Skin Cancer : శరీరంలోని పుట్టుమచ్చలు క్యాన్సర్‌కు కారణమవుతాయా? నిపుణులు ఏమన్నారంటే

Skin Cancer : శరీరంలోని పుట్టుమచ్చలు క్యాన్సర్‌కు కారణమవుతాయా? నిపుణులు ఏమన్నారంటే
x

 Skin Cancer : శరీరంలోని పుట్టుమచ్చలు క్యాన్సర్‌కు కారణమవుతాయా? నిపుణులు ఏమన్నారంటే

Highlights

ఒకప్పుడు బుగ్గలపై లేదా పెదవులపై పుట్టుమచ్చలు ఉంటే అదో ఫ్యాషన్. పుట్టుకతోనే లేదా చిన్నతనంలో శరీరంలోని వివిధ భాగాల్లో మచ్చలు రావడం చాలా సాధారణం.

Skin Cancer : ఒకప్పుడు బుగ్గలపై లేదా పెదవులపై పుట్టుమచ్చలు ఉంటే అదో ఫ్యాషన్. పుట్టుకతోనే లేదా చిన్నతనంలో శరీరంలోని వివిధ భాగాల్లో మచ్చలు రావడం చాలా సాధారణం. అయితే, ఈ మచ్చలు కాలక్రమేణా ఆకారం, పరిమాణంలో మారవచ్చు. సాధారణంగా ఈ మచ్చలు ప్రమాదకరం కానప్పటికీ, కొన్ని రకాల మచ్చలు మాత్రం చర్మ క్యాన్సర్‎కు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది ప్రజలు చర్మం, ముఖ్యంగా మచ్చల గురించి అంతగా పట్టించుకోకపోవడం వల్ల ఇటీవల చర్మ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. అందుకే మీ శరీరంలో ఉన్న పుట్టుమచ్చలను ఎప్పుడు విస్మరించకూడదో, అవి క్యాన్సర్‌కు ఎలా దారితీస్తాయో, దానిని నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుట్టుమచ్చలు సర్వసాధారణం అయినప్పటికీ, అవి క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది. సాధారణ కణాలు మారినప్పుడు, వాటి DNA దెబ్బతిన్నప్పుడు అవి అనియంత్రితంగా పెరగడం ప్రారంభించినప్పుడు చర్మ క్యాన్సర్ మొదలవుతుంది. సాధారణంగా ప్రతి మనిషి శరీరంలో 10 నుంచి 45 వరకు పుట్టుమచ్చలు ఉంటాయి. కౌమారదశలో, గర్భధారణ సమయంలో మహిళల్లో ఇవి కొంచెం ముదురు రంగులోకి మారవచ్చు లేదా పెద్దవి కావచ్చు.

మచ్చలలో కొన్ని ప్రత్యేక మార్పులు కనిపించినప్పుడు వాటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఉన్న పుట్టుమచ్చ పరిమాణం, ఆకారం లేదా రంగులో మార్పు వచ్చినప్పుడు, లేదా మచ్చ నుంచి దురద, రక్తస్రావం లేదా వాపు కనిపించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పుట్టుమచ్చ 6 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ పెద్దదిగా ఉన్నా కూడా వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఎవరి శరీరంలో అయితే 50 కంటే ఎక్కువ మచ్చలు ఉంటాయో, అది ప్రారంభ మెలనోమా ప్రమాదానికి సంకేతం కావచ్చు.

ముఖ్యమైన రకాలను, వాటి లక్షణాలను డాక్టర్లు వివరించారు.

బేసల్ సెల్ కార్సినోమా: ఇది అత్యంత సాధారణమైన చర్మ క్యాన్సర్ రకం. ఇది ఉబ్బెత్తుగా లేదా గులాబీ రంగులో ఉన్న ప్యాచ్‌గా కనిపిస్తుంది.

స్క్వామస్ సెల్ కార్సినోమా : ఇది సాధారణంగా ఎర్రగా ఉబ్బినట్లుగా లేదా చిన్న పుండు రూపంలో కనిపిస్తుంది.

మెలనోమా : ఇది చాలా అరుదుగా కనిపించినప్పటికీ, అత్యంత ప్రమాదకరమైన రకం. ఇది సాధారణంగా పుట్టుమచ్చ రూపంలో మొదలవుతుంది. ఈ క్యాన్సర్ ఒకసారి శరీరమంతా వ్యాపిస్తే చికిత్స చేయడం చాలా కష్టం.

చర్మ క్యాన్సర్‌ను నివారించే మార్గాలు

చర్మ క్యాన్సర్లలో చాలా వరకు ముందుగా గుర్తించినట్లయితే సులభంగా చికిత్స చేయవచ్చు. నివారణకు ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. సూర్యరశ్మిలోని UV కిరణాలకు గురికావడాన్ని తగ్గించాలి. ముఖ్యంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నీడలో ఉండటానికి ప్రయత్నించండి. UV కిరణాలను అడ్డుకునే పొడవాటి చేతుల బట్టలు, సన్‌గ్లాసెస్‌ ధరించాలి. ప్రతిరోజూ SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను ఉపయోగించండి. ప్రతి రెండు గంటలకు ఒకసారి మళ్లీ అప్లై చేయడం మర్చిపోవద్దు. మీ చర్మాన్ని క్రమం తప్పకుండా మీరే చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా మీ తల, వీపు, కాలి వేళ్ల మధ్య ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories