Rayudu Gari Taluka Review: మిస్టరీ మర్డర్స్.. కూతురిపై మమకారం.. 'రాయుడు గారి తాలూకా' ఎలా ఉందంటే?

Rayudu Gari Taluka Review: ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా నటించిన రెండవ చిత్రం “రాయుడు గారి తాలూకా” మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Arun Chilukuri
Updated on: 6 March 2026 10:38 PM IST
Rayudu Gari Taluka Review: మిస్టరీ మర్డర్స్.. కూతురిపై మమకారం.. రాయుడు గారి తాలూకా ఎలా ఉందంటే?
X

Rayudu Gari Taluka Review: మిస్టరీ మర్డర్స్.. కూతురిపై మమకారం.. 'రాయుడు గారి తాలూకా' ఎలా ఉందంటే?

Rayudu Gari Taluka Review: ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా నటించిన రెండవ చిత్రం “రాయుడు గారి తాలూకా” మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సత్య ఈషా హీరోయిన్‌గా నటించగా, సీనియర్ హీరో సుమన్, కిట్టయ్య, ఆర్‌కే నాయుడు, ఉలిశెట్టి నాగరాజు, కరణం శ్రీహరి, సృజనక్షిత తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

కథ

ఒక గ్రామానికి పెద్దగా ఉన్న వ్యక్తి రాయుడు. రాయుడు పేరు వినగానే కొందరికి భయం, మరికొందరికి గౌరవం. అయితే అతని వ్యక్తిత్వం వెనుక ఒక రహస్యమైన కోణం ఉంటుంది. రాయుడికి తన కూతురు అంటే ప్రాణం. ఆమెను పట్టణంలో చదివిస్తుంటాడు. ఇదే సమయంలో రాయుడు గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో వయసుకు వచ్చిన యువకులు వరుసగా చనిపోతుంటారు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. ఒక రోజు పోలీసుల ద్వారా రాయుడికి కొన్ని నిజాలు బయటపడతాయి. అసలు గ్రామంలో ఏం జరుగుతోంది? యువకులు ఎందుకు చనిపోతున్నారు? రాయుడు ఎందుకు చీకటి గదిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఈ సినిమా యొక్క ప్రధాన బలం కథ. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆసక్తిగా కట్టిపడేస్తాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉంది.

మొదటి భాగం కథలోకి వెళ్లడానికి కొంత సమయం తీసుకుంటుంది. అయితే ప్రేమ కథతో పాటు వచ్చే ఒక మంచి పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తరువాత కొంత నెమ్మదించిన కథ విరామం దగ్గర వచ్చే ట్విస్ట్‌తో మళ్లీ ఊపందుకుంటుంది.

రెండవ భాగం మొదటి భాగం కంటే మరింత ఆసక్తికరంగా సాగుతుంది. మధ్యలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు భావోద్వేగంగా ఉంటాయి. ముఖ్యంగా కూతురు చనిపోయే సన్నివేశానికి సంబంధించిన పాట ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది.

ఫైట్స్ ఇంకొంచెం బాగా ఉండాల్సిన అవసరం ఉంది. పాటలు బాగున్నప్పటికీ చిత్రీకరణపై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది.

నటీనటుల ప్రదర్శన

రాయుడు పాత్రలో ఉలిశెట్టి శ్రీనివాస్ ఎంతో నిబద్ధతతో నటించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రెండు విభిన్న కోణాల్లో కనిపించిన ఆయన పాత్రకు మంచి న్యాయం చేశారు. కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ నటించిన శ్రీనివాస్‌కు మంచి మార్కులు పడతాయి.

హీరోయిన్ సత్య ఈషా తన నటనతో ఆకట్టుకుంది. రెండు పాత్రల్లో ఆమె చక్కగా ఇమిడిపోయింది. రాయుడు కూతురు పాత్రలో నటించిన అమ్మాయి కూడా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె భావోద్వేగ నటన ప్రత్యేకంగా నిలిచింది. మిగతా నటీనటులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం

ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. సన్నివేశాలు వేగంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ మంచి విజువల్స్ అందించింది, అయితే ఇంకా మెరుగుపరచుకునే అవకాశం ఉంది. సంగీతం ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్. కథ తరువాత ఎక్కువగా గుర్తుండిపోయే అంశం మ్యూజిక్ అని చెప్పొచ్చు.

దర్శకుడు

దర్శకుడు కథను అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లిన విధానం ఆకట్టుకుంటుంది. కొత్త నటీనటులతో కూడా సినిమాను ఆసక్తికరంగా నడిపించారు. మొదటి భాగంపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా మరింత బలంగా ఉండేది. అయినప్పటికీ తొలి చిత్రంతోనే మంచి ప్రయత్నం చేశారని చెప్పాలి.

బాటమ్ లైన్

కథ, ట్విస్టులు, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ ఎంటర్‌టైనర్ “రాయుడు గారి తాలూకా.”

రేటింగ్: 2.7/5

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story