TOP 6 News @ 6PM: పార్టీ ఫిరాయింఫు ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలొస్తే... కడియం శ్రీహరి జవాబిదే

Kadiyam Srihari, KTR, Harish Rao, Delhi next CM, Ind vs Eng, Donald Trump
x

TOP 6 News @ 6PM: పార్టీ ఫిరాయింఫు ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలొస్తే... కడియం శ్రీహరి జవాబిదే

Highlights

1) పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే... కడియం శ్రీహరి జవాబిదే బీఆర్ఎస్ పార్టీతో స్నేహం చేయడమే ఆమ్ ఆద్మీ పార్టీ...

1) పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే... కడియం శ్రీహరి జవాబిదే

బీఆర్ఎస్ పార్టీతో స్నేహం చేయడమే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణమైందని స్టేషన్ ఘణుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఢిల్లీలో బీజేపి గెలిస్తే... ఇక్కడ కేటీఆర్ సంతోషపడుతున్నారన్నారు. ఒకవేళ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసి ఉండుంటే గెలిచి ఉండే వారని కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో గత పదేళ్లలో కేసీఆర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని కడియం శ్రీహరి అన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించిన బీఆర్ఎస్ పార్టీకి అసలు ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ అంశం గురించి తాను ఏమీ మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. అయితే, కోర్టు తీర్పు ఏదైనా దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే పోటీకి వెనుకాడనని తేల్చిచెప్పారు.

2) ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 31 మంది నక్సల్స్, ఇద్దరు పోలీసులు మృతి

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఇవాళ భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరు జవాన్లను హెలీక్యాప్టర్ ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేసి బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇటీవల కాలంలో అత్యధిక సంఖ్యలో నక్సలైట్లను మట్టుబెట్టిన భారీ ఎన్‌కౌంటర్ ఇదే. ఇప్పటికి ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతూనే ఉంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగొచ్చని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు తెలిపారు. ఎన్ కౌంటర్ పూర్తయితే కానీ మొత్తం మృతుల సంఖ్య ఎంతో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం ఉదయం నుండే ఈ ఎన్‌కౌంటర్ కోనసాగుతోంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) Delhi's Next CM?: ఢిల్లీ సీఎం పదవికి అతిషి రాజీనామా... కొత్త సీఎం పేరు ఎప్పుడు చెబుతారంటే...

Delhi CM Atishi resigns: ఢిల్లీ సీఎం అతిషి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం అతిషి రాజ్ నివాస్‌కు వెళ్లి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సెనాకు తన రాజీనామా లేఖను అందించారు. అతిషి మార్లెనా గత ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అవడంతో ఆమెకు ఆ బాధ్యతలు అప్పగించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపాలైంది. ఆ పార్టీకి కేవలం 22 స్థానాలే వచ్చాయి. ఇక 27 ఏళ్లుగా అధికారానికి దూరమైన బీజేపి ఈ ఎన్నికల్లో 48 స్థానాలు గెలుచుకుని త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4) Manipur CM Biren Singh: మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ రాజీనామా

Manipur CM Biren Singh: మణిపూర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మణిపూర్ లో గత రెండేళ్లుగా అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్ల కారణంగా మణిపూర్ సర్కార్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటోంది.

ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోయిందని అక్కడి విపక్షాలు అనేక సందర్భాల్లో ఆందోళనలు కూడా చేశాయి. సీఎం బిరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఈ అల్లర్లకు నైతిక బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తోంది.

మరోవైపు అధికారంలో ఉన్న బీజేపిలోనూ అంతర్గతంగా కొన్ని విభేదాలు నెలకున్నాయి. మణిపూర్ ప్రజల్లోనే కాకుండా బీజేపి ఎమ్మెల్యేల్లోనూ ప్రభుత్వంపై నమ్మకం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పూర్తి వార్త కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) ఇండియా టార్గెట్ 305

ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ప్రత్యర్థి జట్టు భారత్‌కు భారీ స్కోర్ లక్ష్యంగా విధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. 65 పరుగులతో బెన్ డకౌట్, 69 పరుగులతో జో రూట్ చెలరేగిపోయారు. చివర్లో క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టన్ కూడా 41 పరుగులు చేసి ఇంగ్లండ్ స్కోర్ పెంచడంలో కీలకంగా వ్యవహరించారు. హ్యారీ బ్రూక్ 31, జోస్ బట్లర్ 34, ఫిల్ సాల్ట్ 26 పరుగులు చేశారు. దూకుడు ప్రదర్శించిన బెన్ డకౌట్, జో రూట్ వికెట్లను రవింద్ర జడేజా పడగొట్టడంతో వారి దూకుడుకు బ్రేక్ పడింది.

ప్రస్తుతం టీమిండియా తరుపున రోహిత్ శర్మ (29), శుభ్‌మాన్ గిల్ (16) బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా లక్ష్యం 305 పరుగులు.

6) Protests in US: అమెరికాలో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా విదేశీయుల ఆందోళన

Protests against Donald Trump in US: అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ విధానాలకు వ్యతిరేకంగా విదేశీయుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్ ఎదుట మూడు దేశాలకు చెందిన నిరసనకారులు ఆందోళనకు దిగారు. డోనల్డ్ ట్రంప్ తరచుగా తన ఖాళీ సమయాల్లో కాలక్షేపం కోసం ఈ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌కు వస్తుంటారు. శనివారం మధ్యాహ్నం కూడా ట్రంప్ ఇక్కడికి వచ్చారని తెలుసుకున్న విదేశీయులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు.

ఒక చేత మెక్సికో, గ్వాటేమాల, అమెరికా దేశాల జాతీయ జండాలు పట్టుకున్నారు. మరో చేత అమెరికా అనుకూల నినాదాలతో రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకున్నారు. అమెరికాలో బతుకుతున్నాం కనుక తాము కూడా అమెరికా అభివృద్ధినే కోరుకుంటామని, తమను శత్రువుల్లా చూడొద్దని నినాదాలు చేశారు. "ఇమ్మిగ్రెంట్స్ మేక్ అమెరికా గ్రేట్" అనే నినాదాలు కూడా చేశారు. మేక్ అమెరికా గ్రేట్ ఏగైన్ (MAGA) అనే డోనల్డ్ ట్రంప్ నినాదాన్ని దృష్టిలో పెట్టుకునే వారు ఈ నినాదాలు చేశారని అర్థమవుతోంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories