Rashmika Mandanna–Vijay Deverakonda Wedding: రష్మిక పెళ్ళి వేదికగా ఉదయపూర్ లోని రిసార్ట్.. ఖర్చు ఎంతో తెలుసా?

విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి వేడుకలు ఉదయపూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి.
x

Rashmika Mandanna–Vijay Deverakonda Wedding Venue 

Highlights

విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి వేడుకలు ఉదయపూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. పెళ్లి ఖర్చు, వేదిక, రిసెప్షన్ వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు

Rashmika Mandanna–Vijay Deverakonda Wedding: టాలీవుడ్ లో మరో స్టార్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభం అయ్యాయి. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న తమ వైవాహిక బంధానికి సిద్ధమయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ వేదికగా ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోబోతున్నారు. ఫిబ్రవరి 26, గురువారం నాడు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. ప్రస్తుతం ఉదయపూర్ శివార్లలోని ఒక విలాసవంతమైన రిసార్ట్‌లో వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు అత్యంత వేడుకగా ప్రారంభమయ్యాయి.

చాలా కాలంగా వీరిద్దరి ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చినప్పటికీ, ఈ జంట ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. అయితే, గతేడాది అక్టోబర్ 3న హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తమ సొంత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలను వదిలి, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా వివాహం చేసుకోవాలని వీరు రాజస్థాన్‌ను ఎంచుకున్నారు.

ది మెమెంటోస్ బై ఐటీసీ

విజయ్, రష్మిక తమ పెళ్లి కోసం ఉదయపూర్ నగరానికి వెలుపల ఉన్న 'ది మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్'ను ఎంచుకున్నారు. ఆరావళి పర్వత శ్రేణుల మధ్య కొండపై ఉన్న ఈ రిసార్ట్ ఎంతో అందంగా ఉంటుంది. నగర హడావిడికి దూరంగా, పచ్చని ప్రకృతి మధ్య ఉన్న ఈ ప్రదేశంలో ఇండోర్ హాల్స్, విశాలమైన లాన్‌లు ఉన్నాయి. పెళ్లికి వచ్చే అతిథుల కోసం అన్ని రకాల ఆధునిక వసతులను ఇక్కడ ఏర్పాటు చేశారు.

భారీ ఏర్పాట్లు

Rashmika Mandanna–Vijay Deverakonda Wedding: జాతీయ మీడియాలో వచ్చిన వివరాల ప్రకారం ఈ రిసార్ట్‌లో దాదాపు 117 గదులు ఉన్నట్లు సమాచారం. ఇందులో ప్రీమియం సూట్‌లు, ప్రైవేట్ విల్లాలు కూడా ఉన్నాయి. ఒక్కో గది ధర రోజుకు రూ. 20,000 నుండి రూ. 50,000 వరకు ఉండగా, విలాసవంతమైన విల్లాల ధర రూ. 70,000 దాటుతుందని తెలుస్తోంది. ఈ వివాహ వేడుక కోసం దాదాపు రూ. 90 లక్షల నుండి రూ. 2.5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. ఇందులో వసతి, భోజనం, ఇతర డెకరేషన్ ఖర్చులు కలిసి ఉన్నాయి.

అత్యంత సన్నిహితుల మధ్య..

విజయ్ - రష్మిక తమ వివాహ వేడుకలను చాలా ప్రైవేట్‌గా ఉంచాలని నిర్ణయించుకున్నారు. కేవలం అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరవుతున్నారు. పూల్ గేమ్స్, జపనీస్ వంటకాలతో కూడిన విందులు-సరదా కార్యక్రమాలతో ఇప్పటికే వేడుకలు మొదలయ్యాయి. ఈ జంట తమ స్నేహితులు కుటుంబ సభ్యులతో గడుపుతున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్

ఉదయపూర్‌లో పెళ్లి ముగిసిన తర్వాత, ఈ జంట హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. మార్చి 4, 2026న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఈ రిసెప్షన్‌లో సందడి చేయనున్నారు.

విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జోడీకి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాలతో వెండితెరపై మెరిసిన ఈ జంట, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒక్కటవుతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories