Kota Srinivasa Rao: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

Kota Srinivasa Rao
x

Kota Srinivasa Rao: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

Highlights

Kota Srinivasa Rao: తెలుగు సినీ ప్రపంచానికి తీరని లోటు ఎదురైంది. నాలుగు దశాబ్దాలపాటు తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇక లేరు.

Kota Srinivasa Rao: తెలుగు సినీ ప్రపంచానికి తీరని లోటు ఎదురైంది. నాలుగు దశాబ్దాలపాటు తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన కోట, విలన్, హాస్య నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 750కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో 1942, జూలై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు, చిన్ననాటి నుంచే నాటకాల పట్ల మక్కువతో ఉన్నారు. వందలాది నాటకాల్లో నటించిన ఆయన, 1978లో చిరంజీవి హీరోగా నటించిన 'ప్రాణం ఖరీదు' చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు.

కేవలం తెలుగు సినిమాలకే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ తన ప్రతిభను చాటారు. ఒకే తరహా పాత్రలకు పరిమితమవకుండా, హాస్యం, విలనిజం, సెంటిమెంట్, పౌరాణికం ఇలా అన్నిరకాల పాత్రలను తనదైన శైలిలో ఒరవడిలో వినిపించారు.

కోట రాజకీయాల్లోనూ తనయి చూపించారు. 1999లో భారతీయ జనతా పార్టీ తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్నా, 2023లో వచ్చిన 'సువర్ణ సుందరి' ఆయన చివరి సినిమా. కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి 2015లో పద్మశ్రీతో సత్కరించింది. అదనంగా ఆరు నంది అవార్డులు అందుకున్నారు.

గత నెలలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కోటను కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పట్లో కోట ఆరోగ్య పరిస్థితిపై వివిధ అంచనాలు వెలువడగా, ఆయన స్వయంగా స్పందిస్తూ తాను ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. కానీ, ఆ వ్యాఖ్యల అనంతరం నెల రోజుల వ్యవధిలోనే ఆయన మరణ వార్త వెలువడడం సినీప్రియులను తీవ్రంగా కలిచివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories