
Holi Gift: హోలీ వేళ సామాన్యుడికి కలర్ ఫుల్ న్యూస్.. క్రూడాయిల్ పెరిగినా పెట్రోల్ ధరలకు బ్రేక్!
Holi Gift: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నా దేశీయంగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉండటం ఉపశమనం కలిగిస్తోంది..!
Holi Gift: మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు దాదాపు 9 శాతం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 80 డాలర్లకు చేరువలో ఉండగా, అమెరికన్ క్రూడ్ ఆయిల్ ధర 72.79 డాలర్లకు చేరింది. ఒకవేళ ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే, ధర 100 డాలర్లు దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ తన చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నందున, ఈ ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై సామాన్యుల్లో ఆందోళన మొదలైంది. అయితే, దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని ఊరటనిచ్చే వార్తలు వినిపిస్తున్నాయి. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రభుత్వం నుంచి ఊరటనిచ్చే వార్త..
అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే పెరిగే అవకాశం లేదని సమాచారం. దీనికి ప్రధాన కారణాలు ఇవే..
* అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు చమురు కంపెనీలు లాభాలు గడించడానికి, ధరలు పెరిగినప్పుడు సామాన్యులపై భారం పడకుండా నష్టాలను భరించడానికి ప్రభుత్వం ఒక విధానాన్ని అనుసరిస్తోంది.
* పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ధరలు పెంచి విపక్షాలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావించడం లేదు.
* ఏప్రిల్ 2022 నుంచి దేశంలో ఇంధన ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి.
హోర్ముజ్ జలసంధి ముప్పు..
భారత్‌కు వచ్చే చమురులో సగానికి పైగా హోర్ముజ్ జలసంధి ద్వారానే ప్రయాణిస్తూ వస్తుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తామని హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఈ మార్గం మూతపడితే, చమురు సరఫరా నిలిచిపోయి ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. "మేము మారుతున్న పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నాము. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటాము" అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




