
Brain Stroke Symptoms : యువతపై బ్రెయిన్ స్ట్రోక్ పంజా.. దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు యువకుడే!
Brain Stroke Symptoms :జీవనశైలిలో మార్పులే కారణమా?.. స్ట్రోక్ హెచ్చరిక సంకేతాలు గుర్తించకపోతే ప్రాణాపాయం!
ఈ రోజుల్లో చాలా మందిని వెంటాడుతున్న సమస్య.. బ్రెయిన్ స్ట్రోక్. ఒకప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అంటే కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధి అనుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. భారతదేశంలో స్ట్రోక్ బారిన పడుతున్న వారిలో 45 ఏళ్ల లోపు వారే 13.8 శాతం (ప్రతి ఏడుగురిలో ఒకరు) ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ నిర్వహించిన తాజా పరిశోధనలో వెల్లడైంది. పరిశోధనలో వెల్లడైన ముఖ్యమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పరిశోధన డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా 30 ఆసుపత్రులలో సుమారు 35,000 కేసులను విశ్లేషించగా.. స్ట్రోక్ బారిన పడుతున్న యువతలో 60 శాతానికి పైగా పురుషులే ఉంటున్నారని వెల్లడైంది. 40 శాతం మందికి మాత్రమే స్ట్రోక్ వచ్చిన 24 గంటల్లోపు వైద్యం అందుతోంది. చికిత్స ఆలస్యం కావడం వల్ల సుమారు 30 శాతం మరణాలు సంభవిస్తున్నాయి.
చిన్న వయసులోనే ఎందుకు వస్తోందంటే..
స్ట్రోక్ బాధితుల్లో 75 శాతం మంది హైబీపీతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ప్రాథమిక కారణం అని చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం, స్మోకింగ్ వంటివి కూడా స్ట్రోక్‌కు కారణం అవుతుందని అంటున్నారు. స్ట్రోక్ వచ్చిన వారిలో 27 శాతం మందికి డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించారు.
స్ట్రోక్ లక్షణాలను ఇలా గుర్తించండి..
బ్రెయిన్ స్ట్రోక్‌ను ప్రారంభంలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
* శరీరంలో ఒక భాగం (చెయ్యి లేదా కాలు) అకస్మాత్తుగా బలహీనపడటం.
* ముఖం ఒక వైపుకు వంగిపోయినట్లు అనిపించడం.
* మాట్లాడటంలో ఇబ్బంది కలగడం లేదా మాట తడబడటం.
* ఏ కారణం లేకుండానే అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం.
దీనిని నివారించడానికి కనీసం ప్రతి 6-8 నెలలకు ఒకసారి బీపీని తనిఖీ చేసుకోండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం అలవాటు చేసుకోండి. స్మోకింగ్‌కు దూరంగా ఉండండి. ఉప్పు వాడకాన్ని తగ్గించండి, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి నిమిషం విలువైనదే. లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి మాత్రమే మన మెదడును రక్షించగలదని, బ్రెయిన్ స్టోక్ నుంచి మనల్ని దూరంగా ఉంచగలదని చెప్పారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




