Body Donation After Death: శరీరదానం అంటే ఏంటి... దానం చేసిన శరీరంతో ఏం చేస్తారు?


Sitaram Yechury: బాడీ డొనేట్ చేశారు... ఇంతకీ శరీరదానం అంటే ఏంటి?
బతికున్న మనిషి అవయవదానం విషయానికొస్తే.. అత్యవసర పరిస్థితుల్లో కిడ్నీ దానం చేయొచ్చు. రక్తదానం చేయొచ్చు. అలాగే లివర్ కూడా దానం చేయొచ్చు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి, మార్కిస్ట్ యోధుడు సీతారాం యేచూరి గురువారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణానికి ముందే తన బాడీ డొనేట్ చేయడానికి అంగీకరించారు. ఇంతకీ శరీరదానం అంటే ఏంటి? చనిపోయిన తరువాత వ్యక్తి దేహాన్ని దానం చేయాలంటే ముందుగా ఏం చేయాలి? దానంగా తీసుకున్న దేహాన్ని హాస్పిటల్ వారు ఏం చేస్తారు? ఎలా చేస్తారు? అసలు దేహాన్ని దానం చేయడం అనేది ఎందుకు ముఖ్యం? ప్రాణం లేని దేహం ఎవరికి, ఎందుకు ఉపయోగపడుతుంది? శరీరదానం చేయడానికి మన దేశంలో ఉన్న పద్ధతులేంటి?
బతికున్న మనిషి అవయవదానం విషయానికొస్తే.. అత్యవసర పరిస్థితుల్లో కిడ్నీ దానం చేయొచ్చు. రక్తదానం చేయొచ్చు. అలాగే లివర్ కూడా దానం చేయొచ్చు.
లివర్ ప్రత్యేకత ఏంటంటే, ఆరోగ్యంగా ఉన్న మనిషి శరీరంలో లివర్ మళ్లీ మామూలు సైజుకు పెరుగుతుంది. ఒకవేళ మనిషి బ్రెయిన్‌డెడ్ అయితే.. శరీరంలోంచి గుండె, కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులు, పెద్దపేగు వంటి అవయవాలు దానం చేయొచ్చు. ఒకవేళ మనిషి బ్రెయిన్ డెడ్ కాకుండా ఏవైనా ఇతర కారణాలతో లేదా సహజంగానే చనిపోయినట్లయితే.. వారి నేత్రాలు, ఎముకలు, గుండె కవాటాలు వంటివి దానం చేయొచ్చు. ఇవన్నీ కూడా అవయవదానం కిందకు వచ్చేవే. ఈ తరహా దానాలు అవి పొందిన మరో వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాయి. వారి ఆయుష్షును పెంచుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ చాలామందికి తెలియని దానం మరొకటుంది.. అదే మొత్తం శరీరాన్ని దానం చేయడం.
శరీరదానం అంటే ఏంటి ? ఎలా దానం చేస్తారు?
ఒక మనిషి చనిపోయిన తరువాత మృత దేహాన్ని ఏదైనా మెడికల్ కాలేజీకి అప్పగించడమే ఈ శరీర దానం. సాధారణంగా చనిపోయిన వ్యక్తుల చివరి కోరిక ప్రకారమే వారి కుటుంబసభ్యులు ఈ నిర్ణయం తీసుకుంటుంటారు. అందుకోసం ఒక పద్ధతి, ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా తాము చనిపోయిన తరువాత తమ బాడీని దానం చేయాలనుకుంటే.. అంతకంటే ముందుగా వారికి సమీపంలో ఉన్న మెడికల్ కాలేజ్ లేదా ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అందుకు సంబంధించిన అంగీకార పత్రం రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేహాన్ని దానంగా పొందే అనుమతి ఉన్న ఎన్జీఓల సంస్థలకు కూడా దేహాన్ని దానం చేయొచ్చు.
దానంగా తీసుకున్న దేహంతో ఏం చేస్తారు?
మానవ శరీరంలో ఏయే అవయవం ఏ స్థానంలో ఉంటుంది, అవి ఏ పరిమాణంలో ఉంటాయి, ఎలా పనిచేస్తాయి అని చెప్పే శాస్త్రమే హ్యూమన్ అనాటమి. సాధారణంగా మెడిసిన్ చదివే విద్యార్థులకు ఈ హ్యూమన్ అనాటమి పాఠాలను తరగతి గదిలో బోర్డుపై, లేదా డిజిటల్ క్లాసుల్లో త్రీడి ఫార్మాట్‌లో ఉన్న అవయవాల బొమ్మలపై చెబుతుంటారు. లేదంటే మెడిసిన్ విద్యార్థులకు టీచింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బొమ్మలను ఉపయోగించి ప్రొఫెసర్లు పాఠాలు చెబుతారు.
వీటితో పాటు మెడికల్ కాలేజీలో అదే విద్యార్థులకు నేరుగా మనిషి అవయవక్రమం గురించి నేరుగా మనిషి శరీరంపైనే ప్రయోగాత్మకంగా వివరించి చెప్పేందుకు మన ముందున్న మరో మార్గమే ఈ శరీరదానం. ఇలా దానంగా వచ్చిన దేహాలతో మెడిసిన్ విద్యార్థులకు హ్యూమన్ అనాటమి పాఠాలు చెబుతారు. అందుకే మనం చనిపోయినా.. మన దేహం మరొకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో కొంతమంది ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ దేహాన్ని దానం చేసేందుకు అంగీకార పత్రం ఇస్తుంటారు.
పాఠాలు, ప్రయోగాలు పూర్తయ్యాకా ఆ మృతదేహాన్ని ఏం చేస్తారు?
మెడికల్ కాలేజీలో ఆ మృతదేహంపై ప్రయోగ పాఠాలు పూర్తయిన తరువాత ఏం చేస్తారు అనేది ఇంకో ప్రశ్న. అయితే, తమ శరీరాన్ని దానం చేసిన వారి చివరి కోరిక, వారి ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ ఆ మృతదేహాన్ని పూడ్చిపెట్టడం లేక ఖననం చేయడం జరుగుతుంది. అనాథ శవాల విషయంలో వారు ఎవరు? వారి మతం ఏంటి? ఆచారం ఏంటనే విషయంలో స్పష్టత ఉండదు కనుక అలాంటి మృతదేహాల విషయంలో మెడికల్ కాలేజీ తమ సౌకర్యం ప్రకారమే ఆ దేహానికి అంత్యక్రియలు పూర్తిచేస్తాయి. ఒకవేళ డోనర్ కోరినట్లయితే.. మెడికల్ కాలేజీలో ప్రయోగాల అనంతరం పార్థివదేహాన్ని తిరిగి వారి కుటుంబసభ్యులకే అప్పగించే సంప్రదాయం కూడా ఉంది.
కొన్ని దేశాల్లో ఇలా దానంగా వచ్చి మృతదేహాలకు ఘనంగా అంత్యక్రియలు పూర్తిచేయడంతో పాటు.. వారికి ఘన నివాళి అర్పించే కార్యక్రమాలు కూడా చేపడతారు. అంతేకాకుండా ఆ శరీరాన్ని దానం చేసిన వారి కుటుంబాలను ఆ కార్యక్రమానికి ఆహ్వానించి వారికి తమ సంస్థ తరుపున కృతజ్ఞతలు చెప్పడం కూడా జరుగుతుంది.
ఎలాంటి దేహాలను దానంగా తీసుకోరు
కొన్ని సందర్భాల్లో ఎవ్వరూ తీసుకోవడానికి ముందుకు రాని అనాధ శవాలను కూడా పోలీసులు మెడికల్ కాలేజీలకు దానంగా ఇస్తుంటాయి. ఏదేమైనా తమ పరిశోధనల కోసం లభించిన దేహాలను మెడిసిన్ విద్యార్థులు, ప్రొఫెసర్లు అత్యంత విలువైనవిగా భావిస్తారు. అయితే, అత్యంత తక్కువ సందర్భాల్లో మాత్రమే శరీరదానాన్ని తిరస్కరిస్తారు. ఉదాహరణకు కొన్నిసార్లు వ్యక్తులు చనిపోయిన పరిస్థితులను బట్టి వారి దేహాలకు పోస్టుమార్టం అవసరం అవుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో పోస్టుమార్టం వల్లే శరీరదానాలను మెడికల్ కాలేజీలు తిరస్కరిస్తుంటాయి.
శరీరదానం ప్రక్రియలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం
శరీరదానం చేయాలనే నిర్ణయం తీసుకున్న వారు ముందుగా తమ కుటుంబసభ్యులను ఒప్పించాలి. ఎందుకంటే వ్యక్తి చనిపోయిన తరువాత ఆ సమాచారాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చి శరీరదానానికి సహకరించాల్సింది వాళ్లే. వాళ్ల సహకారం లేకుంటే మెడికల్ కాలేజీ వాళ్లకు ఆ వ్యక్తి చనిపోయిన విషయం కూడా తెలిసే అవకాశం ఉండదు. అలాగే శరీరదానం గురించి అంగీకారపత్రం రాసి ఇచ్చేందుకు వెళ్లేటప్పుడు తమ కుటుంబంలో ఆ బాధ్యతను తీసుకునే వారిని కూడా వెంటపెట్టుకుని వెళ్లాలి.
శరీరదానం చేసిన ప్రముఖులు
గతంలో ఇలా శరీరదానం చేసిన ప్రముఖుల విషయానికొస్తే.. జూరిస్ట్ లీలాసేత్, సీపీఐఎం అగ్రనేత సోమ్‌నాథ్ చటర్జి, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు, జన సంఘ్ నేత నానాజి దేశ్‌ముఖ్ వంటి వాళ్లున్నారు. తాజాగా సీపీఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఆ జాబితాలో చేరారు.
గత కొద్ది రోజులుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూసిన సీతారాం ఏచూరి పార్థివదేహాన్ని వారి కుటుంబసభ్యులు అదే ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి దానం చేశారు. జీవితాంతం సమాజ సేవ చేసి తమ జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన వాళ్లు.. తాము ఈ లోకంలో లేకపోయినా తమ దేహం మరో నలుగురికి ఉపయోగపడాలి అనుకునే గొప్పవాళ్లే ఇలా శరీరదానానికి ముందడుగేస్తారు.. అందుకే వాళ్లు ఎప్పటికీ చిరస్మరనీయులుగా మిగిలిపోతారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire