Arjun Chakravarthy Movie Review: అర్జున్ చక్రవర్తి రివ్యూ.. నిజ జీవిత కథతో ఆకట్టుకున్న కబడ్డీ స్పోర్ట్స్ డ్రామా!

Arjun Chakravarthy Movie Review: అర్జున్ చక్రవర్తి రివ్యూ.. నిజ జీవిత కథతో ఆకట్టుకున్న కబడ్డీ స్పోర్ట్స్ డ్రామా!
x
Highlights

Arjun Chakravarthy Movie Review: విక్రాంత్ రుద్ర డైరెక్షన్లో విజయ్ రామరాజు ప్రధాన పాత్రలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం అర్జున్ చక్రవర్తి ఈరోజు...

Arjun Chakravarthy Movie Review: విక్రాంత్ రుద్ర డైరెక్షన్లో విజయ్ రామరాజు ప్రధాన పాత్రలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం అర్జున్ చక్రవర్తి ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదల కంటే ముందే పలు అంతర్జాతీయ వేదికల్లో అవార్డులు గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ

అర్జున్ చక్రవర్తి సినిమా 1980-90ల మధ్య కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా. కబడ్డీ అంటే ప్రాణం పెట్టే ఒక యువకుడు అర్జున్ (విజయ్ రామరాజు). తన గురువు, మాజీ కబడ్డీ క్రీడాకారుడు రంగయ్య (ద్యానంద్‌ రెడ్డి) ప్రోత్సాహంతో అతను జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా ఎదగాలని కలలు కంటాడు. అయితే, అతని జీవితంలో ఊహించని మలుపులు వస్తాయి. ఈ క్రమంలో దేవిక (సిజా రోజ్)తో ప్రేమలో పడటం, అలాగే కబడ్డీ కోచ్ కులకర్ణి (అజయ్)తో అతనికున్న సంబంధం, రంగయ్య జీవితం, చివరకు అర్జున్ కబడ్డీకి దూరమవ్వడానికి గల కారణాలు వంటి వాటితో ఈ సినిమా కథ నడుస్తుంది.

నటీనటుల పర్ఫామెన్స్

అర్జున్ పాత్రలో విజయ్ రామరాజు అద్భుతంగా ఒదిగిపోయారు. పాత్ర కోసం ఆయన చూపించిన అంకితభావం, ముఖ్యంగా అతని శారీరక మార్పులు ఆకట్టుకుంటాయి. నటనలో కూడా విజయ్ పరిణితి చూపించారు. రంగయ్య పాత్రలో ద్యానంద్‌ రెడ్డి నటన ప్రశంసనీయం. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా బలంగా ఉంది. తాగుడుకు బానిసైన ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా మళ్లీ గెలుచుకుంటాడు అనే అంశం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో సంభాషణలు కూడా చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్

నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు బాగుంది. 1980-90ల్లో కబడ్డీ క్రీడకు ఎంత గుర్తింపు ఉండేది, అప్పటి పరిస్థితుల్లో ఆటగాళ్లు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు వంటి అంశాలను చాలా బాగా చూపించారు. అనాథగా ఉండి జాతీయ స్థాయి క్రీడాకారుడిగా మారడానికి అతను పడిన అవమానాలను కూడా ఎమోషనల్‌గా చూపించారు. అర్జున్ చక్రవర్తి పాత్రలో విజయ్ రామరాజు అద్భుతంగా నటించారు. కథకు తగ్గట్టుగా తన శరీరంలో చేసిన మార్పులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ కూడా కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి మరో ముఖ్యమైన బలం సంభాషణలు. ఇందులో కొన్ని సంభాషణలు చాలా బాగున్నాయి. అజయ్ కోచ్ పాత్రలో బాగా నటించారు. సినిమా సన్నివేశాలకు తగ్గట్టుగా వచ్చిన నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరింది.

మైనస్ పాయింట్స్:

స్పోర్ట్స్ డ్రామాలో భావోద్వేగాలు ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లే నెమ్మదిగా సాగడం ప్రధాన లోపం. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. ముఖ్యంగా, మొదటి అర్ధభాగంలో హీరో ఆటపై చూపించే శ్రద్ధ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వదు. ప్రేమకథ చాలా సాధారణంగా, రొటీన్‌గా ఉంటుంది. ఇది సినిమాకు పెద్దగా సహాయపడలేదు. సిజా రోజ్, అజయ్ వంటి నటుల పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేదనే భావన కలుగుతుంది. పాటలు కూడా అంతగా ఆకట్టుకోలేదు.

టెక్నికల్ అంశాలు

దర్శకత్వం: విక్రంత్ రుద్ర ఒక మంచి కథను ఎంచుకున్నప్పటికీ, స్క్రీన్‌ప్లేలో మరింత శ్రద్ధ వహించి ఉండాల్సింది.

సినిమాటోగ్రఫీ: 1980-90ల నాటి వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. ఇది సినిమాకు గొప్ప బలం.

సంగీతం: పాటలు అంతగా ప్రభావం చూపకపోయినా, నేపథ్య సంగీతం బాగా ఉంది.

ఎడిటింగ్: కొన్ని సన్నివేశాలను తొలగించి ఉంటే సినిమా ఇంకా పదునుగా ఉండేది.

ఫైనల్ గా

మొత్తం మీద, 'అర్జున్ చక్రవర్తి' ఒక రొటీన్ స్పోర్ట్స్ డ్రామాగా ఉన్నప్పటికీ, విజయ్ రామరాజు నటన, కథలోని నిజాయితీ కారణంగా కొంతమేర ఆకట్టుకుంటుంది. బలమైన కథ, నటన, భావోద్వేగాలు ఉన్నప్పటికీ, బలహీనమైన స్క్రీన్‌ప్లే, ఆకట్టుకోని లవ్ ట్రాక్ సినిమాకు ప్రతికూలంగా మారాయి. స్పోర్ట్స్ డ్రామా సినిమాలు ఇష్టపడేవారు ఒకసారి ఈ చిత్రాన్ని చూడవచ్చు.

చిత్రం పేరు: అర్జున్ చక్రవర్తి

విడుదల తేదీ: ఆగస్టు 29, 2025

దర్శకుడు: విక్రంత్ రుద్ర

నటీనటులు: విజయ్ రామరాజు, సిజా రోజ్, ద్యానంద్‌ రెడ్డి, అజయ్, తదితరులు.

రేటింగ్: 3.25/5

Show Full Article
Print Article
Next Story
More Stories