Health Tips: తిన్న వెంటనే నిద్ర వస్తుందా? అసలు కారణం ఇదే!

Health Tips: తిన్న వెంటనే నిద్ర వస్తుందా? అసలు కారణం ఇదే!
x
Highlights

Health Tips: తిన్న తర్వాత నిద్ర రావడం లేదా ఒళ్లు బరువుగా అనిపించడం అనేది మనలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య.

Health Tips: తిన్న తర్వాత నిద్ర రావడం లేదా ఒళ్లు బరువుగా అనిపించడం అనేది మనలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. దీనిని వైద్యనిపుణులు 'ఫుడ్ కోమా' అని పిలుస్తారు. అయితే దీనిని కేవలం సోమరితనంగానో లేదా బలహీనతగానో భావించకూడదని చెబుతున్నారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు, మన శరీర జీవక్రియల పనితీరు దాగి ఉందని అంటున్నారు. అసలు తిన్న తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తిన్న తర్వాత నిద్ర రావడానికి ప్రధాన కారణాలు

* జీర్ణక్రియ & రక్త ప్రసరణ: మనం ఆహారం తీసుకున్నప్పుడు, దానిని జీర్ణం చేయడానికి మన శరీరానికి చాలా శక్తి అవసరమవుతుంది. ఈ ప్రక్రియ కోసం మన శరీరంలోని రక్త ప్రసరణ అధిక భాగం జీర్ణవ్యవస్థ వైపు మళ్లుతుంది. దీనివల్ల మెదడుకు అందే రక్త ప్రసరణలో స్వల్ప మార్పులు జరిగి, మనకు నిద్ర వచ్చినట్లు లేదా నీరసంగా అనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

* హార్మోన్ల ప్రభావం: ఆహారం తిన్న తర్వాత శరీరంలో సెరోటోనిన్ (Serotonin), మెలటోనిన్ (Melatonin) వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మన మనస్సును ప్రశాంతపరిచి, శరీరం విశ్రాంతి తీసుకోవాలని సంకేతాలను ఇస్తాయి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఈ హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

* అధిక చక్కెర & కార్బోహైడ్రేట్లు: అన్నం, బంగాళాదుంపలు, మైదాతో చేసిన పదార్థాలు, తీపి వస్తువులలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి, అంతే వేగంగా పడిపోతాయి. ఈ 'షుగర్ క్రాష్' (Sugar Crash) కారణంగా అకస్మాత్తుగా అలసట ఆవహిస్తుందని పేర్కొన్నారు.

* నూనె పదార్థాలు: ఎక్కువగా వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్ లేదా కొవ్వు అధికంగా ఉండే భోజనం జీర్ణం కావడానికి శరీరం కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల శరీరం తన పూర్తి శక్తిని జీర్ణక్రియకే వాడటంతో మనం త్వరగా అలసిపోయి నిద్రలోకి జారుకుంటామని చెబుతున్నారు.

* సరైన నిద్ర లేకపోవడం: రాత్రిపూట సరిగ్గా 7 నుంచి 8 గంటల నిద్ర లేని వారికి, పగటిపూట భోజనం చేసిన వెంటనే నిద్ర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరం ఇప్పటికే అలసటలో ఉండటం వల్ల, భోజనం అందించే రిలాక్సేషన్ తో నిద్ర మరింత పెరుగుతుందని వైద్య నిపుణులు వెల్లడించారు.

నిద్ర రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి..

* ఒకేసారి కడుపు నిండా తినకుండా, తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినండి.

* శరీరం హైడ్రేటెడ్ గా ఉంటే అలసట తగ్గుతుంది.

* భోజనం తర్వాత 5-10 నిమిషాలు నెమ్మదిగా నడవడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.

* ఆహారంలో కేవలం పిండి పదార్థాలే కాకుండా, పప్పుధాన్యాలు, కూరగాయలు ఉండేలా చూసుకోండి.

తిన్న తర్వాత నిద్ర రావడం అనేది శరీర సహజ ప్రక్రియే అయినప్పటికీ, అది ప్రతిరోజూ మీ పనిని ప్రభావితం చేస్తుంటే మాత్రం మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories