Diwali 2025: బాక్సాఫీస్ మోత ఖాయం! ఈ సీజన్‌లో రిలీజ్‌కు భారీ చిత్రాల లైన్-అప్

Diwali 2025: బాక్సాఫీస్ మోత ఖాయం! ఈ సీజన్‌లో రిలీజ్‌కు భారీ చిత్రాల లైన్-అప్
x

Diwali 2025: బాక్సాఫీస్ మోత ఖాయం! ఈ సీజన్‌లో రిలీజ్‌కు భారీ చిత్రాల లైన్-అప్

Highlights

ఈ దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడనుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది పండుగ సీజన్‌కు పలు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ఈ దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడనుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది పండుగ సీజన్‌కు పలు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కొన్ని సినిమాలు దీపావళి కానుకగా ముందే రానుండగా, మరికొన్ని పండుగ తర్వాత విడుదలై సందడి చేయనున్నాయి. దీనికి తోడు ప్రభాస్ నటించిన 'బాహుబలి: ది ఎపిక్' రీ-మాస్టరింగ్ వెర్షన్ కూడా ఈ నెలలోనే రిలీజ్ కానుంది. మొత్తం ఐదు భారీ చిత్రాలు క్యూలో ఉండటంతో, ప్రేక్షకులకు ఈసారి పండుగ ఆనందం రెట్టింపు కావడం ఖాయం.

ఈ దీపావళికి థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాల వివరాలు మీ కోసం:

1. తెలుసు కదా

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ లవ్ స్టోరీ అక్టోబర్ 17న దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇందులో సిద్దు ఒకేసారి ఇద్దరితో ప్రేమాయణం నడిపే యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఆ ఇద్దరు హీరోయిన్లు రాశి ఖన్నా మరియు కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి. ఇటీవల సిద్ధు నటించిన 'జాక్' ఫ్లాప్ కావడంతో, ఈ చిత్రంపై అతను భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అలాగే, రాశి ఖన్నాకు కూడా ఈ హిట్ చాలా కీలకం. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి నీరజ కోన దర్శకత్వం వహించారు.

2. K-Ramp

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం కూడా దీపావళి కానుకగా అక్టోబర్ 17నే విడుదల కానుంది. యుక్తి తరేజా కథానాయికగా నటించగా, వెన్నెల కిషోర్ మరియు సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కేరళ నేపథ్యంలో సాగే ఈ లవ్ స్టోరీ టీజర్ ఇప్పటికే ఆకట్టుకుంది. ఇటీవల 'దిల్ రుబా'తో ఫ్లాప్ అందుకున్న కిరణ్ అబ్బవరం, ఈ సినిమాతో దీపావళికి హిట్ కొట్టాలని ఆశిస్తున్నాడు.

3. బాహుబలి: ది ఎపిక్ (Baahubali: The Epic)

భారతీయ సినీ పరిశ్రమ గతిని మార్చిన 'బాహుబలి' తొలి భాగం విడుదలయ్యి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ 'ది ఎపిక్' వెర్షన్‌ను దర్శకుడు రాజమౌళి సుమారు ఐదున్నర గంటల నిడివి ఉండేలా సిద్ధం చేస్తున్నాడు. అనవసరమని భావించిన సన్నివేశాలు, తమన్నా నటించిన ఒక పాటను తొలగించి, డాల్బీ అట్మాస్ సౌండ్, 4K నాణ్యతతో కొత్త అనుభూతిని అందించడానికి రెడీ చేస్తున్నారు. అప్పట్లో షూట్ చేసి మిగిలిపోయిన కొన్ని కొత్త సీన్లను జోడించడం, క్లైమాక్స్‌లో కూడా స్వల్ప మార్పులు చేయడం, ముఖ్యంగా 'బాహుబలి పార్ట్ 3' కి సంబంధించిన లీడ్‌ ఇవ్వాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం దీపావళి పండుగ తర్వాత అక్టోబర్ 31న విడుదల కానుంది.

4. మాస్ జాతర

రవితేజ, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహించారు. భీమ్స్ సంగీతం అందించారు. రవితేజ గత నాలుగు చిత్రాలు ఫ్లాపులుగా నిలవడంతో, ఈ సినిమాపై ఆయన అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. గతంలో 'ధమాకా' వంటి సూపర్ హిట్ చిత్రంలో రవితేజతో కలిసి నటించిన శ్రీలీల ఇందులో కథానాయికగా నటించడం, ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం చివరకు అక్టోబర్ 31న విడుదల కానుంది.

5. వృషభ (Vrusshabha)

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, మలయాళం భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్రంలో తెలుగు హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక, మోహన్ లాల్ కొడుకు పాత్రలో నటించడం ఆసక్తికరం. గత జన్మలో శత్రువులు ఈ జన్మలో తండ్రి కొడుకులుగా పుట్టడం అనే విభిన్న కథాంశంతో తెరకెక్కినట్లు సమాచారం. ఈ సినిమాను బాలాజీ ఫిలిమ్స్, కనెక్ట్ మీడియా, AVS స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ పాన్ ఇండియా చిత్రం అక్టోబర్ 16న రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories