
కేసు వేయమంటేనే రూ.20లక్షలు..అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులకు ఎయిర్ ఇండియా కండీషన్
Air India : గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద బాధితులకు ఎయిర్ ఇండియా పరిహారం ప్రకటించింది. అయితే ఈ పరిహారం వెనుక ఒక కండిషన్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదనపు నగదు తీసుకోవాలంటే భవిష్యత్తులో ఎయిర్ ఇండియాపై గానీ, విమాన తయారీ సంస్థ బోయింగ్‌పై గానీ ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని బాధితుల కుటుంబాలు సంతకం చేయాల్సి ఉంటుంది. బ్రిటీష్ వార్తాపత్రిక ది ఇండిపెండెంట్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.
ప్రమాదం వెనుక అసలు కథ
గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. భూమిపై ఉన్న మరో 19 మంది కూడా మరణించారు. ప్రాథమిక విచారణ నివేదిక ప్రకారం.. విమానం ఎగిరిన మూడు సెకన్లలోనే ఇంజిన్ ఫ్యూయల్ కట్-ఆఫ్ స్విచ్‌లు అనుకోకుండా ఆగిపోయాయి. దీనివల్ల విమానం తన శక్తిని కోల్పోయి వేగంగా కిందకు పడిపోయింది. ఈ సాంకేతిక లోపంపై అమెరికాలో బోయింగ్, హనీవెల్ సంస్థలపై కేసులు నడుస్తున్నాయి.
పరిహారం, నిబంధనలు
ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ ఇండియా రూ.25 లక్షలు, టాటా గ్రూప్ మరో రూ.కోటి పరిహారం ఇస్తామని ప్రకటించాయి. ఇప్పుడు అదనంగా 8,000 పౌండ్ల (రూ.10 లక్షలు) నుంచి 16,000 పౌండ్ల (రూ.20 లక్షలు) వరకు ఇస్తామని ఆఫర్ చేస్తోంది. అయితే ఇది తీసుకోవాలంటే బాధితుల కుటుంబాలు ఒక అంగీకార పత్రంపై సంతకం చేయాలి. అందులో.. "భవిష్యత్తులో ఈ ప్రమాదం విషయంలో విమానయాన సంస్థపై గానీ, విమానాన్ని తయారు చేసిన బోయింగ్‌పై గానీ ఎటువంటి దావా వేయము" అని రాసి ఉంటుంది. ఈ హక్కును ఎప్పటికీ వదులుకోవాలని ఎయిర్ ఇండియా కోరుతోంది.
న్యాయ నిపుణుల అభ్యంతరం
ప్రమాదంపై అధికారిక దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, భద్రతా లోపాలకు ఎవరిది బాధ్యతో ఇంకా తేలలేదని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో బాధితులపై ఒత్తిడి తెచ్చి చట్టపరమైన హక్కులను వదులుకోమని చెప్పడం ఏమాత్రం సమంజసం కాదని వారు మండిపడుతున్నారు. మృతుల్లో 53 మంది బ్రిటీష్ పౌరులు ఉండటంతో బ్రిటన్‌లో కూడా ఈ అంశంపై చర్చ నడుస్తోంది. అటు బాధితుల తరఫు న్యాయవాదులు.. ఈ పరిహారం తీసుకుని సైలెంటుగా ఉండటం కంటే, బాధ్యులపై చర్యలు తీసుకునేలా పోరాడటమే సరైనదని సూచిస్తున్నారు.
ఎయిర్ ఇండియా వాదన
పరిహారం విషయంలో తాము పారదర్శకంగా ఉన్నామని ఎయిర్ ఇండియా పేర్కొంటోంది. భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ప్రమాదం తర్వాత ఆపరేషనల్ మెరుగుదలలు, విమాన తనిఖీలను కఠినతరం చేశామని వెల్లడించింది. ఈ పరిహారం బాధితులకు అండగా ఉండేందుకే తప్ప, వారిని ఇబ్బంది పెట్టడానికి కాదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అయినప్పటికీ, భవిష్యత్తులో చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఈ క్లాజ్‌ను చేర్చినట్లు తెలుస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




