The Girlfriend : ది గర్ల్‌ఫ్రెండ్‌ రివ్యూ.. రాహుల్ రవీంద్రన్ మగాళ్లకు వ్యతిరేకంగా తీశాడా? రష్మిక సినిమా హిట్టా? ఫట్టా?

The Girlfriend : ది గర్ల్‌ఫ్రెండ్‌ రివ్యూ.. రాహుల్ రవీంద్రన్ మగాళ్లకు వ్యతిరేకంగా తీశాడా? రష్మిక సినిమా హిట్టా? ఫట్టా?
x

 The Girlfriend : ది గర్ల్‌ఫ్రెండ్‌ రివ్యూ.. రాహుల్ రవీంద్రన్ మగాళ్లకు వ్యతిరేకంగా తీశాడా? రష్మిక సినిమా హిట్టా? ఫట్టా?

Highlights

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్‌.

The Girlfriend : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్‌. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్, ఎమోషనల్ లవ్‌స్టోరీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. విడుదల ముందు ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించడంతో పాటు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ది గర్ల్‌ఫ్రెండ్‌ పై హైప్ బాగా క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు (నవంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో, రష్మికకు హిట్ పడిందా లేదా, దర్శకుడి ఉద్దేశ్యం ఏంటి అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?

భూమా దేవి (రష్మిక మందన్నా) తండ్రి (రావు రమేష్) పెంపకంలో పెరిగిన ఓ అమాయకపు అమ్మాయి. ఎంఏ లిటరేచర్ చదువుకోవడానికి తొలిసారి తండ్రిని వదిలి సిటీకి వచ్చి రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేరుతుంది. అక్కడే విక్రమ్ (దీక్షిత్ శెట్టి), దుర్గ (అనూ ఇమ్మాన్యుయేల్) కూడా జాయిన్ అవుతారు. విక్రమ్ ఆవేశపరుడు. అమ్మాయిలు ఇలానే ఉండాలనుకునే మనస్తత్వం ఉన్నవాడు. తనకి నచ్చినట్లుగా భూమా ప్రవర్తించడంతో ఆమెను ప్రేమిస్తాడు. విక్రమ్‌ని అదే కాలేజీకి చెందిన దుర్గ ప్రేమిస్తుంది, కానీ విక్రమ్ ఆమెను నిరాకరిస్తాడు. లవ్, రిలేషన్షిప్‌లకు దూరంగా ఉండాలనుకునే భూమా కూడా విక్రమ్‌తో ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత భూమా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? తన జీవితం మొత్తం విక్రమ్ కంట్రోల్‌లోకి వెళ్లిందని తెలిసిన తర్వాత భూమా తీసుకున్న అనూహ్య నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం ఆమెకు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టింది? అనేది మిగతా కథ.

విశ్లేషణ

ప్రేమలో భయానికి చోటు లేదని, మనల్ని కంట్రోల్ చేసే అధికారం ఇంకొకరికి ఇవ్వకూడదని చెప్పే సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. పైకి ఇది ఒక సింపుల్ కథగా కనిపించినా, దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ పనితనం చాలా ఉంది. విజువల్స్ ద్వారా కథను చెప్పడానికి ప్రయత్నించారు. హీరో ఇంటికి హీరోయిన్ వెళ్లినప్పుడు వచ్చే ఒక మిర్రర్ విజువల్, రష్మిక షవర్ సీన్ వంటివి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. చాలా సన్నివేశాల్లో సింబాలిక్ షాట్స్, హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే కథను వేగంగా చెప్పకుండా, భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కొంత నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్రకు సడన్‌గా కత్తెర వేసి క్లైమాక్స్‌కు ముందు తిరిగి తీసుకురావడం ఆమె క్యారెక్టర్ ఆర్క్ సరిగా లేదనిపిస్తుంది. ది గర్ల్‌ఫ్రెండ్ చూశాక, మగాళ్లందరిదీ తప్పన్నట్టు చూపించాడని రాహుల్ రవీంద్రన్‌పై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా దీన్ని ఒక కథగా చూస్తే ఎలాంటి సమస్య ఉండదు. భూమాను బాయ్‌ఫ్రెండ్, తండ్రి ఇద్దరూ అర్థం చేసుకోరు. ఆమె ఏం కోరుకుంటుందో పట్టించుకోరు. అందువల్ల వాళ్లిద్దరూ విలన్స్‌గా మారతారు. దాంతో మగాళ్లది తప్పని చూపించారని కొందరు భావించవచ్చు.

సాంకేతిక వర్గం

హేషామ్ అబ్దుల్ వాహేబ్ పాటలు ఫర్వాలేదనిపించాయి. కథతో పాటు పాటలు ముందుకు వెళ్లాయి. రాకేందు మౌళి సాహిత్యం అద్భుతంగా ఉంది. పాటల కంటే నేపథ్య సంగీతం అందించిన ప్రశాంత్ ఆర్ విహారిని ప్రత్యేకంగా అభినందించాలి. సినిమాలో మాటలు తక్కువ ఉండటం, దర్శకుడు భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో, ప్రశాంత్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు ప్రాణం పోసింది. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బావుంది. కథకు అవసరమైన మూడ్‌ను లైటింగ్ ద్వారా తీసుకొచ్చారు. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. నిర్మాతలు ఖర్చుకు రాజీ పడలేదు.

నటీనటుల ప్రదర్శన

భూమా పాత్రలో రష్మిక మందన్నా జీవించారు. పైకి నవ్వుతున్నట్టు కనిపించినా, లోపల అంతులేని బాధను అనుభవించే పాత్ర ఆమెది. ఆ వెలితిని కళ్లలో చూపించిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా బ్రేకప్ సీన్‌లోని క్లోజప్ షాట్స్, క్లైమాక్స్‌లో బరస్ట్ అయ్యే సన్నివేశంలో ఆమె నటనకు క్లాప్స్ పడతాయి. రష్మికకు ధీటుగా దీక్షిత్ శెట్టి నటించారని చెప్పడంలో సందేహం లేదు. బ్రేకప్ సీన్‌లో ఎమోషన్స్ బాగా పలికించారు. పతాక సన్నివేశాలకు వచ్చే కొలదీ విక్రమ్ పాత్రపై ప్రేక్షకులకు కోపం కలుగుతుంది. రోహిణి కనిపించేది ఒక్క సన్నివేశమే అయినా, ఆమె తప్ప మరొకరిని ఊహించుకోలేం. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్ర నిడివి తక్కువ. తన పరిధి మేరకు చేశారు. రావు రమేష్ అనుభవం తండ్రి పాత్రకు తోడయ్యింది. ఆయనకు ఇటువంటి పాత్రలు చేయడం, ఆ భావోద్వేగాలు పలికించడం కొత్త కాదు. ఫ్యాకల్టీగా రాహుల్ రవీంద్రన్ బాగా చేశారు.

చివరిగా:

ది గర్ల్‌ఫ్రెండ్‌ చూసిన ప్రేక్షకులకు ఈ కథ, అందులోని క్యారెక్టర్లతో లవ్ - హేట్ రిలేషన్ తప్పకుండా ఏర్పడుతుంది. రాహుల్ రవీంద్రన్ ఫెమినిస్ట్ అని, హీరోయిన్ కోణంలో సినిమా తీసి హీరోని విలన్ చేశారని ఆయనపై కోపం రావచ్చు. దీక్షిత్ శెట్టి పాత్రపై ప్రేమ కలగవచ్చు. రాహుల్ రవీంద్రన్ కథతో ఏకీభవిస్తే రష్మిక పాత్ర నచ్చుతుంది. ఒక్కటి మాత్రం నిజం... ప్రేమలో స్పష్టత ఉండటం ముఖ్యమని చెబుతుందీ సినిమా.

రేటింగ్ - 2.75/5

Show Full Article
Print Article
Next Story
More Stories