TOP 6 News @ 6M: పిల్లలకు అమెరికా పౌరసత్వం కోసం నెలల నిండకముందే సి-సెక్షన్ చేయించుకుంటున్న ప్రెగ్నెంట్స్
ఇప్పటివరకు ఉన్న రూల్ ప్రకారం విదేశీయులకైనా సరే అమెరికాలో పిల్లలు పుడితే, ఆ పిల్లలకు జన్మతః అమెరికా పౌరసత్వం వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు.
1) Hyderabad: భార్యను చంపే ముందు భర్త ప్రాక్టీస్.. ఎముకలు, మాంసం వేరు చేసి..
అనుమానం.. పెను భూతం.. ఆ అనుమానం ఎంతటి దారుణానికి ఒడిగట్టడానికైనా దారి తీస్తుంది. తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తాను పెంచుకున్న అనుమానంతో.. కట్టుకున్న ఇల్లాలుని కడతేర్చేశాడు ఓ కిరాతక భర్త. క్షణికావేశంలో చంపేసి.. తప్పించుకునేందుకు మరింత పాశవికంగా ప్రవర్తించాడు. చివరకు తన డ్రామాలు బయటపడి తానే హత్య చేసుకున్నట్టు వెల్లడించాడు. హైదరాబాద్ మీర్‌పేట్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
భార్యతో గొడవపడిన భర్త ఆమెను చంపేశాడు. హత్యతో తనకేమి సంబంధం లేనట్లు నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు. అంతకుముందే అందుకు సంబంధించి స్కెచ్ వేశాడు. మర్డర్ నుంచి ఎస్కేప్ దాకా పక్కా ప్లాన్ చేసి.. ఇంప్లిమెంట్ చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్‌లో ఉడికించి.. ఎముకలను రోట్లో వేసి దంచి పొడిగా చేసి సమీపంలోని చెరువులో విసిరేశాడు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవికి అదే గ్రామానికి చెందిన పుట్ట గురుమూర్తితో 13 ఏళ్ల కిందట వివాహమైంది. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి ప్రస్తుతం డీఆర్‌డీవోలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వరనగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఈ నెల 15న ఇంట్లో పిల్లలు లేని సమయంలో దంపతుల మధ్య తగాదా జరిగింది. సంక్రాంతి సెలవులకు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చే విషయంలో గొడవ మొదలైనట్లు సమాచారం.
భార్యను చంపే ముందు గురుమూర్తి ఇంట్లో ప్రాక్టీస్ కూడా చేశాడు. కుక్కను చంపేసి అదే మాదిరిగా భార్యను కడతేర్చాడు. ఆమె డెడ్‌బాడీని మాయం చేసి తప్పించుకోవాలని భావించాడు. మటన్ కొట్టే కత్తిని తీసుకొచ్చి భార్య బాడీని ముక్కలు చేశాడు. ఎముకలు మాంసాన్ని వేరుచేసి.. మాంసాన్ని ఉడకబెట్టాడు. ఆ తర్వాత భార్య ఎముకలను వేరుచేసి రోట్లో వేసి పొడిగా మార్చాడు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా తన ప్లాన్ ప్రకారం పని ముగించాడు.
ఇక ఇదంతా జరిగాక.. తప్పించుకోవడం కోసం ఈ నెల 18న తన భార్య తల్లికి ఫోన్ చేసి వెంకటమాధవి కనిపించడం లేదని, చిన్న గొడవై ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు. ఈనెల 18న మీర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తనపై అనుమానం రాకుండా ఏమీ తెలియనట్టు ఠాణాకు అత్తతోపాటు గురుమూర్తి కూడా వెళ్లాడు. వెంకట మాధవి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆమె ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటకు వచ్చినట్లు ఆధారాలు లభించలేదు. గురుమూర్తి మాత్రం పదే పదే ఇంట్లోకి, బయటకు వెళ్లివచ్చినట్టు దృశ్యాలు రికార్డయ్యాయి.
ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజ్ కీలకంగా మారగా.. ఇంట్లోనే ఏదో జరిగిందనే కోణంలో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముందు పొంతనలేని సమాధానాలిచ్చిన నిందితుడు... గట్టిగా ప్రశ్నించడంతో హత్య చేసినట్లు అంగీకరించాడు. ఎముకల పొడిని, శరీరం అవశేషాలను సమీపంలోని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు మృతదేహం ఆనవాళ్ల కోసం వెతుకున్నారు.
2) Hyderabad: తక్కువ ధరకు వస్తున్నాయని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పండ్లు కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే దడుసుకుంటారు!
Hyderabad: కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్‌లో రాజ్యమేలుతున్నాయి. తయారీదారులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఆయా ఆహార పదార్థాలపై తయారీ తేదీ, ఎంత కాలంలోగా వినియోగించాలనే వాటిని ముద్రించకుండానే విక్రయిస్తున్నారు. ఆహార కల్తీపై ఇటీవలి కాలంలో అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో కొత్తగా సిగ్నల్స్ దగ్గర స్ట్రాబెరీస్ లాంటి పండ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. పండ్లు చెడిపోయినా.. కొనుగోలుదారులు చూడకుండా తక్కువ ధరకే వస్తున్నాయని పొరబడి కొనేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా చారిత్రకంగా, సాంస్కృతికంగా ఎంతో గుర్తింపు దక్కించుకున్న హైదరాబాద్ మహానగరం ఆహారం విషయంలో అభాసుపాలవుతోంది. భాగ్యనగరంలో ఆహార కల్తీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం ఆహార కల్తీలో మొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్ ఆహార ప్రియులకు శుచి శుభ్రతతో కూడిన ఆహారాన్ని అందించలేక చెడ్డపేరు తెచ్చుకుంటోంది. వీటిల్లో నాణ్యతా ప్రమాణాలు లేకుండా ఆహారం విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు.
హైదరాబాద్‌లో కల్తీ పదార్థాలు తయారు చేస్తున్న ముఠాల వ్యాపారాలు వీధివీధినా విస్తరించాయి. తక్కువ ధరలకు వస్తున్నాయని సిటీలోని మెయిన్ సిగ్నల్స్ దగ్గర అమ్మే స్ట్రాబెర్రీ ని చాలామంది కొంటున్నారు. శివారులోని రేకుల షెడ్లలోని బట్టీల్లో నాసిరకం తినుబండారాలు భారీగా తయారవుతున్నాయి. వాటిని ఇష్టమొచ్చిన పేర్లతో ప్యాకింగ్ చేసి సిగ్నల్స్ ప్రాంతాల్లో అమ్ముతున్నారు. తక్కువ ధరకి వస్తున్నాయని చాలామంది వాటిని కొంటున్నారు.
మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అనే విధంగా సిగ్నల్స్ దగ్గర అమ్మే స్ట్రాబెర్రీ పండ్ల పరిస్థితి ఉంది. చూడడానికి ఎర్రగా కనిపిస్తాయి. కానీ లోపల చూస్తే చెడిపోయి ఉంటాయి. ఫుడ్ కలర్ వేసి స్ట్రాబెర్రీ సిగ్నల్స్ దగ్గర అమ్మకాలు మొదలుపెట్టారు వ్యాపారులు. దీనివల్ల చిన్నపిల్లలు త్వరగా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే విషయం చాలామందికి తెలవక కొంటున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, ఎం జె రోడ్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువగా ఈ స్ట్రాబెర్రీ అమ్మకాలు కనిపిస్తాయి. తక్కువ ధరకి వస్తున్నాయి కదా అని కొంటున్నామంటున్నారు. కనీసం అవి ఎలా ఉన్నాయో కూడా పరిశీలించి చూడటం లేదు. నగరంలో ఆహారం అంటేనే మొత్తం కల్తీ గా మారిపోయింది. చివరికి మనకు ఆరోగ్యం ఇచ్చే పండ్లను కూడా కల్తీ చేస్తున్నారు పండ్ల వ్యాపారులు.
3) Ola, Uber: ఓలా, ఉబర్ సంస్థలకు కేంద్రం షాక్.. ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్ల మధ్య రేట్లలో తేడాలు ఎందుకు?
Ola, Uber Get Notice : యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఓలా, ఉబర్ సంస్థలకు ఊహించని షాక్ తగిలినట్లయ్యింది. ఫోన్ మోడల్ బట్టి ఎక్స్‌ట్రా ఛార్జీలు విధిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఆయా సంస్థలకు నోటీసులు పంపించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ అందిస్తున్న ఓబేర్, ఓలా సంస్థలకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ఆయా సంస్థల ప్రైసింగ్ పాలసీపై ఇటీవల ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆ రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. క్యాబ్ సర్వీస్ లు అందిస్తున్న సంస్థలు ఫోన్ రకం, ధరలను బట్టి చార్జీలు వసూలు చేస్తున్నాయి అంటూ ఆరోపణలు వచ్చాయి. అలాగే లో బ్యాటరీ ఉన్న ఫోన్ తో బుక్ చేస్తే ఎక్కువ ఛార్జిలు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు.
ఆండ్రాయిడ్ ఫోన్ కి ఒక ధర, ఐఫోన్ కు అయితే ఒక ధర ఉండడమే కాకుండా.. ఫోన్ ధరను బట్టి ధరల్లో తేడా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తి విచారణ ఇవ్వాలని ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీస్ సంస్థలకు వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఒకేసారి రెండు కంపెనీలు వేర్వేరుగా చార్జీలు వసూలు చేస్తున్నాయి అన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ విషయంపై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ చర్యలు చేపట్టింది.
ఒకేసారి సర్వీసుకు రెండు వేరువేరు ధరలు ఎలా నిర్ణయిస్తారో చెప్పాలని ఆ సంస్థలను కోరింది. చార్జీలో తేడాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొంది. చార్జీల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు సరైన వివరణ ఇవ్వాలంటూ స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి చెందిన రిషబ్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్ట్ కాస్త వైరల్ అయింది.
క్యాబ్ సర్వీస్ లో అందించే ఉబర్ సంస్థ ఫోన్ రకం తో పాటు అందులో ఉంటే బ్యాటరీ పర్సంటేజ్ ని బట్టి చార్జీల్లో వ్యత్యాసం చూపిస్తుందంటూ ఆయన ఆరోపించారు. రెండు ఆండ్రాయిడ్, రెండు ఐఫోన్లు ఉపయోగించి పరిశీలించినప్పుడు ఈ విషయాన్ని గుర్తించినట్లు ఫోటోలతో పాటు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశాడు. అన్ని డివైస్ల్లో ఒకే ఖాతాలో లాగిన్ అయితే ఒకే ప్రాంతానికి రైడ్ బుక్ చేసిన చార్జీల్లో చాలా వ్యత్యాసం ఉందని గుర్తించినట్లు రాసుకొచ్చారు. ఈ తరహా ఫిర్యాదులపై సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
4) Home Loan Tips: హోంలోన్ తీసుకున్నారా? ఈ టిప్స్‌తో రుణం త్వరగా తీర్చవచ్చు!
Home Loan Tips: హోంలోన్ తీసుకున్న వారు చిన్న చిన్న విషయాలను పాటిస్తే హోంలోన్ ను త్వరగా తీర్చుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు మార్పులు చేసిన సమయంలో హోంలోన్ తీసుకున్న వారి ఈఎంఐపై దాని ప్రభావం ఉంటుంది. హోంలోన్ తీసుకున్నవారు అసలు కంటే వడ్డీకి ఎక్కువగా చెల్లిస్తారు. హోంలోన్ భారం తగ్గించేందుకు ఆర్ధిక నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వీటిని పాటిస్తే వడ్డీ భారం కొంత తగ్గే అవకాశం ఉంది.
హోంలోన్ ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్ ఈబీఎల్ఆర్‌తో అనుసంధానమైతే ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే దాని ప్రభావం ఈఎంఐపై ఉంటుంది. అంటే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచితే ఈఎంఐ పెరుగుతుంది, తగ్గిస్తే ఈఎంఐ తగ్గుతుంది. ఒకవేళ ఈబీఎల్ఆర్ కు హోంలోన్ ను లింక్ చేయకపోతే వెంటనే బ్యాంకులో ఇందుకు సంబంధించిన ధరఖాస్తు చేయాలి. బ్యాంకు కస్టమర్ కేర్ తో సంప్రదించి ఆన్ లైన్ లో మీ ధరఖాస్తును పంపించాలి.
హోంలోన్స్ ను బ్యాంకుల్లో కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎన్ బీ ఎఫ్ సీ ద్వారా తీసుకొంటే వడ్డీ రేట్లలో మార్పులు వెంటనే అమల్లోకి రావు.. ఈ బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు రుణాన్ని ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. దీనిపై బ్యాంకు అధికారులతో చర్చించవచ్చు. దీనికి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. లేదా మీరు ప్రస్తుతం రుణం తీసుకున్న బ్యాంకు అధికారులనే వడ్డీ తగ్గించాలని కోరే అవకాశం కూడా ఉంది. మీ సిబిల్ స్కోర్ ఆధారంగా దీనిపై బ్యాంకు అధికారులు చర్యలు తీసుకుంటారు.
హౌసింగ్ లోన్లు తీసుకొనే సమయంలో ఈఎంఐ వ్యవధి తక్కువ ఉంటే కట్టే వడ్డీ కూడా తక్కువ ఉంటుంది.లోన్ టర్మ్ ఎక్కువ ఉంటే బ్యాంకుకు వడ్డీ రూపంలో ఎక్కువ చెల్లిస్తాం. ప్రతి ఏటా కనీసం ఒకటి లేదా రెండు ఈఎంఐలు చెల్లించినా మీరు తీసుకొన్న అప్పును త్వరగా క్లియర్ చేయవచ్చు. లేదా ఈఎంఐను కొంత పెంచుకోవచ్చు. సాధారణంగా చెల్లిస్తున్న ఈఎంఐకి 5 శాతం లేదా 10 శాతం పెంచుకొంటే కూడా హోంలోన్ త్వరగా క్లియర్ చేసుకోవచ్చు.
5) Mobile Recharge: సెకండ్ సిమ్ ఎప్పుడూ యాక్టివ్‌లో ఉండాలా.? ట్రాయ్ శుభవార్త!
Mobile Recharge: టెలికం యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రీఛార్జ్ ధరలు భారీగా పెరిగిన ప్రస్తుత తరుణంలో సిమ్ ఎప్పుడూ యాక్టివ్‌లో ఉండే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రెండు సిమ్‌లు ఉపయోగించే వారికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేయనుంది. ఎలాంటి రీఛార్జ్ చేయకుండానే సిమ్ యాక్టివ్‌లో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.
ట్రాయ్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎయిర్‌టెల్ వినియోగదారులు ఇప్పుడు రీఛార్జ్ చేయకుండా 90 రోజుల పాటు సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఆ తర్వాత కూడా 15 రోజుల గ్రేస్ పీరియడ్‌ను అందిస్తారు. ఈ సమయంలో తప్పనిసరిగా రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వ్యవధిలోపు నంబర్ రీఛార్జ్ చేయకపోతే నంబర్ డీయాకటివేట్ అవుతంది. అప్పుడు మీ నెంబర్‌ను మరో యూజర్‌కు కేటాయిస్తారు.
జియో సిమ్ విషయానికొస్తే వీరు కూడా 90 రోజుల పాటు సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకునే సదుపాయం తీసుకొస్తున్నారు. అయితే ఇన్‌కమింగ్ కాల్ సర్వీస్ మీరు అంతకు ముందు చేసిన రీఛార్జ్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ 90 రోజుల తర్వాత రీఛార్జ్ చేయకపోతే సిమ్ పర్మినెంట్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సుదీర్ఘమైన చెల్లుబాటును అందిస్తోంది. ఎలాంటి రీఛార్జ లేకుంఆ 180 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది.
వోడాఫోన్ ఐడియా సిమ్ యూజర్లకు 90 రోజుల గ్రేస్ పీరియడ్‌ని అందించారు. ఆ తర్వాత సిమ్ యాక్టివ్‌గా ఉండాలంటే కనీసం రూ. 49తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సిమ్ 90 రోజుల కంటే ఎక్కువ యాక్టివ్‌గా ఉండి, ఖాతాలో 20 నుంచి రూ. 30 వరకు బ్యాలెన్స్ ఉండాలి. ఈ బ్యాలెన్స్ నుంచి నేరుగా అమౌంట్ కట్ అయ్యి సిమ్ యాక్టివ్‌లో ఉంటుంది.
6) అమెరికాలో ట్రంప్ భయానికి ముందే సిజేరియన్ చేయించుకుంటున్న ఇండియన్స్
Birthright citizenship deadline: డోనాల్డ్ ట్రంప్ అమెరికాలో బర్త్ రైట్ సిటిజెన్ షిప్ రద్దు చేస్తూ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ కాపీపై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 20వ తేదీ నుండి ఈ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ అమలులోకి రానుంది. డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, ఫిబ్రవరి 20 తరువాత అమెరికాలో అమెరికా పౌరసత్వం లేని విదేశీయులకు పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు.
ఇప్పటివరకు ఉన్న రూల్ ప్రకారం విదేశీయులకైనా సరే అమెరికాలో పిల్లలు పుడితే, ఆ పిల్లలకు జన్మతః అమెరికా పౌరసత్వం వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఆల్రెడీ అమెరికాలో స్థిరపడి, అక్కడి పౌరసత్వం ఉన్న వారికి పుట్టిన పిల్లలకు మాత్రమే ఇకపై పౌరసత్వం వస్తుంది.
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొత్త పరిష్కారం వెతుక్కుంటున్న ఇండియన్స్ అమెరికాలో పౌరసత్వం లేని విదేశీయులకు ఎదురైన ఈ కొత్త సమస్యకు చెక్ పెట్టేందుకు వారు కొత్త దారి వెదుక్కుంటున్నారు. అదే సిజేరియన్. అయితే, ఇది అందరికీ సాధ్యపడదు. ఫిబ్రవరి 20వ తేదీకి కాస్త అటు ఇటుగా డెలివరీ డేట్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్‌కు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
అందుకే ప్రస్తుతం 8వ నెల లేదా 9వ నెలలో ఉన్న గర్భవతులు అక్కడి మెటర్నిటీ క్లీనిక్స్‌లో డాక్టర్స్‌ను కలిసి సిజేరియన్ గురించి సలహా తీసుకుంటున్నారు. సాధ్యమైనంతవరకు బర్త్ రైట్ సిటిజెన్ షిప్ ఆదేశాలు అమలులోకి రాకముందే సిజేరియన్ చేయించుకుననైనా సరే బిడ్డకు జన్మినివ్వాలని భావిస్తున్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా కథనం ప్రకారం న్యూజెర్సీలో మెటర్నిటీ క్లీనిక్ రన్ చేస్తోన్న డా ఎస్.డి. రమ అనే డాక్టర్ వద్దకు ఇప్పుడు సి-సెక్షన్ కోసం విదేశీయులు క్యూ కడుతున్నారు. అందులో ఎక్కువగా 8, 9 నెలల గర్భంతో ఉన్న ఇండియన్స్ ఉన్నారు. ఇంకొంతమంది డెలివరీ డేట్ కంటే చాలా ముందే సి-సెక్షన్ చేయించుకునే అవకాశం ఉందా అని కూడా ఆరా తీస్తున్నారు అని డా రమ చెప్పినట్లుగా ఆ వార్తా కథనం వెల్లడించింది.
ఒక మహిళ 7 నెలల గర్భంతో ఉన్నారు. మార్చి నెలలో ఆమెకు డెలివరీ డేట్ ఉంది. కానీ ఫిబ్రవరి 20 లోపే సి-సెక్షన్ చేసి డెలివరీ చేయించాల్సిందిగా ఆమె కోరుతున్నారు. ఆమె వెంట ఆె భర్త కూడా వచ్చారని ఆ డాక్టర్ చెబుతున్నారు.
ప్రీటర్మ్ బర్త్ (నెలల నిండకు ముందే డెలివరీ చేయించుకోవడం) సాధ్యమే అయినప్పటికీ... అది గర్భిణీలకు, పుట్టబోయే బిడ్డకు మంచిది కాదని తను వారిని హెచ్చరిస్తున్నట్లు డాక్టర్ చెప్పారు. 9 నెలలు నిండక ముందే సి-సెక్షన్ చేయించుకుంటే పుట్టబోయే బిడ్డలో అవయవాలు పూర్తిగా ఎదగకపోవడం, వారి ఆరోగ్యరీత్యా ఏవైనా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఈ వీడియో కూడా చూడండి : Donald Trump: బర్త్ రైట్ సిటిజెన్‌షిప్ రద్దు.. ఇక వారిని తిరిగి ఇండియాకు పంపించేస్తారా?
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire