
భార్యను ఒక్క చెంపదెబ్బ కొడితే క్రూరత్వం కాదు.. గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు
Gujarat High Court : గుజరాత్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక సంచలన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. భార్యాభర్తల మధ్య గొడవలు, గృహ హింసకు సంబంధించి కోర్టు చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భర్త భార్యను ఒకసారి కొట్టడాన్ని (ఒక చెంపదెబ్బను) క్రూరత్వంగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తిని నేరస్థుడిగా నిర్ధారించాలన్నా లేదా క్రూరత్వం కింద కేసు నమోదు చేయాలన్నా బలమైన సాక్ష్యాధారాలు ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఇది దాదాపు 28 ఏళ్ల నాటి పాత ఉదంతం. 1996లో దిలీప్భాయ్ మంగళాభాయ్ అనే వ్యక్తి భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త తనను వేధిస్తున్నాడని, రోజూ కొడుతున్నాడని అందుకే ఆమె ప్రాణాలు తీసుకుందని మహిళా తరపు బంధువులు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు 2003లో దిలీప్‌భాయ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఐపీసీ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద అతడిని దోషిగా తేల్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ దిలీప్భాయ్ హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా ఆయనకు ఊరట లభించింది.
ఈ కేసులో అసలు గొడవకు కారణం భర్త ఆదాయం కోసం రాత్రిపూట బాంజో వాయించడానికి వెళ్లడమే. భర్త అలా బయటకు వెళ్లడం భార్యకు నచ్చేది కాదు, దీంతో వారి మధ్య తరచూ చిన్నపాటి గొడవలు జరిగేవి. ఒకరోజు భార్య ఎవరికీ చెప్పకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో తీవ్ర ఆందోళనకు గురైన భర్త, ఆమెను తిరిగి ఇంటికి తెచ్చే క్రమంలో కోపంతో ఒక చెంపదెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై జస్టిస్ గీతా గోపి విచారణ జరుపుతూ.. కేవలం ఒక చెంపదెబ్బ కొట్టినంత మాత్రాన అది ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని, అలాగే అది భరించలేని క్రూరత్వం కిందకు రాదని పేర్కొన్నారు.
క్రూరత్వం లేదా వేధింపులను నిరూపించాలంటే నిరంతరాయంగా జరిగే భౌతిక దాడులు లేదా మానసిక వేధింపులకు సంబంధించిన బలమైన ఆధారాలు ఉండాలని కోర్టు వెల్లడించింది. సాధారణ సంసారంలో జరిగే చిన్నపాటి మనస్పర్థలను లేదా ఒకసారి జరిగిన సంఘటనను క్రిమినల్ నేరంగా చూడలేమని చెబుతూ.. దిలీప్‌భాయ్‌కు పడిన ఏడేళ్ల శిక్షను హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




