Mana Shankara Varaprasad Garu Review: బాక్సాఫీస్ వద్ద చిరు మాస్ జాతర..అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అదిరింది!

Mana ShankaraVaraprasad Garu
x

Mana ShankaraVaraprasad Garu: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్.. 'మన శంకర వరప్రసాద్ గారు'కు కోర్టు రక్షణ.. బుక్‌మైషోలో రేటింగ్స్ క్లోజ్!

Highlights

Mana Shankara Varaprasad Garu Review: బాక్సాఫీస్ వద్ద చిరు మాస్ జాతర..అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అదిరింది!

Mana Shankara Varaprasad Garu Review: సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద సినిమాల సందడి. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై కనిపిస్తే ఆ హడావుడే వేరు. వరుస విజయాలతో టాలీవుడ్‌లో తిరుగులేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, మెగాస్టార్‌తో కలిసి చేసిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. చిరంజీవి 157వ చిత్రంగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం!

కథా నేపథ్యం

శంకర వరప్రసాద్ (చిరంజీవి) ఒక పవర్‌ఫుల్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కేంద్ర మంత్రి శర్మ (శరత్ సక్సేనా)కు రక్షణగా ఉంటూనే, ఆయన ఇంట్లో మనిషిలా కలిసిపోతాడు. వృత్తిలో తిరుగులేని సక్సెస్ సాధించిన ప్రసాద్, వ్యక్తిగత జీవితంలో మాత్రం భార్య శశిరేఖ (నయనతార)కు దూరంగా ఉంటాడు. తన ఇద్దరు పిల్లలు ఒక బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్నారని తెలుసుకుని, వారిని కలుసుకోవడానికి తన గుర్తింపు మార్చుకుని పీఈటీ (PET) టీచర్‌గా అదే స్కూల్‌కు వెళ్తాడు. అక్కడ తండ్రి అని తెలియని తన పిల్లల మనసును ప్రసాద్ ఎలా గెలుచుకున్నాడు? శశిరేఖతో అసలు ఎందుకు విడిపోయాడు? ఈ మధ్యలోకి కర్ణాటక మైనింగ్ కింగ్ వెంకీ గౌడ (వెంకటేష్) ఎలా వచ్చాడు? అన్నదే ఈ సినిమా కథ.

విశ్లేషణ

దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాల్లో లాజిక్ కంటే వినోదానికే పెద్దపీట వేస్తారు. ఈ సినిమాలోనూ అదే ఫార్ములాను వాడారు. ప్రథమార్ధంలో చిరంజీవి వింటేజ్ లుక్స్, ఆయన మార్క్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. చిరంజీవిని మళ్ళీ పాత రోజుల్లోలా హుషారుగా చూడటం మెగా ఫ్యాన్స్‌కు పండుగే. స్కూల్ నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్లు, ముఖ్యంగా హర్షవర్ధన్, అభినవ్ గోమఠంలతో చిరు చేసే హడావుడి సినిమాకు ప్రాణం పోశాయి.

వెంకీ గౌడ ఎంట్రీ

సినిమా సెకండాఫ్ మొదట్లో కథ కాస్త నెమ్మదించినట్లు అనిపించినా, విక్టరీ వెంకటేష్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోతుంది. 'వెంకీ గౌడ'గా వెంకటేష్ స్టైలిష్ లుక్, చిరంజీవితో ఆయన కలిసి చేసిన సందడి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. వీరిద్దరూ కలిసి పాత సూపర్ హిట్ పాటలకు స్టెప్పులు వేయడం, ఒకరినొకరు టీజ్ చేసుకోవడం వంటి దృశ్యాలు థియేటర్లలో ఈలలు వేయిస్తాయి. అనిల్ రావిపూడి తన మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ను క్లైమాక్స్‌లో చక్కగా పండించారు.

నటీనటుల పనితీరు

చిరంజీవి మరోసారి నిరూపించారు తానే ఎందుకు బాస్ అని. ఆయనలోని ఈజ్, డాన్సులు, ఫైట్లు చూస్తుంటే కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోరనిపిస్తుంది. నయనతార తన పాత్రలో హుందాతనాన్ని ప్రదర్శించింది. వెంకటేష్ గెస్ట్ రోల్ అయినా, సినిమాను మలుపు తిప్పే పాత్రలో మెరిశారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, ముఖ్యంగా మాస్ సాంగ్స్ మామూలుగా లేవు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి.

చివరగా..

సంతోషాల సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ శంకరవరప్రసాద్‌ గారు

రేటింగ్ : 3.5/5

Show Full Article
Print Article
Next Story
More Stories