Budget 2024: నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో 10 ముఖ్యాంశాలు

Here are the Top 10 Points About the Budget 2024
x

Budget 2024: నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో 10 ముఖ్యాంశాలు

Highlights

Budget 2024: కేంద్ర బడ్జెట్ 2024-25 ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు.

Budget 2024: కేంద్ర బడ్జెట్ 2024-25 ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. వేతన జీవులకు బడ్జెట్ లో స్వల్ప ఊరట దక్కింది. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు భారీగా నిధులు ఇవ్వనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. మరో వైపు బంగారం, వెండిపై పన్ను తగ్గించాలని నిర్ణయించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి.

1. అమరావతికి రూ. 15 వేల కోట్ల నిధులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి రూ. 15 వేల కోట్ల నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే అదనపు నిధులు ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి అవసరమైన నిధులను అందిస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల అభివృద్దికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. రోడ్లు, రహదారులతో పాటు, పారిశ్రామిక అవసరాల కోసం అవసరమైన నిధులను కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది.

2. ఆదాయ పన్ను స్లాబ్ ల్లో మార్పులు.. వేతన జీవులకు స్వల్ప ఊరట

ఆదాయపన్ను స్లాబ్ లలో మార్పుల కారణంగా ఉద్యోగులకు రూ. 17,500 పన్ను ఆదా ఆవుతుంది. స్టాండర్డ్ డిడక్షన్ ను రూ. 50వేల నుంచి రూ. 75 వేలకు పెంచారు. దీన్ని రూ. 1 లక్ష వరకు చేయాలని ఉద్యోగస్తులు కోరుకున్నారు.

ఆదాయ పన్నుల్లో కొత్త స్లాబ్ లు

0- రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపు

రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం పన్ను

రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం పన్ను

రూ.10లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను

రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను

రూ.15 లక్షలకు పైగా 30 శాతం పన్ను విధించనున్నారు.

3. బీహార్ కు రూ. 26 వేల కోట్లు నిధులు

బీహార్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ. 26 వేల కోట్లను ప్రకటించింది. రోడ్ల అభివృద్దికి రూ. 26 వేల కోట్ల ఆర్ధికసహాయం చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జాతీయ రహదారుల కోసమే రూ. 20 వేల కోట్లు కేటాయించింది. బక్సర్ జిల్లాలో గంగానదిపై రెండులైన్ల వంతెన నిర్మాణం, భాగల్ పురలో పిర్ పౌంతీలో రూ. 21,400 కోట్లతో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టుగా కేంద్రం హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల అభివృద్దికి కృషి చేస్తామని హామీ ఇచ్చింది.

4. బంగారం, వెండి ధరల తగ్గుదల

బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో బంగారం, వెండి, ప్లాటినం ధరలు తగ్గనున్నాయి. మరోవైపు 25 ఖనిజాలపై కూడా పన్నును తగ్గిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. మొబైల్ ఫోన్లు, మొబైల్స్ కు చెందిన యాక్సెరీస్ లపై పన్నులను తగ్గిస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో మొబైల్స్ ధరలు తగ్గనున్నాయి. క్యాన్సర్ రోగులు ఉపయోగించే మూడు రకాల మందులపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించనున్నారు. దీంతో ఈ ధరలు తగ్గనున్నాయి. రొయ్యలు, చేపల ఫీడ్ ధరలు కూడా తగ్గుతాయి.

5. నాలుగు రంగాలపై ఫోకస్

పేదలు, యువత, రైతులు, మహిళలపై బడ్జెట్ 2024-25 పై ఫోకస్ చేసినట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ బడ్జెట్ లో 9 ప్రాధాన్యతలున్నాయని కూడా ఆమె వివరించారు.

ఉపాధి, స్కిల్స్ కు ప్రాధాన్యత, వ్యవసాయరంగంలో ఉత్పాదకత పెంచడం, మానవ వనరుల అభివృద్ది, సామాజిక న్యాయం, తయారీ, సేవలు, అర్బన్ డెవలప్ మెంట్, ఎనర్జీ సెక్యూరిటీస్, మౌళిక సదుపాయాలు, ఇన్నోవేషన్, ఆర్ అండ్ డి నెక్స్ట్ జనరేషన్ తమ ప్రాధాన్యతలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

6. విద్యార్థులకు రూ. 10 లక్షలు ఎడ్యుకేషన్ లోన్

విద్యార్థులు ఉన్నత విద్య చదువుకునేందుకు రూ. 10 లక్షలను ఇవ్వనున్నట్టుగా కేంద్రప్రభుత్వం తెలిపింది. దేశీయ విద్యా సంస్తల్లో విద్య కోసం రుణం అందించనుంది. ఈ రుణ మొత్తంలో 3 శాతం వార్షిక వడ్డీ రాయితీ కోసం ప్రతి ఏటా లక్ష మంది విద్యార్థులకు ఈ వోచర్లను నేరుగా ఇస్తారు. వెయ్యి పారిశ్రామిక శిక్షణా సంస్థలను అప్ గ్రేడ్ చేస్తామని, రూ.7.5 లక్షల వరకు రుణాలు పొందేలా మోడల్ స్కిల్ లోన్ స్కీమ్ ను సవరించనున్నట్లు తెలిపారు. దీనివల్ల ఏడాదికి 25 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. బీహార్ లో మెడికల్ కాలేజీలు, స్పోర్ట్స్ ఇన్ స్టిట్యూట్ లను నిర్మిస్తామన్నారు.

7. మహిళల కోసం రూ. 3 లక్షల కోట్లు కేటాయింపు

మహిళాభివృద్ది కోసం బడ్జెట్ లో రూ. 3 లక్షల కోట్లు కేటాయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహిళల ప్రత్యేక నైపుణ్య కార్యక్రమాలు, మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాల (స్వయం సహాయక బృందాలు) ప్రోత్సహించేలా కార్యాచరణ ఉంటుందని కంద్ర ప్రభుత్వం తెలిపింది. మరో వైపు మహిళల పేరున కొనుగోలు చేసే ఆస్తులకు తక్కువ స్టాంప్ డ్యూటీ రేట్లను తగ్గించింది.

8. పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం, అర్బన్ హౌసింగ్ కోసం ఐదేళ్లలో రూ. 2.2 లక్షల కోట్లు కేటాయించినట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం చేపట్టనున్నట్టుగా కేంద్ర మంత్రి చెప్పారు.

9. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.5 లక్షల కోట్లు

వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల అభివృద్దికి రూ.1.5 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రకృతి వ్యవసాయంలోకి కోటి మంది రైతులను తీసుకొచ్చే విధంగా ప్రణాళికను ప్రకటించింది. ఎంపిక చేసిన నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్ ల ఏర్పాటు చేయనున్నట్టుగా కేంద్రం తెలిపింది. రాష్టాల మౌళిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ. 1.5 లక్షల కోట్లతో దీర్ఘకాల వడ్డీ లేని రుణాలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.

10. మౌళిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లు

దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 11.11 లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది. జీడీపీలో ఇది 3.4 శాతానికి సమానం. మరో వైపు కొత్త ఉద్యోగులకు మూడు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. సంఘటిత రంగంలోని ప్రవేశించిన ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లించనుంది. అయితే ఇది గరిష్టంగా రూ. 15 వేలు. నెలకు గరిష్టంగా రూ. 1లక్షలోపు వేతనం ఉన్నవారే ఇందుకు అర్హులు.

Show Full Article
Print Article
Next Story
More Stories