Bihar Election 2025: బిహార్ రెండోదశ ఎన్నికలకు ఏర్పాట్లు.. ఉ.7 గంటలకు పోలింగ్ ప్రారంభం

Bihar Election 2025: బిహార్ రెండోదశ ఎన్నికలకు ఏర్పాట్లు.. ఉ.7 గంటలకు పోలింగ్ ప్రారంభం
x

Bihar Election 2025: బిహార్ రెండోదశ ఎన్నికలకు ఏర్పాట్లు.. ఉ.7 గంటలకు పోలింగ్ ప్రారంభం 

Highlights

బిహార్‌లో రెండో దశ దంగల్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది.

Bihar Election 2025: బిహార్‌లో రెండో దశ దంగల్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. 122 స్థానాల్లో 1,302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 122 స్థానాల్లో మంగళవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది.

రెండో దశలో 1,302 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 136 మంది మహిళలు, 1,165 మంది పురుషులు, ఒక ట్రాన్స్ జెండర్ అభ్యర్థి ఉన్నారు. ఇందులో చాలామంది అభ్యర్థులు మూడేసి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఇక కైమూర్‌లోని రెహ్‌తాస్‌లోని ససారాం, గయాలోని గయా సిటీలో ఏకంగా 22మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరోవైపు తూర్పు చంపారన్‌లోని లోరియా, చాన్‌పాటియా, రక్సౌల్, సుగౌలి, సుపాల్‌లోని త్రివేణి గంజ్‌, పూర్ణియాలోని బన్మంఖిల్లో అత్యల్పంగా ఒక్కో అసెంబ్లీ స్థానానికి 5మంది చొప్పున పోటీ చేస్తున్నారు.

ఎన్నికల కోసం 45,399 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 40,073 బూత్‌లు, పట్టణ ప్రాంతాల్లో 5,326 బూత్‌లు ఉన్నాయి. వీటిలో 45,388 జనరల్ బూత్‌లు ఉండగా.. 11 సహాయక బూత్‌లు ఉన్నాయి. రెండో దశ ఎన్నికల్లో మొత్తం 3 కోట్ల 70 లక్షల 13,556 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మొదటిసారి ఓటు హక్కు పొందిన వారు 7,69,356 మంది, 943మంది ట్రాన్స్ జెండర్లు. 43 మంది ఎన్‌ఐఆర్‌ ఓటర్లు ఉన్నారు. ఇక 100ఏళ్లకు పైబడిన ఓటర్లు 6,255మంది, సర్వీసు ఓటర్లు 63,373మంది ఉన్నారు.

సెకండ్ ఫేజ్‌లో ఓటింగ్ జరిగే 20 జిల్లాల్లో పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామర్హి, శివహార్, మధుబాని, సుపాల్, అరారియా, కిషన్‌గంజ్, పూర్నియా, కతిహార్, భాగల్‌పూర్, బంకా, జముయి, నవాడా, గయా, ఔరంగాబాద్, జెహానాబాద్, అర్వాల్, కైమూర్, రోహ్తాస్ ఉన్నాయి. రెండో దశలో రాజకీయ హేమాహేమీలు బరిలో నిలిచారు. నితీశ్ కుమార్ సన్నిహితులైన మంత్రులు విజేంద్ర ప్రసాద్ యాదవ్, లేసీ సింగ్, రేణుదేవి, షీలా మండల్, జమాఖాన్ ఉన్నారు. ఈసారి బిహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏ, మహాగఠ్ బంధన్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. అయితే జన్ సురాజ్, AIMIM కూడా అనేక స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రత్యేక బలగాలను రప్పించారు. ఉత్తర ప్రదేశ్ సహా మొత్తం 14 ఏన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి కేంద్ర సాయుధ పోలీసు దళాన్ని మోహరించారు. పోలింగ్ రోజున బూత్‌ల దగ్గర మూడంచెల భద్రత ఉంటుంది. ఆధునిక ఆయుధాలతో కూడిన CAPF సిబ్బంది ముందు వరుసలో విధులు నిర్వహిస్తారు.

నవంబర్ 6న 121 స్థానాలకు జరిగిన మొదటి దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 65శాతం ఓటింగ్ నమోదు అయింది. ప్రస్తుతం రెండో దశ పోలింగ్‌పై అందరి ఫోకస్ ఉంది. మరి ఈసారి ఓటింగ్ రికార్డు బద్దలవుతుందో లేదో చూడాలి. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories