
చిరంజీవి వ్యాఖ్యలకు ప్రముఖ నిర్మాత కౌంటర్.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ..
మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు.. సింగర్ చిన్మయి కౌంటర్.. ఇప్పుడు సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ విశ్లేషణ.
మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు.. సింగర్ చిన్మయి కౌంటర్.. ఇప్పుడు సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ విశ్లేషణ. టాలీవుడ్లో ఇప్పుడు 'క్యాస్టింగ్ కౌచ్' మంటలు మళ్ళీ రాజుకున్నాయి. 'మన శంకర వరప్రసాద్ గారు' బ్లాక్ బస్టర్ మీట్లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చకే దారితీశాయి. టాలీవుడ్ అంటే ఒక అద్దం లాంటిదని, ఇక్కడ అంతా పారదర్శకంగా ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో యుద్ధానికి దారితీశాయి. ఇండస్ట్రీలో ఆడవారికి రక్షణ లేదని, వేధింపులు నిజమని చిన్మయి వంటి వారు గళమెత్తగా, తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ విషయంలో వాస్తవాలను బయటపెట్టారు.
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని ఎవరైనా చెబితే అది అబద్ధమే అవుతుందని తమ్మారెడ్డి స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వంద శాతం ఉంది. అంటే అందరూ అలా చేస్తారని కాదు, కానీ ఆ వ్యవస్థ ఉందనేది మాత్రం నిజం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాదికి 200 సినిమాలు వస్తే, అందులో కనీసం 40 సినిమాలు కేవలం 'కమిట్మెంట్' లేదా 'క్యాస్టింగ్ కౌచ్' ఆధారంగానే రూపొందుతున్నాయని ఆయన విశ్లేషించారు.పూర్వం రాజులు, జమీందారులు తమకు కావాల్సిన వారి కోసమే సినిమాలు తీసేవారని, ఆ ఛాయలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. పెద్ద హీరోలు, దర్శకుల్లో ఈ శాతం తక్కువగా (1 శాతం) ఉండొచ్చు కానీ, అసలు లేదనడం మాత్రం కష్టమని అభిప్రాయపడ్డారు.
ఈ పోరాటంలో సింగర్ చిన్మయిని తమ్మారెడ్డి ఆకాశానికెత్తారు. చిన్మయిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆమెను బ్యాన్ చేసినా, భయపెట్టినా లొంగకుండా తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఎవరికీ వంగకుండా నిలబడే ధైర్యం ఆమె సొంతం అని ప్రశంసించారు.చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తమ్మారెడ్డి సమర్థిస్తూనే, అందులోని లోటుపాట్లను ఎత్తిచూపారు. ఇండస్ట్రీ సేఫ్ అని, ఇక్కడ 'నో అంటే నో' అని చిరంజీవి చెప్పి ఉండవచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండాలని ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ, ఒక మహిళ వద్దన్నా వినకుండా వేధిస్తే మాత్రం అది క్షమించరాని నేరం. అలాంటి వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
కేవలం ఆరోపణలు చేసుకోవడమే కాకుండా, ఇండస్ట్రీలో ఉన్న ఇటువంటి చీకటి కోణాలను అరికట్టేందుకు అందరూ కలిసి రావాలని తమ్మారెడ్డి పిలుపునిచ్చారు. టాలెంట్ ఉన్న వారిని ఎవరూ ఆపలేరని, నిజాయితీగా ఉంటే మొదట్లో కష్టాలు ఎదురైనా భవిష్యత్తు బాగుంటుందని కొత్తగా వచ్చే వారికి ధైర్యం చెప్పారు. గ్లామర్ ప్రపంచం వెనుక ఉన్న చేదు నిజాలను తమ్మారెడ్డి ఒప్పుకోవడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి వంటి పెద్దలు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




