98th Academy Awards (2026): 98వ ఆస్కార్ పోటీలో ‘PARO’.. వధూదాస్య కథతో ప్రపంచ వేదికపై తృప్తి భోయిర్

98th Academy Awards (2026): 98వ ఆస్కార్ పోటీలో ‘PARO’.. వధూదాస్య కథతో ప్రపంచ వేదికపై తృప్తి భోయిర్
x

 98th Academy Awards (2026): 98వ ఆస్కార్ పోటీలో ‘PARO’.. వధూదాస్య కథతో ప్రపంచ వేదికపై తృప్తి భోయిర్

Highlights

98th Academy Awards (2026): ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత తృప్తి భోయర్ మరోసారి అంతర్జాతీయ సినీ వేదికపై భారత్‌కు గర్వకారణంగా నిలిచారు.

98th Academy Awards (2026): ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత తృప్తి భోయర్ మరోసారి అంతర్జాతీయ సినీ వేదికపై భారత్‌కు గర్వకారణంగా నిలిచారు. ఆమె నిర్మించిన తొలి హిందీ ఫీచర్ ఫిల్మ్ ‘PARO – The Untold Story of Bride Slavery’ అధికారికంగా 98వ అకాడమీ అవార్డ్స్ (2026) కంటెన్షన్ లిస్ట్‌లోకి ప్రవేశించింది.

ఇది ఆస్కార్ పరిశీలన దశకు అర్హత పొందిన చిత్రాల జాబితా మాత్రమేనని, ఇది అధికారిక దేశ ప్రతినిధి ఎంట్రీ కాదని చిత్రబృందం స్పష్టం చేసింది.

ఇప్పటికే 86వ ఆస్కార్ అవార్డ్స్‌కు ఎంపికైన తొలి మరాఠీ చిత్రం ‘టూరింగ్ టాకీస్’ నిర్మాతగా గుర్తింపు పొందిన తృప్తి భోయర్, దాదాపు పదేళ్ల విరామం తర్వాత మరోసారి అకాడమీ దృష్టిని ఆకర్షించారు. ‘టూరింగ్ టాకీస్’ చిత్రం మెట్రో నగరాల్లో టెంట్ సినిమాలకు అనుమతి ఇచ్చేలా విధాన మార్పుకు దారి తీసి, కనుమరుగవుతున్న ప్రదర్శన సంస్కృతిని కాపాడడంలో కీలక పాత్ర పోషించింది.

‘పారో’ చిత్రం లింగ అసమతుల్యత, ఆడ శిశుహత్యల వల్ల ఉత్పన్నమవుతున్న వధువుల బానిసత్వం (Bride Slavery), మానవ అక్రమ రవాణా వంటి సామాజిక సమస్యలను హృదయాన్ని తాకేలా ఆవిష్కరిస్తుంది. ఈ సినిమా తృప్తి భోయర్ స్థాపించిన షెల్టర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన లోతైన పరిశోధనల ఆధారంగా తెరకెక్కింది.

ఈ పరిశోధనల్లో భారత్‌లోని మేవాత్ ప్రాంతంలోనే 60 వేల మందికి పైగా బాధిత మహిళలను గుర్తించగా, వాటిలో 4,500కిపైగా కేసులను డాక్యుమెంట్ చేశారు. మహిళా హక్కులపై అవగాహన పెంపొందించడంలో ఈ ప్రాజెక్ట్ చేసిన కృషికి సామాజిక న్యాయ శాఖ, మహిళా కమిషన్ నుంచి ప్రశంసలు కూడా అందాయి.

ఈ సందర్భంగా తృప్తి భోయర్ మాట్లాడుతూ,

“ఏళ్ల తరబడి తమ బాధను బయటకు చెప్పుకోలేని మహిళల కథల నుంచే ‘పారో’ పుట్టింది. ఈ చిత్రం గౌరవం, స్వేచ్ఛ కోల్పోయిన ప్రతి మహిళకే అంకితం. ఒక్కరి జీవితాన్నైనా మార్చగలిగితే ఈ ప్రయాణం సార్థకం” అని తెలిపారు.

తృప్తి భోయర్ తన సినిమాల ద్వారా మహిళా హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా వాదిస్తున్నారు. ఆమె UN Women, TEDx, హార్వర్డ్ యూనివర్సిటీ, నార్వే, అమెరికా, యూరప్‌లోని పలు అంతర్జాతీయ వేదికలపై తన ఆలోచనలను పంచుకున్నారు.

ఈ చిత్రంలో తృప్తి భోయర్, తాహా షా బడూషా, గోవింద్ నామ్‌దేవ్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు గజేంద్ర అహిరే, కథ, స్క్రీన్‌ప్లే తృప్తి భోయర్ – గజేంద్ర అహిరే కలిసి రచించారు. ఈ సినిమాను Trupti Bhoir Filmss మరియు Sandesh Sharda International Pvt Ltd సంయుక్తంగా నిర్మించగా, షెల్టర్ ఫౌండేషన్, రుహి (రోహిణి) హక్ ఆఫ్ హోప్‌బ్లిట్, ప్రియా సామంత్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.

ప్రస్తుతం ఈ చిత్రం సీబీఎఫ్‌సీ సర్టిఫికేషన్ కోసం ఎదురుచూస్తోంది. అయితే ఆ ప్రక్రియ ఆరు నెలలకు పైగా పెండింగ్‌లో ఉండటం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories