధానాలను-పాశ్చాత్య దేశాల మాదిరిగా ఇరాన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించిన 1963 "శ్వేత విప్లవం"ను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇది ఇస్లాం-ఇరానియన్ సంస్కృతికి విరుద్ధమని ఖమేనీ నమ్మాడు. దేశంలో విలాయత్-ఎ-ఫకీహ్ (ఇస్లామిక్ మతాధికారుల పాలన) స్థాపన జరగాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు.

Ali Khamenei biography: దీంతో ఖొమేని.. చక్రవర్తి షాను బహిరంగంగా వ్యతిరేకించడం ప్రారంభించాడు. మషద్‌తో సహా అనేక నగరాల్లో తన మతగురువు ఖొమేని సందేశాన్ని వ్యాప్తి చేయడంలో సహాయపడ్డాడు. దీంతో ఖమేనీని అరెస్ట్ చేశారు. ఇది అప్పట్లో యువతలో ఇరాన్ పాలకులపై జారుతున్న వ్యతిరేక ఉద్యమం ఉధృతంగా మారేలా చేసింది. ఈ క్రమంలో 1970 సంవత్సరం వచ్చేసరికి ఖమేనీ రాజకీయ నిపుణిడిగా మారాడు. అతని గురువు ఖమేనీ ని బహిష్కరించడంతో ప్రజల్లో తన ప్రసంగాల ద్వారా ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం ప్రజల్లో ఉత్తేజం కలిగించాడు.

1979లో, ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం జరిగింది. షా ప్రభుత్వం పడిపోయింది. ఈ సమయంలో ఖమేనీ గురువు ఖమేనీ పారిస్ నుంచి ఇరాన్ తిరిగి వచ్చారు. అతను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, తన సన్నిహితులను ఉన్నత పదవుల్లో నియమించాడు. కొత్త ప్రభుత్వానికి మెరుగైన పరిపాలనకు ఆధారంగా పనిచేసిన విప్లవ మండలిలో తన శిష్యుడు ఖమెనీని చేర్చాడు.

తరువాత ఇరాన్ అధ్యక్షుడు అయిన హసన్ రౌహానీ, ఖమేనీని డిప్యూటీ రక్షణ మంత్రిగా నియమించాలని పార్లమెంటులో ప్రతిపాదించాడు. దీంతో, ఖమేనీని డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్‌గా నియమించారు.

IRGC ఏర్పాటు..

Ali Khamenei biography: ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు. తరువాత IRGC ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన సైన్యంగా మారింది. మతపరమైన, రాజకీయ, ఆర్థిక రంగాలలో దేశం కోసం పోరాడగల సైన్యాన్ని సృష్టించడం IRGCని సృష్టించడం ఉద్దేశ్యం. ఇది ఇస్లామిక్ దేశమైన ఇరాన్‌కు బయట నుంచి వచ్చే ప్రమాదాలనే కాకుండా దేశంలోని అంతర్గత సమస్యలను కూడా పరిష్కరించగలదు.

ఖమేనీపై హత్యా యత్నం..

ఇరాన్ - ఇరాక్ 1980ల్లో యుద్ధంలో ఉన్నాయి. టెహ్రాన్‌లో జూన్ 27, 1981న, ఖమేనీ షెడ్యూల్ ప్రకారం టెహ్రాన్‌లోని అబుజార్ మసీదుకు వెళ్లాడు. ఆ తర్వాత అతను జనం ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ప్రారంభించాడు. ఈ సమయంలో ఒక వ్యక్తి టేప్ రికార్డర్‌ను టేబుల్ మీద ఉంచాడు. ఒక్క నిమిషంలో టేప్ రికార్డర్ నుండి ఈల శబ్దం వచ్చింది. వెంటనే పెద్ద పేలుడు సంభవించింది. ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. ఇరానియన్ మిలిటెంట్ ప్రతిపక్ష సంస్థ ఫోర్కాన్ గ్రూప్ ఈ దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఖమేనీ కుడి చేయి, స్వర పేటిక, ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా నెలల తర్వాత అతను కోలుకున్నాడు, కానీ అతని కుడి చేయి శాశ్వతంగా పక్షవాతానికి గురైంది. అతని ఒక చెవిలో వినికిడి శక్తి పోయింది.

దేశవ్యాప్తంగా అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 2, 1981న జరిగాయి ఖమేనీ 95% ఓట్లతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి ఇరాన్ మూడవ అధ్యక్షుడయ్యాడు.

రాజ్యాంగ సవరణ . .

Ali Khamenei biography: 1985లో, నాయకుడు అయతుల్లా రుహోల్లా ఖొమేనీ హుస్సేన్ అలీ మోంటజేరిని తన వారసుడిగా ప్రకటించారు. అయితే, కొన్ని అసంతృప్తికరమైన పరిస్థితుల కారణంగా ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే, జూన్ 3, 1989న రుహోల్లా ఖొమేనీ మరణించారు. దీంతో తదుపరి నాయకుడి గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. నాయకత్వ మండలికి "షురే-ఎ-రహబరి"ని ఏర్పాటు చేయడానికి లేదా నాయకత్వాన్ని ఒకే వ్యక్తికి అప్పగించడానికి ప్రతిపాదనలు చేశారు. ఈ క్రమంలో గ్రాండ్ అయతుల్లా మొహమ్మద్-రెజా గోల్పాయెగానీ - అలీ ఖమేనీ ఈ పదవికి నామినేషన్ వేశారు. ఓటింగ్ లో ఖమేనీకి 60 ఓట్లు రాగా, గోల్పాయెగానీకి 14 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఖమేనీకి తిరుగులేకుండా పోయింది.

కానీ, రెహ్‌బార్ కావాలంటే, ఒక వ్యక్తి మార్జా లేదా ఆయతుల్లా అయి ఉండాలి. ఈ పరిమితిని తొలగించడానికి ఇరాన్ రాజ్యాంగాన్ని సవరించారు. ఆగస్టు 6, 1989న, నిపుణుల సభ మళ్ళీ సమావేశమై ఓటింగ్ నిర్వహించింది. ఖమేనీ 64 ఓట్లలో 60 ఓట్లను పొందారు. దీంతో ఖమేనీ పూర్తిస్థాయిలో ఇరాన్ సుప్రీం అయిపోయాడు.

Ali Khamenei biography: దేశంలో ప్రతిపక్షాలను అణిచివేయడం నుండి జర్నలిస్టులను వేధించడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, మహిళా స్వేచ్ఛను అంతం చేయడం వరకు ఇరాన్ లో అలీ ఖమేనీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇరాన్ సుప్రీం కమాండర్ గా ఇస్లాం ను కచ్చితంగా అమలు చేసే నాయకుడిగా చాలా కఠినంగా ఖమేనీ వ్యవహరించినట్లు చెబుతారు.

చిన్న స్థాయి మతాధికారిగా మొదలైన అలీ ఖమానీ జీవితం.. రాత్రికి రాత్రే ఇరాన్ లాంటి దేశానికి సుప్రీంగా మారిపోవడం వరకూ వెళ్ళింది. తరువాత 35 ఏళ్లుగా ఇరాన్ కు తిరుగులేని నాయకుడిగా అలీ ఖమానీ ఉన్నారు.

ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆయన అమెరికా-ఇజ్రాయేల్ దాడుల్లో మరణించారు. ఈ వార్త ఇంకా పూర్తిగా ధ్రువీకరణ కాలేదు. కానీ, అదే జరిగితే ఇరాన్ లో తదుపరి పరిస్థితులు ఎలా ఉంటాయి? అనేదానిపై ప్రపంచ వ్యక్తంగా ఒక విధంగా ఆసక్తి.. మరో విధంగా ఆందోళన వ్యక్తం అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories